Ads
సినిమా, క్రికెట్. ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ అంటే మొదటిగా గుర్తొచ్చే రెండు ఇవే. ఇవి లేకుండా ప్రపంచాన్ని ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. ఈ రంగాల్లో ఉన్న వారిని ప్రజలు వారి సొంత వారిలాగా భావిస్తారు. వారిని చూసి మనవాళ్లే అనుకుంటారు.
Video Advertisement
ముఖ్యంగా సినిమా వాళ్ళని అయితే ఏదో తమకి బాగా తెలిసిన వ్యక్తి అని అనుకుంటారు. అందుకే సినిమా వాళ్లు, క్రికెట్ వాళ్లు ఇంకా ఇలాంటి రంగాల్లో ఉన్న ప్రతి వాళ్లు తమని అభిమానించే వాళ్ళని గౌరవిస్తారు. కానీ వారిని మనం మన సొంతవారు అనుకునే క్రమంలో కొన్ని విషయాలని మర్చిపోతాం.
అందుకే వారు చేసిన చిన్న పనులను కూడా భూతద్దంలో పెట్టి చూసి మొత్తం విషయం తెలియకుండా వారిపై కామెంట్స్ చేస్తూ ఉంటాం. ఇటీవల అలా వార్తల్లో నిలిచిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గురించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడకపోవడంతో, చూడడానికి కూడా వెళ్లకపోవడంతో విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతున్నారు.
ఇది చూసిన చాలా మంది, “ఇంక మేము నీ అభిమానులం కాదు” అని సోషల్ మీడియా ద్వారా నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా సరే జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ దుబాయ్ కి వెళ్లి సైమా వేడుకలో పాల్గొని అవార్డు కూడా గెలుచుకున్నారు. దీనిపై కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. “ఒక పక్క ఇలా ఉంటే దుబాయ్ వెళ్లడం ఏంటి?” అని.
ఇన్ని మాట్లాడుతున్న వారు జూనియర్ ఎన్టీఆర్ ఒక మనిషి అనే విషయాన్ని ఎలా మర్చిపోయారు? జూనియర్ ఎన్టీఆర్ ఒక నటుడు. ఆయన పని సినిమాలు చేయడం. ఒకవేళ ఆయన చేసే సినిమాల్లో మనకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ విషయం గురించి మనం ఏమైనా మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. అంతే కానీ ఆయన తన బంధువుని చూడడానికి వెళ్లారా? లేదా? ఒకవేళ వెళ్లకపోతే ఎందుకు వెళ్ళలేదు? ఇవన్నీ మాట్లాడే అంత చనువు తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్?
ఒక పక్క మంచి సినిమాలు చేసి, ప్రతి సినిమాకి తన 100% ఇచ్చి, గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోవాలి, ఇండస్ట్రీ గర్వపడేలా చేయాలి అని అంతలా కష్టపడుతున్న వ్యక్తిని, ఇవన్నీ మర్చిపోయి “నువ్వు వెళ్లలేదు కాబట్టి మేము నీ అభిమానులం కాదు” అనడం సరైన విషయం కాదు కదా? జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు. ఎంతో మంది హీరోలు సోషల్ మీడియాలో కానీ, వేరే చోట్ల కానీ రాజకీయాల ప్రస్తావన వస్తే దూరంగానే ఉంటారు. చాలా మంది హీరోల కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో ఉన్నారు.
కానీ వారందరూ బహిరంగంగా ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు. కొంత మంది హీరోలు అయితే మేము రాజకీయాలకి దూరంగా ఉంటాము అని చాలా సున్నితంగా ఈ విషయం గురించి మాట్లాడకుండా ఇలాంటి ప్రశ్నలు వస్తే అవాయిడ్ చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇటీవల జరిగే చాలా వేడుకల్లో రాజకీయాల ప్రస్తావన వస్తే, “ఇది ఇక్కడ మాట్లాడే సమయం కాదు” అని అంతే సున్నితంగా ఈ విషయాలకు దూరంగానే ఉంటున్నారు.
ఒక పాయింట్ లో రాజకీయాల్లోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, తర్వాత వాటికి దూరంగా వెళ్లిపోయి సినిమాల మీద మాత్రమే దృష్టి పెట్టారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఆయన ప్రేక్షకులకి ఒక యాక్టర్ గా తెలుసు. రాజకీయాల కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ ఒక నటుల కుటుంబం నుండి వచ్చారు. ఆయన తాత ఒక గొప్ప నటుడు. ఆయన కుటుంబంలో ఇంకా చాలా మంది నటులు ఉన్నారు.
ఆ నటవరసత్వాన్ని కొనసాగించాలి అని, తన తాత, మిగిలిన కుటుంబ సభ్యులు ఎలా అయితే ఈ రంగంలో వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారో, తాను కూడా అంతే గుర్తింపు తెచ్చుకోవాలి అని కష్టపడుతున్నారు. అదే గుర్తింపుని నిలబెట్టుకోవడానికి, ఆ గుర్తింపుని ఇంకా పెంచుకోవడానికి ప్రతి పాత్రకి తనని తాను మార్చుకుంటూ కృషి చేస్తున్నారు. అలాంటి నటుడి కష్టాన్ని గుర్తించాలి అని అర్థం చేసుకోవాలి. అప్పుడే ఇలాంటివి అన్ని ఆగిపోతాయి ఏమో.
End of Article