Ads
వాళ్ళు ఎవరో మనకి వ్యక్తిగతంగా తెలియదు. కానీ వాళ్ళని చూస్తున్నంత సేపు ఏదో ఒక తెలియని ఆనందం. వాళ్లే సెలబ్రిటీలు. అందులోనూ సినిమా వాళ్లకి, సాధారణ ప్రజలకు ఏదో తెలియని అనుబంధం ఉంటుంది.
Video Advertisement
వాళ్ల గురించి మనకి పర్సనల్ గా ఏం తెలియకపోయినా కూడా వాళ్ళని చూసి మన వాళ్లు అని అనుకుంటాం. ప్రేక్షకులకి అంత దగ్గర అవ్వడానికి కారణం ఆ హీరోలు ఎన్నో సంవత్సరాలు శ్రమించి తెచ్చుకున్న గుర్తింపు.
మన చిన్నప్పుడు ఆ హీరోలు మనకి ఎలా అయితే కనిపించారో, మనం పెద్దయ్యాక కూడా వాళ్ళని మనం అంతే హుషారుగా చూడాలి అనుకుంటాం. హీరోలకి కూడా ప్రేక్షకుల మైండ్ సెట్ అర్థం అవుతుంది కాబట్టి వారు కూడా అలాగే మనల్ని ఎంటర్టైన్ చేయాలి అని శ్రమిస్తూ ఉంటారు. కానీ ఇందులో మనం మర్చిపోయిన ఒక విషయం ఏంటి అంటే ఆ హీరోలకి కూడా వయసు అయిపోతుంది. మన చిన్నప్పుడు వాళ్ళు చేసిన పాత్రలు మనం పెద్దయ్యాక కూడా వాళ్ళు చేస్తూ ఉంటే చూడడానికి కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతోంది కూడా అదే.
మన ఇండస్ట్రీలో నాలుగు పెద్దదిక్కులు అని చెప్పుకునే నలుగురు హీరోలు సినిమాలు చేస్తూనే ఉన్నారు. అందులో కాలానికి తగ్గట్టుగా సినిమాల ఎంపికలో కూడా మారిన హీరోలు ఇద్దరు మాత్రమే. ఇంకొక ఇద్దరు హీరోలు మాత్రం 20 సంవత్సరాల వెనకే ఆగిపోయారు అనిపిస్తుంది. ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి వెంకటేష్. వెంకటేష్ మొదటి నుండి నటించిన సినిమాలు చూస్తూ ఉంటే ఆయన ఎన్ని రకాల పాత్రలు పోషించారు అర్థం అవుతుంది. ప్రతి సినిమాకి ఏదో కొత్తదనం ఉండాలి అని తపనపడే హీరోల్లో వెంకటేష్ ఒకరు.
వెంకటేష్ కి స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా అది బ్యాలెన్స్ చేస్తూనే నటుడిగా తనని తాను మెరుగుపరుచుకున్నారు. ఇప్పుడు వెంకటేష్ వయసు 60 దాటింది. ఆయన వయసుకి తగ్గట్టే ఆయన సినిమాలు చేస్తున్నారు. అది రీమేక్ సినిమా అయినా, ఒరిజినల్ సినిమా అయినా కూడా తన పాత్ర నిజంగా తనకి సరిపోతేనే చేస్తున్నారు అని ఈ మధ్య వెంకటేష్ చేస్తున్న సినిమాలు చూస్తుంటే అర్థం అవుతుంది. నారప్ప సినిమాలో వెంకటేష్ ఒక యుక్త వయసు ఉన్న అబ్బాయికి, ఒక టీనేజ్ అబ్బాయికి, ఇంకొక అమ్మాయికి తండ్రిగా నటించారు. దృశ్యంలో కూడా ఇద్దరు అమ్మాయిలకి తండ్రిగా నటించారు.
కమర్షియల్ సినిమా ఆయన వెంకీ మామ సినిమాలో కూడా నాగ చైతన్య కి మామయ్యగా తన వయసుకి తగ్గ పాత్ర పోషించారు. నాగార్జున కూడా సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ అయిన బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య కి తండ్రిగా నటించారు. నాగార్జున మొదటి నుండి ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. మన్మధుడు 2 సినిమాలో కూడా ఎంత వయసు వచ్చినా పెళ్లికి దూరంగా ఉన్న ఒక వ్యక్తి పాత్రలో నటించారు. వీళ్ళతో పోలిస్తే మిగిలిన ఇద్దరు హీరోలు మాత్రం కాస్త వెనకబడి ఉన్నారు అనిపిస్తుంది.
బాలకృష్ణ అయితే గత 20 సంవత్సరాలు నుండి ఒకటే రకమైన ఫార్ములా ఫాలో అవుతున్నారు. తండ్రిగా నటిస్తారు. కానీ ఆయన కొడుకుగా కూడా ఆయనే నటిస్తారు. అది ఒక టైంలో ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. కానీ ఇటీవల వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాలో ఈ విషయం ప్రేక్షకులకు చాలా ఇబ్బందిగా అనిపించింది అనే కామెంట్స్ గట్టిగా వినిపించాయి. ఆయన ఎంత కవర్ చేసినా కూడా శృతి హాసన్ పక్కన ఆయన వయసు తెలిసిపోతుంది. ఇప్పుడు చిరంజీవి విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య, ఇప్పుడు వచ్చిన భోళా శంకర్ సినిమాల్లో ఇంకా యంగ్ గా కనిపించడానికి చిరంజీవి ప్రయత్నించారు.
