Ads
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా, తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన సినిమా జవాన్. ఎప్పుడో మొదలు అయిన ఈ సినిమా చాలా కారణాల వల్ల ఆలస్యం అయ్యి ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా హిందీ సినిమా అయినా కూడా, తమిళ్, తెలుగు భాషల్లో డబ్ అయ్యి విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : జవాన్
- నటీనటులు : షారూఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనే.
- నిర్మాత : గౌరీ ఖాన్
- దర్శకత్వం : అట్లీ
- సంగీతం : అనిరుధ్ రవిచందర్
- విడుదల తేదీ : సెప్టెంబర్ 7, 2023
స్టోరీ :
విక్రమ్ రాథోడ్ (షారుఖ్ ఖాన్) ఒక జవాన్. దేశానికి, ప్రజలకి సేవ చేయాలి అనుకుంటాడు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ప్రజలందరికీ దూరంగా బతకాల్సి వస్తుంది. అతని భార్య (దీపికా పదుకొనే) కూడా అతనికి దూరం అవుతుంది. వీటన్నిటికి కాళీ (విజయ్ సేతుపతి) చేసిన పనులు కారణం అవుతాయి. అయితే విక్రమ్ భార్య ఒక కొడుకుకి జన్మనిస్తుంది. ఆ కొడుకు ఆజాద్ రాథోడ్ (ఇంకొక షారుఖ్ ఖాన్) పెద్ద అయ్యి పోలీస్ అవుతాడు. అయితే ఆజాద్ ని కొంత మంది ఇబ్బంది పెడతారు.
తన కొడుకు ఇబ్బందుల్లో ఉన్నాడు అని తెలుసుకుని, తాను బయటికి రావాల్సిన సమయం వచ్చింది అని అర్థం చేసుకొని విక్రమ్ అప్పుడు బయటికి వచ్చి తన కొడుకుని కాపాడుతాడు. అప్పుడు విక్రమ్ ఏం చేశాడు? అక్కడ ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాడు? అసలు ఎందుకు అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది? తర్వాత ఆ తండ్రి కొడుకులు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
చేసినవి కొద్ది సినిమాలే అయినా కూడా తమిళ్ తో పాటు, తెలుగు ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్న వ్యక్తి డైరెక్టర్ అట్లీ. అట్లీ చేసిన 4 సినిమాల్లో 3 సినిమాలు విజయ్ తోనే చేశారు. ఆ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. అవి విజయ్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు అని కూడా అందరూ అన్నారు. అంత బాగా అట్లీ ఆ సినిమాలని డైరెక్ట్ చేశారు.
ఇప్పుడు అట్లీ బాలీవుడ్ హీరోతో చేస్తున్నారు అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ, దాంతో పాటు తమ హీరోని ఎలా చూపించబోతున్నారు అని బాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. ట్రైలర్ చూస్తే దాదాపు చాలా వరకు కథ అర్థం అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే అట్లీ సినిమాలు ఒక నాలుగు ఐదు మంచి కమర్షియల్ సినిమాలని మిక్స్ చేసి తీసినట్టు ఉంటాయి. ఈ సినిమా కూడా దాదాపు అలాగే ఉంటుంది.
సినిమా మొదటి నుండి కూడా ఆ తర్వాత ఏమవుతుంది అనే విషయాన్ని తెలుగు, తమిళ్ లో వచ్చిన కమర్షియల్ సినిమాలు బాగా చూసిన ఒక ప్రేక్షకుడు ఈజీగా కనిపెట్టగలుగుతాడు. కానీ బాలీవుడ్ వాళ్లకి ఇలాంటి సినిమాలు కొత్త. అంతే కాకుండా షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించారు. ఒక సౌత్ డైరెక్టర్ విజన్ నుండి ఒక నార్త్ హీరో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాతో చూపించారు. అట్లీ బాలీవుడ్ లో ఉండే నియమాలు ఏవి ఆలోచించకుండా, వాళ్ల స్టాండర్డ్స్ దృష్టిలో పెట్టుకోకుండా తన మార్క్ టేకింగ్ తోనే వెళ్లారు. ఒకరకంగా చెప్పాలంటే అది ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది.
