Ads
వైద్యో నారాయణో హరీ అన్నారు పెద్దలు..దానికి సరిగ్గా సరిపోయే పర్సన్ అతను.. చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు అతను దేవుడి కంటే ఎక్కువ.. అతను ఒక ధైర్యం, అండ, భరోసా.. మామూలుగానే పిల్లల్ని పెంచడం అనేది పెద్ద టాస్క్..అలాంటిది పెద్దల అండ లేకుండా, బిజిబిజి జీవితాల్లో పిల్లల్ని పెంచడం ఎంతో కష్టమైన పని..అలాంటి వాళ్లందరికి తన మాటల మంత్రంతో ఆ టాస్క్ ని చాలా సింప్లిఫై చేసే మాటల మాంత్రికుడు అతను..అతనే డా. పి.సుదర్శన్ రెడ్డి..
Video Advertisement
చిన్నారుల పెంపకంలో తమకు పెద్ద దిక్కుగా ఉన్న సుదర్శన్ రెడ్డి గారికి ఒక అమ్మ అందిస్తున్న నివాళి… డా.సుదర్శన్ రెడ్డి గారి గురించి చాలాసార్లు రాద్దామనుకుని రాయలేకపోయా.. ఇప్పుడు ఇలా రాయాల్సొస్తుంది అనుకోలేదు.”ఆయన ఇక లేరు” అనే నిజాన్ని జీర్ణించుకోవడం కష్టమే……
ఏడేళ్ల క్రితం పిల్లాడిని ఎక్కడ చూపిస్తున్నావ్ అని ఒకరు అడిగితే ఖైరతాబాద్ సుదర్శన్ రెడ్డి గారి దగ్గర అని అనగానే..మంచి డాక్టర్ ని సెలక్ట్ చేసుకున్నావ్ అన్న మాటలు ఇంకా గుర్తు.. అబ్బా ఇక్కడ డాక్టర్లు లేరా , అంత దూరం అవసరమా అని ఇంట్లో విసుక్కుంటే అక్కడికి మాత్రమే వెళ్తా అని గొడవపడి తీసుకెళ్లిన రోజు ఇంకా గుర్తు.. తీరా అక్కడికి వెళ్లాక డాక్టర్ గారి మాట తీరు, ట్రీట్మెంట్ చూసాక ..పిల్లలకు ఏ చిన్నది వచ్చినా డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీస్కో అని ముందు ఇంట్లో వాళ్లే అనే వాళ్లంటే అర్దం చేస్కోండి.
2014లో మా బాబు పుట్టాడు..అంతకుముందే ఆయన రాసిన “ఆరోగ్యమస్తు ” పుస్తకం మా ఇంటికి చేరింది..ఇప్పుడు దానితో అవసరం ఏముంది అని..పరిచయం వరకు చదివి పక్కన పెట్టేసా..ఇతిహాస్ పుట్టిన మూడు రోజులకు సిక్ అయ్యాడు.. డాక్టర్లు ,హాస్పిటల్స్ అంటే భయపడే నాకు కాళ్లు చేతులు ఆడలేదు..వెంటనే నేను చూపించుకునే గైనిక్ రమాదేవి గారికి కాల్ చేస్తే నిలోఫర్ కి తీసుకెళ్లమన్నారు..అర్దరాత్రి పన్నెండింటికి అక్కడికి చేరుకున్నాం..జాండిస్ అని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు..నాలుగు రోజులపాటు అక్కడ ఉన్నాం..
వరుసగా రెండు రోజులు హాస్పిటల్లోనే ఉన్నానని ఫ్రెష్ అప్ అయి , ఏమన్నా తినొద్దామని మా అమ్మానాన్న నన్ను ఇంటికి తీసుకెళ్లారు..దారిపొడుగునా మా నాన్న “ఆరోగ్యమస్తు” పుస్తకంలో విషయాలు చెప్తూనే ఉన్నారు.. చంటిబిడ్డ పుట్టగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?పుట్టేటప్పుడు బిడ్డ ఏడవకపోతే ఏం జరుగుతుంది?? పాలు ఇచ్చేటప్పుడు,స్నానం చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు..బిడ్డకి మొలతాడు, మెడలో తాయెత్తులు ,ముఖానికి రూపాయి బిల్లంత బొట్టు, చేతులకి పూసలు ఇవన్నీ కట్టడం అవసరమా??? పల్లు వచ్చేటప్పుడు మోషన్స్ అవుతాయని మెడలో ఏదో పూస కట్టిస్తారు..అసలు పల్లు వచ్చేటప్పుడు మోషన్స్ ఎందుకవుతాయి???అవకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..ఇలా ఒకటి రెండు కాదు.. మా బాబుకి అలా ఎందుకు జరిగింది అనే దానికోసం చదవడానికి ఓపెన్ చేసి రెండు రోజుల్లో ఆ బుక్ కంఠతా పెట్టేసారు మా నాన్నా..
