Ads
ఆడపిల్ల అంటే లక్ష్మీదేవిగా భావిస్తారు. గతంలో ఆడపిల్ల అంటే ఆలోచించేవారు. ఆడపిల్ల పుడుతుంది అంటే చాలా భయపడేవారు. ఆడపిల్లని పెంచిపెద్ద చేయాలి అంటే చాలా కష్టం అని భావించేవారు. ఇప్పుడు సమయం మారింది. ఆడపిల్ల పుడుతుంది అంటే సాధారణంగానే సంతోషంగా ఫీల్ అవుతున్నారు. కానీ ప్రతి చోటా ఇలా ఉండదు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు ఆడపిల్ల పుడుతుంది అంటే ఒక్కొక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తోంది. అందుకు కారణం వారి ఆర్థిక పరిస్థితి. కొన్ని సార్లు ఆర్థిక పరిస్థితి సహకరించక ఆడపిల్లకి కావాల్సిన సౌకర్యాలు అందించలేని పరిస్థితి ఏర్పడుతుంది.
Video Advertisement
అలాంటి సమయంలోనే మారుమూల గ్రామాల్లో ఆడపిల్ల పుడుతుంది అంటే ఇప్పటికి కూడా భయపడుతూ ఉంటారు. అందుకే ఆడపిల్లల అభివృద్ధి కోసం ప్రభుత్వం కూడా ఎన్నో రకమైన పథకాలను ప్రవేశపెట్టింది. వీటి వల్ల ఆడపిల్లల అభివృద్ధి మెరుగుపడుతోంది. ఆడపిల్లలకి తమ వంతు సహాయం చేయడానికి ఇటీవల ఒక దంపతులు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వివరాల్లోకి వెళితే, నిజామాబాద్ జిల్లాలో తాడ్వాయి మండలం ఏండ్రియల్ గ్రామానికి చెందిన రెడ్డిగారి తిరుపతి రెడ్డి, రెడ్డిగారి శ్రావణ లక్ష్మి దంపతులు ఇటీవల తమ 10 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారి యానివర్సరీని కొత్తగా సెలబ్రేట్ చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు.
అది కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నారు. అందుకే, ఏండ్రియల్ గ్రామంలో ఈ సంవత్సరం జనవరి నుండి పుట్టిన ప్రతి ఆడపిల్లకి సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి 2000 రూపాయలు వారి పేరున డిపాజిట్ చేశారు. ఇప్పటికి కూడా ఆడపిల్ల పుడితే భారంగా భావించే వాళ్ళు ఉంటారు. అందుకే ఇలా చేసాము అని వాళ్ళు తెలిపారు. ఒకవేళ ఆడపిల్ల పుడితే, ఆడపిల్ల భవిష్యత్తు ప్రణాళికకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇలాంటి సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి డబ్బులని పొదుపు చేయాలి అనే ఆలోచన గురించి అందరికీ అవగాహన తీసుకురావడానికి వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆడపిల్లల కోసం వీళ్ళు ఇంతగా ఆలోచించి చేసిన ఈ పని చూసిన వాళ్ళందరూ కూడా పొగుడుతున్నారు.
End of Article