ఇటీవల ప్రాంక్ వీడియోల కల్చర్ ఎక్కువైంది. కొందరు యువతీ యువకులు ప్రాంక్ వీడియోలు చేసి రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలని ట్రై చేస్తూ ఉంటున్నారు. అయితే ఈ ప్రాంక్ వీడియోలు సక్రమంగా జరిగితే ఏ గొడవా లేదు. ఏదైనా కథ అడ్డం తిరిగితేనే అసలు సినిమా కనబడుతుంది.
తాజాగా.. ఓ యువకుడు వైరల్ వీడియోస్ తీసి పాపులర్ అవుదాం అనుకున్నాడు. కానీ, సీన్ రివర్స్ అయ్యేసరికి బొక్క బోర్లా పడ్డాడు. చివరకు జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిత్తూరు జిల్లాకు చెందిన సయ్యద్ కరీముల్లా అనే వ్యక్తి వయసు 21 సంవత్సరాలు. ఇతను టెడ్డి బేర్ వేషధారణ వేసుకుని గుడియాత్తం కాలేజీ రోడ్ లో ప్రాంక్ వీడియో చేయాలని అనుకున్నాడు. అటుగా వెళ్తున్న విద్యార్థినులు, మహిళలపై ప్రయోగం చేద్దాం అనుకున్నాడు. చిన్నపిల్లలను భయపెట్టడం, అమ్మాయిలను పట్టుకుని లాగడం వంటి పనులు చేసాడు. తరువాత ప్రాంక్ వీడియో అంటూ చెప్పేవాడు.
అతని ప్రవర్తనకి విసిగిపోయిన కొందరు మహిళలు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనితో పలమనేరు పోలీసులు రంగంలోకి దిగారు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న అతనిని పట్టుకుని అరెస్ట్ చేసారు. అందుకే అతి సర్వత్ర వ్యర్జయేత్ అని పెద్దలు చెబుతుంటారు.