ఎందుకంటే షారుఖ్ ఖాన్ ని ఒక డాన్ గా, లేకపోతే ఇంకేదో రోల్ లో చూసిన వాళ్ళకి, ఇలా ఒక పోలీస్ పాత్రలో చూడడం చాలా కొత్తగా అనిపిస్తుంది. అప్పటి వరకు ఒక రకమైన సినిమాలు చేసిన అక్షయ్ కుమార్, విక్రమార్కుడు రీమేక్ అయిన రౌడీ రాథోడ్ సినిమా చేసి తనలోని ఒక కొత్త కోణాన్ని హిందీ ప్రేక్షకులకు ఆవిష్కరించారు. ఒకరకంగా ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా అదే చేశారు. కథ రొటీన్ అయినా కూడా టేకింగ్ పరంగా బాగుంది. దాంతో కథ అర్థం అయిపోతున్న ప్రేక్షకుడిని కూడా సినిమా చివరి వరకు కూర్చోబెట్టగలిగారు.
సినిమా పేరుకి హిందీ సినిమా అయినా కూడా సగం పైన తమిళ్, తెలుగు వారికి తెలిసిన నటీనటులు ఉన్నారు. యాక్టర్స్ మాత్రమే కాదు టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాకి చాలా మంది తమిళ్ వాళ్లే ఉన్నారు. వాళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నవారు కావడంతో వారి పనితనం తెరపై బాగా కనిపించింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు పాత్రల్లో చాలా బాగా నటించారు. లుక్ పరంగా కూడా డిఫరెంట్ గా ఉన్నారు.
నయనతార పాత్ర నటనకి ఆస్కారం ఉన్న పాత్ర ఏమీ కాకపోయినా సినిమాకి ఒక ముఖ్యమైన పాత్ర అంతే. తన పాత్ర పరిధి మేరకు నయనతార నటించారు. దీపికా పదుకొనే కూడా ఒక ఎక్స్టెండెడ్ కేమియోలో కనిపించారు. తనకి ఇచ్చిన పాత్రలో తను బాగా నటించారు. షారుఖ్ ఖాన్ తర్వాత సినిమాకి అంత పెద్ద హైలైట్ అయిన పాత్ర విజయ్ సేతుపతి పాత్ర. లుక్ పరంగా చాలా స్టైలిష్ గా ఉన్నారు.
హిందీ నేర్చుకొని మరి డబ్బింగ్ చెప్పారు. సహాయ పాత్రల్లో నటించిన ప్రియమణి, యోగి బాబు, సునీల్ గ్రోవర్ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. వీరు కాకుండా సినిమాకి మరొక హీరో అనిరుధ్. అనిరుధ్ ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. కానీ కథనం విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- నిర్మాణ విలువలు
- కొన్ని ఎమోషనల్ సీన్స్
- సంగీతం
మైనస్ పాయింట్స్:
- రొటీన్ స్టోరీ
- సౌత్ వాళ్ళకి బాగా తెలిసిన టెంప్లేట్ కథనం
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
మాస్ మసాలా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలని ఎంజాయ్ చేసే వారిని ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. తెలిసిన కథే అయినా కూడా ఒక ప్రేక్షకుడిని థియేటర్ లో కూర్చోబెట్టగలిగే ఫార్ములా ఉన్న కథ ఇది. షారుఖ్ ఖాన్ అభిమానులు అయితే ఈ సినిమాని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాల్లో ఒక మంచి సినిమాగా జవాన్ సినిమా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా పాపులర్ హీరోలు అయ్యారు..! ఎవరో తెలుసా..?
End of Article