Ads
గొప్పతనం డబ్బులు బట్టి రాదు, చేసే పనిని బట్టి వస్తుంది అని నానుడి. నిజానికి ఈరోజు సమాజంలో చాలామంది ఆర్థికంగా స్థితిపరులే కానీ సాయం చేయడంలో మాత్రం చాలా పేదవాళ్లు. పక్కవాడికి రూపాయి ఇవ్వాలంటే మాత్రం ఎక్కడలేని పేదరికం పుట్టుకు వస్తుంది. అయితే కొందరు మాత్రం పేదరికంలో ఉన్నా పక్క వాడికి సాయం చేయడంలో ముందుంటారు. అలాంటి ఒక కర్ణాటక వాసి గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
Video Advertisement
మనసులో సాయం చేయాలని ఉంటే సాయం చేయటానికి ధనవంతులే కానక్కర్లేదని కర్ణాటకలోని రాయచూరు జిల్లా, దేవదుర్గ తాలూకాకు చెందిన ఆంజనేయ యాదవ్ అనే యువకుడు మరొక మారు రుజువు చేశాడు. తన గ్రామం నుంచి మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలోని పాఠశాలకు నడిచి వెళ్లే విద్యార్థులకు 11 సైకిళ్లు కొనిచ్చాడు. అయితే ఇతను ఏ ధనవంతుడో లేదంటే ఒక పెద్ద ఉద్యోగి అనుకుంటే పొరపాటే అతను ఒక రోజు కూలి.
రోజూ కూలి పనులు చేసుకుంటూ వచ్చిన ఆదాయంలో 40,000 పొదుపు చేసి విద్యార్థులకు 11 సైకిళ్లు కొనిచ్చి సాయం చేశాడు. మల్కందిన్ని గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. యాదవ్ కూడా అదే గ్రామంలో ఉంటాడు. అయితే హై స్కూల్ కోసం విద్యార్థులు రోజు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న యమునూరుకు వెళ్లాల్సి వస్తుంది. అంత దూరం విద్యార్థులు వెళ్లి రావటాన్ని గమనించిన ఆంజనేయ యాదవ్ వారి కోసం ఏమైనా చేయాలనుకున్నాడు.
అందుకే తన కూలి డబ్బుల్లో కొంత మొత్తాన్ని దాచిపెట్టి వారికి సైకిల్స్ కొని అందజేశాడు. రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆ కారణంగానే చాలామంది చదువుకొని ఆపేస్తున్నారు. వారి చదువు ఆగిపోకూడదని ఈ సైకిల్ పంపిణీ చేశానని తెలిపాడు యాదవ్. తన మంచి మనసుతో, సేవా తత్పరతతో పదిమంది హృదయాన్ని గెలుచుకున్న యాదవ్ కి ఒక బిగ్ సెల్యూట్ చెయ్యాల్సిందే.
End of Article