మా నాన్న అన్ని విషయాలు చెప్పినప్పటికి హాస్పిటల్ నుండి రాగానే నేను మళ్లీ చదివా..అరె ఎంత హైరానా పడ్డాను, ముందే చదివుంటే నాలుగు రోజుల పాటు టెన్షన్ తప్పేది కదా అనిపించింది పుస్తకం చదివాక..చంటి బిడ్డ పుట్టిన క్షణం నుండి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు..బిడ్డ పెరుగుతున్న క్రమంలో వచ్చే మార్పులు ఇలా ప్రతీది చాలా వివరంగా ఉంది ఆ పుస్తకంలో.. బాబుకి పేరుపెట్టాక , ఎలాగూ ఊరు వెళ్ళిపోతే మూడు నెలల పాటు రావడానికి కుదరదు కదా,జనరల్ చెకప్ అయినా చేయించుకుని వెళ్దాం అని అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నాం..ఇంతలో వాడికి విపరీతంగా మోషన్స్…మళ్లీ నా గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్టయింది..నెక్స్ట్ డే నే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లాం.. అప్పటికి ఆయన రిటైర్ అయిపోయారు..కానీ తనెప్పుడో కెరీర్ స్టార్ట్ చేసిన కైరతాబాద్లోని చిన్న క్లినిక్‌లో సాయంత్రం పూట, లక్డీకాపూల్ లోని క్రిష్ణా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చేవారు..
ప్రతి పేషెంట్ ని మినిమం అరగంట అయినా చూస్తారు.. మెడిసిన్స్ తక్కువ కౌన్సిలింగ్ ఎక్కువ..ముందు పేషెంట్ ఎవరున్నారో వారికి చూసేటప్పడు తర్వాత నంబర్ వాళ్లు కూడా ఆయన చెప్పేది వినాలి.. ఒక్కోసారి అర్దరాత్రి అయిపోయేది మన నంబర్ వచ్చేసరికి..లేట్ అయినా సరే కానీ ఆదరాబాదరాగా చూసి పంపేసే వాళ్లు కాదు..అత్యవసరం అయితే తప్ప మందులు సజెస్ట్ చేసేవాళ్లు కాదు..పిల్లల ఇమ్యూన్ సిస్టం స్ట్రాంగ్ చేయాలి..మందులు అలవాటు చేయకూడదు వాళ్ల బాడీకి అనేవాళ్లు..
