Ads
“కమలాతాళ్” ఈ పేరు చెప్తే గుర్తు పట్టకపోవచ్చు కానీ… రూపాయి ఇడ్లీ బామ్మ అంటే టక్కున గుర్తు పట్టొచ్చు.. కోయంబత్తూర్ లో రూపాయికే ఇడ్లీ అమ్మే ఈ బామ్మ.. లాక్ డౌన్ వేళల్లో కూడా తను అమ్మే ఇడ్లీ రేటు పెంచలేదని తెలిసి భలే ఆశ్చర్యమేసింది.. జనతా కర్ఫ్యూ అనగానే అయ్యో రేపటికి సరుకులు దొరుకుతాయో లేదో అన్నట్టుగా జనం ఎగబడి దుకానాలు ఖాళీ చేసారు, మరోవైపు దుఖానదారులు వారికి వీలున్నంతలో అమాంతం పెంచేశారు..కానీ కమలాతాళ్ మాత్రం అప్పుడు ఇప్పుడు.. ఒకే మాట..ఒకే రేటుకే ఇడ్లీ అమ్ముతున్నారు..
Video Advertisement
పేదవాళ్లు, మధ్య తరగతి వాళ్ల కోసం ముప్పై ఏళ్లక్రితం కమలాతాళ్ ఈ పని స్టార్ట్ చేశారు.. మొదట్లో యాభై పైసలకు ఇడ్లీ, బోండా అమ్మేవారు, రేట్లు పెరగడంతో రూపాయి చేశారు.అంటే అర్ద రూపాయి పెంచారు. ఇప్పుడు కరోనా కాలంలో తను నష్టపోతున్నప్పటికి కూడా ఇడ్లీ రేటు పెంచకుండా అందరి కడుపు నింపుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వలస కూలిలకు కమలతాళ్ ఇడ్లీయే పంచభక్ష పరమాన్నం లాంటిది..పది రూపాయలు జేబులో ఉంటే పది ఇడ్లీలు తిని కడుపు నింపుకోవచ్చు.. పది రూపాయల ఇడ్లీలు తిని ఐదు రూపాయలు ఇచ్చినా ఆ వ్యక్తి ఆకలి తీర్చాననుకుంటారే తప్ప, డబ్బులివ్వమని అడగని గొప్ప మనసు ఆ బామ్మది.
ప్రస్తుతం తన వయసు ఎనభై పైనే..ఈ వయసులో కూడా ఉదయాన్నే లేవడం , పొలానికి వెళ్లి కూరగాయలు తీసుకురావడం.. ఉదయం ఆరు గంటల నుండి మద్యాహ్నం పన్నెండు ఇడ్లీలు అమ్మడం ప్రారంభించడం.. ఇడ్లీలు చేయడానికి రోట్లోనే పిండి రుబ్బుతారు.. కట్టెలపొయ్యి మీదనే ఇడ్లీలు పెడతారు..ఇడ్లీ,చట్నీ మరియు సాంబార్ వీటిని తన పొలంలో తెచ్చిన అరిటాకుల్లో అందరికి అందించడం ముప్పై ఏళ్లుగా ఇదే దినచర్య..
ఇంత కష్టకాలంలో కూడా రూపాయికే ఇడ్లీ అమ్ముతున్నారని తెలుసుకున్న కొన్ని స్వచ్చంద సంస్థలు కమలతాళ్ కి సాయం చేయడానికి ముందుకు వచ్చాయి.కరోనా విజృంభిస్తున్న కాలంలో కూడా రూపాయికే ఇడ్లీ అందిస్తున్న కమలాతాళ్ సేవ గురించి తెలుసుకుని తనకు అవసరం అయిన సరుకులు ఇతరత్రా సామాగ్రి అందించారు భారతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మరియు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్ సభ్యులు. “ఇడ్లీ రేటు పెంచే ఆలోచన లేదు. దాతల సహాయంతో వారందరికీ ఒక్క రూపాయికే ఇడ్లీ అందించగల్గుతున్నాను”అని కమలాతాళ్ ఇటీవల నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.
End of Article