Ads
నట శేఖర కృష్ణ..తెలుగు వెండి తెరకు సరికొత్త ఒరవడులుదిద్దుతూ.. ఆయన పరిచయం చేయని జోనర్ లేదు అంటే అతిశయోక్తి కాదు. సినీ పరిశ్రమలోని 24 క్రాప్ట్స్ పై పట్టు ఉన్న కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో చేయని ప్రయోగం లేదు. టాలీవుడ్‌కు కౌబాయ్, జేమ్స్ బాండ్ చిత్రాలను పరిచయం చేసిన హీరో. తెలుగు సినిమా ఖ్యాతిని మరోస్థాయికి తీసుకువెళ్లి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.
Video Advertisement
అయితే ఇవన్నీ ఒక ఎత్తు.. ఆయన నటించి నిర్మించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం మరో ఎత్తు. 52 ఏళ్ళ క్రితం ఆగస్టు 27, 1971 న విడుదలై, పద్మాలయా బ్యానర్ పై వచ్చిన తొలి పాన్ వరల్డ్ మూవీగా పెను సంచలనం సృష్టించింది. కే.యస్.ఆర్. దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి భారతీయ కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ఈ చిత్రం విడుదలై 5 దశాబ్దాలు అవుతోంది. అప్పట్లోనే ఈ చిత్రం ఎన్నో రికార్డులు సాధించింది.
ఎడారులు, గుర్రపు ఛేజింగ్‌లు, నిధి కోసం ఎత్తుకు పై ఎత్తులు, ఎంతో ఉత్కంఠ రేపే కథా కథనాలు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఉత్కంఠభరిత సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమాతో కృష్ణను తెలుగు ప్రేక్షకులు ఆంధ్రా కౌబాయ్ అని పిలవడం మొదలు పెట్టారు. ఈ చిత్రాన్ని రూ. 6 లక్షల 30 వేలతో నిర్మించారు. కేవలం తమిళ డబ్బింగ్ వెర్షన్‌లోనే దాదాపు రూ. 7లక్షలు కలెక్ట్ చేసి తమిళంలో కూడా ఓ చరిత్ర సృష్టించింది.
తర్వాత ఈ చిత్రాన్ని హిందీలో ‘ఖజానా’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. అక్కడ కూడా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఇంగ్లీష్‌లో ‘ది ట్రెజర్ హంట్’ పేరుతో డబ్ చేసారు. హిందీ, తమిళం, ఇంగ్లీష్‌తో పాటు రష్యన్, స్పానిష్‌తో పలు భాషల్లో డబ్ చేయబడింది. ఇలా అప్పట్లోనే 125 దేశాల్లో రిలీజైన తొలి భారతీయ ప్యాన్ వరల్డ్ సినిమాగా సూపర్ స్టార్ కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’ రికార్డు క్రియేట్ చేసింది.
పలు హాలీవుడ్ చిత్రాల ప్రేరణతో రచయత ఆరుద్రతో ఈ చిత్ర కథని సిద్ధం చేయించుకున్నారు కృష్ణ. ఆరుద్ర గారు బొబ్బిలి యుద్ధం, జరిగిన రోజుల్లో బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు మన దేశంలో అడుగుపెట్టినపుడు ఉన్న సంస్థానాల నేపథ్యంలో ఈ కథను రెడీ చేసారు. రాజస్థాన్‌లోని థార్ ఎడారి, బికనీర్ కోట, శివబాడి టెంపుల్, దేవీకుండ్ సాగర్, సిమ్లా, కుప్రీ, టిబెట్‌కు సమీపన గల నార్కండా ‘స్నోఫాల్’తో పాటు సట్లేజ్ నదీ తీరాన తట్టాపానీ, పాండిచ్చేరి, మద్రాస్ ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేసారు.
ఈ చిత్రానికి ఆది నారాయణ రావు సంగీతం అందించారు. ఈ చిత్రంలో పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇక వి.యస్.ఆర్.స్వామి సినిమాటోగ్రఫీ అందించారు. సరికొత్త యాంగిల్స్ లో హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ ఉంటాయి. అలాగే ఈ చిత్రం 1972లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది.
ఇలా ఎన్నో ప్రత్యేకతలను, రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మరో సారి రిలీజ్ కానుంది. రీమాస్టర్ చేసిన, డోల్బీ సౌండ్ తో 4 కే రిజల్యూషన్ తో థ్రిల్ చేసేందుకు సిద్ధం అయింది. తాజాగా మహేష్‌బాబు ఈ సినిమా రీ-రిలీజ్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశాడు. ట్రెండ్‌కు తగ్గట్లుగా మేకర్స్ ట్రైలర్‌ను కట్ చేశారు. అంతేకాకుండా క్వాలిటీ కూడా అద్భుతంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఈ చిత్రం రి రిలీజ్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
watch trailer:
End of Article