మా నంబర్ వచ్చింది.. ఏంటి సమస్య అన్నారు..మోషన్స్ అవుతున్నాయి అంటే.. ఆ అయితే ఏం అయితుంది..కడగలేకపోతున్నావా..లంగోటిలు పిండలేకపోతున్నవా అన్నారు..నేను ముఖం చిన్నబుచ్చుకున్నా.. పక్కనే ఉన్న మా మామయ్య , అలా ఏం లేదు సర్, బిడ్డ అంటే ప్రాణం. వాడు ఫస్ట్ టైం ఎప్పుడు పోయాడో కూడా అది కూడా అపురూపంగా కన్నాగాడు చిచి పోయాడు… అని అది కూడా గొప్పగా చెప్పేది అంటే..నవ్వి మరింకేం..”చూడమ్మా, నీ పాలు తాగేంత వరకు బిడ్డ ఎన్నిసార్లు మోషన్ పోయినా, పోకపోయినా ఏం కాదు..ఒక్కసారి నీ పాలు కాకుండా బయట పాలు పట్టావనుకో, అప్పుడు అది సమస్యగా చూడాలి…”
బిడ్డ పాలు తాగుతున్నాడు కాబట్టి నేను ఫూడ్ విషయంలో కంట్రోల్ ఉండాలా సర్ అని అడిగితే..దేనికి కంట్రోల్ ..బర్రెకి దూప అయితే నీళ్లు తాగుతది, కుడితి తాగుతది..బోర్ నీళ్ల, మినరల్ వాటరా అని చూసుకుని తాగుతదా..బతుకతలేవా దూడలు.. ఈ ప్రపంచంల మనిషొక్కడే వెల్లకిలా పడుకుంటాడు..అందుకే ఇన్ని రోగాలు , పశువులు అన్ని బోర్లానే పడుకుంటాయి.. వాటికి ఏ రోగం లేదు.. ఒకసారి పశువులు వెల్లకిలా పడుకుంటే ఎలా ఉంటాయో ఊహించుకో అన్నారు.. వెంటనే ఊహ వచ్చి నవ్వొచ్చింది.. కాబట్టి” పాలివ్వగానే తేన్పొచ్చే వరకు భుజం మీద వేసుకుని వీపు నిమురు.. రోజుకి కొద్ది సేపైనా బోర్లా పడుకోబెట్టాలి అని చెప్పారు..ఇలాంటి చిన్నచిన్న సలహాలే పెద్ద రిజల్ట్స్ ని ఇచ్చాయి.. ఆ రోజు ఆయన ఇరవై రెండు రోజుల చంటిబిడ్డను బంతిలా ఎటుపడితే అటు తిప్పుతూ,పైకి కిందికి ఆడిస్తూ,కాళ్లు చేతులు పట్టుకుని ఊపేస్తూ పరిక్షిస్తుంటే…వాడు నవ్విన నవ్వు ఇంకా మనసులో ఉంది.. చూడు వాడెంత హాయిగా నవ్వుతున్నాడో..నువ్ టెన్షన్ పడుతున్నావ్..
పిల్లలకు బొట్టు, కళ్లకి కాటుక పెట్టనివ్వరు..చేతికి పూసలు కట్టనివ్వరు..పొరపాటున వాడు మింగాడనుకో లేనిపోని తలకాయ నొప్పి,..వాన్ని పుట్టిన వాన్ని పుట్టినట్టుగా ఉండనీయ్…అనేవాళ్లు.. ఆయన రూంలో టేబుల్ పై, గోడలకి, సెల్ఫ్ లలో బొమ్మలుండేవి..అసలు అందులోకి ఎంటరవడంతోనే పిల్లలు అదో లోకంగా ఫీల్ అయ్యేవారు..అప్పటికి పిల్లలు ఏడుస్తుంటే తన టేబుల్ పై ఉన్న ఒక బుజ్జి పాప బొమ్మకి కీ ఇచ్చి కూర్చొపెట్టేవారు..పిల్లలు ఆ బొమ్మని చూడగానే నవ్వేవాళ్లు..పిల్లలకి టెడ్డీబేర్లు అలవాటు చేయనిచ్చేవారు కాదు..డస్ట్ ఎలర్జీ అవుతుందని..
పల్లు వచ్చేటప్పుడు వాళ్లకి చిగుళ్లు దురద పెడుతుంటాయి..ఏవి పడితే అవి నోట్లో పెట్టి కంకుతా ఉంటారు..కాబట్టి మోషన్స్ అయితయి..జాగ్రత్తగా ఉండాలి కదా అనేవారు.. అప్పుడు టీతర్ అని ఒకటి మెడికల్ షాపులో కొని రోజు ఉదయాన్నే వేడి వాటర్‌లో కడిగి బాబు చేతికి పట్టిస్తే దాన్ని మాత్రమే కంకేవాడు, మళ్లీ కాసేపటికి మళ్లీ వేడినీళ్లల్లో కడిగి ఇచ్చేదాన్ని, వాడికి మోషన్స్ అవ్వలేదు..మెడలో ఎలాంటి తాయెత్తులు కట్టలేదు..