చిరంజీవి నటుడిగా తనని తాను ఎప్పుడో నిరూపించుకున్నారు. అప్పట్లోనే స్వయంకృషి లాంటి సినిమాలో సర్వదమన్ బెనర్జీకి మామయ్య గా నటించారు. కొన్ని సినిమాల్లో అప్పట్లోనే తండ్రిగా కూడా నటించారు. కానీ ఇప్పుడు మాత్రం కమర్షియల్ ఇమేజ్ లో ఇరుక్కుపోయారు ఏమో అనిపిస్తుంది. నాగార్జున, వెంకటేష్ కూడా కమర్షియల్ సినిమాలు చేయట్లేదు అని చెప్పలేం. అలా చేస్తూనే వారు వారి వయసుకు తగ్గ పాత్రలు కూడా చేస్తున్నారు. ఇటీవల వచ్చిన కమల్ హాసన్ విక్రమ్, రజనీకాంత్ జైలర్ సినిమాల్లో తాతలుగా నటించారు.
అలా నటించిన అంత మాత్రాన వారి ఇమేజ్ ఏమీ డామేజ్ అవ్వలేదు. వారు అప్పుడు హీరోలే. ఇప్పుడు కూడా హీరోలే. ఈ విషయాన్ని చిరంజీవి, బాలకృష్ణ లాంటి వాళ్లు ఎప్పుడు తెలుసుకుంటారు అని అందరూ అంటున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన పెద్దన్న సినిమా కమర్షియల్ సినిమా అయినా కూడా ప్రేక్షకులు దాన్ని రిజెక్ట్ చేశారు. కానీ మన హీరోలు అలాంటి కమర్షియల్ సినిమాలు చేస్తూ ఉంటే ప్రేక్షకులు విజిల్స్ వేస్తున్నారు. ఇటీవల వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా దానికి ప్రత్యక్ష ఉదాహరణ.
మలయాళం ఇండస్ట్రీలో అయితే మోహన్ లాల్ లాంటి నటులు తండ్రిగా కూడా చేయడానికి ముందు ఉంటారు. వీరి కొడుకులు కూడా హీరోలు అయ్యాక వీరు కూడా హీరో పాత్రలే పోషిస్తూ ఉంటే మనం దాన్ని ఏదో గొప్ప విషయంగా భావించి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మొదలు పెట్టాము. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ హీరోలు తమ వయసుకి తగ్గ పాత్రలు చేయట్లేదు. అదే వయసు ఉన్న మిగిలిన హీరోలు మాత్రం ఈ విషయం గ్రహించి తమకి తగ్గ పాత్రలు చేస్తున్నారు. కానీ వారిని ఇప్పటికి కూడా హీరోలు అని అంటారు. అమితాబ్ బచ్చన్ హీరోగా చేయడం ఆపేసి 30 సంవత్సరాల పైనే అయ్యి ఉంటుంది.
ఒక రకంగా చెప్పాలి అంటే అసలు ఇలా వయసుకు తగ్గ పాత్రలు చేయడం అనే విషయం వస్తే అమితాబ్ ముందు ఉంటారు. ఒక సమయం తర్వాత అమితాబ్ వయసుని కవర్ చేసుకోవడం ఆపేసి బలంగా ఉండే పాత్రలు ఉన్న సినిమాలు చేయడం మొదలు పెట్టారు. అప్పుడే ఆయన గొప్ప నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది చాలా అభినందించాల్సినదగ్గ విషయం. వీళ్ళ అందరిని చూసి మన హీరోలు కూడా నేర్చుకోవాలి ఏమో.
ఒకవేళ ఇలాంటి సినిమాలు మాకు వద్దు అని ప్రేక్షకులు చెప్తే హీరోలు కూడా కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేస్తారు ఏమో. వారు చేసే ప్రయోగాత్మక చిత్రాలని రిజెక్ట్ చేసి మనం చేసిన తప్పుకి వారిని కూడా ప్రతి సారి నిందించలేము. యంగ్ హీరోలు అయిన నానిలాంటి వాళ్ళు తండ్రులుగా కూడా నటించడానికి ముందుకి వస్తున్నారు. జెర్సీ సినిమాలో నాని పదేళ్ల వయసు ఉన్న అబ్బాయికి తండ్రిగా నటించారు.
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఐశ్వర్య రాజేష్ తో వచ్చిన ఎపిసోడ్ లో తండ్రి పాత్రలోనే నటించారు. ఇలా యంగ్ హీరోలు వయసు అనే విషయాన్ని పక్కన పెట్టి తమని తాము కొత్తగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఆల్రెడీ నిరూపించుకున్న హీరోలు ఇంకా ఇలాంటి ఇమేజ్ లో ఇరుక్కుపోవడం బాధాకరం. ఇప్పటికైనా సరే ఇవన్నీ ఆపేసి వారికి తగ్గ సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరించడానికి ఎప్పుడూ ముందు ఉంటారు. ప్రేక్షకులుగా మనం కూడా వారిని అర్థం చేసుకొని వారు చేసే ప్రయోగాలని స్వీకరిస్తే మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు వారు కూడా చేస్తారు ఏమో.
ALSO READ : ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఇప్పుడు మొత్తం ఇండియానే ఏలేస్తున్నాడు..! ఎవరో తెలుసా..?
End of Article