ఇక తల్లి పాలు ఇవ్వకపోతే ఆ తల్లికి ఈయన చేత తిట్లు తినేకంటే బిడ్డకి పాలివ్వడం బెటర్ అనేలా క్లాస్ ఉంటుంది.. చాలా మంది పాలు రావట్లేదు, అని డబ్బా చేతిలో పెట్టి ఊరుకుంటారు..కాని అది భవిష్యత్ లో పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని చెప్పేవాళ్లు..సరే ప్లాస్టిక్ కదా వద్దన్నారని, అప్పట్లో టప్పర్ వేర్ బాగా ఫేమస్ కదా..అది కొన్నాను ఏడొందలు పెట్టి…డెబ్బై రూపాయలు పెడితే వచ్చే డబ్బాకి ఏడొందలా అని మా వాళ్లు నోరుతెరిచారు..అంత పెట్టి కొన్నప్పటికి కూడా డబ్బా వద్దు అనే ఆయన మాటలు చెవుల్లో తిరుగుతూ ఉండేవి..వాడకుండా మూలకి పడేసా..ఒక్కసారి కూడా వాడలేదు. మరీ తల్లి పాలివ్వలేని పరిస్థితి ఉంటే స్టీల్ గ్లాస్,స్పూన్ చంటి బిడ్డకి కేటాయించి.. ఓపిక చేసుకునే స్పూన్ తోనే తాగించాలి తప్ప డబ్బా వాడకూడదు అని చెప్పేవారు.
ఆరు నెలల వరకు ఖచ్చితంగా తల్లి పాలే ఇవ్వాలి.. ఏడో నెల నుండి ఉగ్గు..ఎనిమిదో నెలలో పండ్లు. తొమ్మిది నెలలో కూరగాయలు మెత్తగా చేసి పెట్టాలి..పదో నెలల నుండి మీరు తినే ఫూడ్ కాకపోతే మెత్తగా చేయాలి..కారం తక్కువగా ఉండాలి. ఫస్ట్ బర్త్ డే అయిన నెక్స్ట్ డే వాడికి ఏదైనా పెట్టొచ్చు మీరు తినేది అని చెప్పేవారు.. “పొరపాటున సెరిలాక్ అన్నామనుకో..నువ్వు మీ ఆయన ఏమో ఫ్రెష్ గా మార్కెట్ నుండి తెచ్చి వాటికి మీకు నచ్చిన మసాలాలు, కారం ఉప్పు మీకు నచ్చినట్టుగా యాడ్ చేసుకుని వండుకుని ఏ రోజుదారోజు వేడిగా తింటారా.. మీ వాడికి మాత్రం ఎవడో, ఎప్పుడో తయారుచేసి, దానికొక ఎక్స్పైరీ డేట్ వేసిస్తే అది పెడతారా అని తిట్టేవారు..”
ఫస్ట్ బర్త్ డే కాగానే నెక్స్ట్ డే నే వాళ్ల చేతితోనే తిననివ్వాలి…ఇల్లంతా చల్లినా సరే ఓపికగా క్లీన్ చేయాలితప్ప..ఎట్టి పరిస్థితుల్లో తల్లి చేతితో తినిపించకూడదు అని చెప్పేవారు…వాడి చేత్తోనే తినడం అలవాటైన మూలంగా బయటెక్కడైనా ఫంక్షన్స్ కి వెళ్లినా తనే తింటాను అనేవాడు..మూడేళ్ల పిల్లాడు బుద్దిగా తింటుంటే అందరూ నోరెళ్లబెట్టి, ఆశ్చర్యంగా మాట్లాడుకోవడం నాకింకా గుర్తు..కొన్నిసార్లు ఎందుకు వీడికి ఇలా అలవాటు చేసానా అనిపించేది….ముఖ్యంగా పెళ్లిల్లలో బఫే సిస్టం పెట్టినప్పుడు…బాబుని పెంపకంలో ఆయన సలహా ప్రతిది తూచా తప్పకుండా పాటించా..వాడు ఫూడ్ విషయంలో కాని మరే విషయంలోనూ ఎప్పుడూ పేచి పెట్టలేదు…కాని తర్వాత పాప టైంలో తన హెల్త్ బాగోకపోవడం, నా హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవ్వడంతో ఫూడ్ విషయంలో నెగ్లెక్ట్ చేసా..మొదటి ఏడాది పట్టించుకోనందుకు ఇప్పటికి అనుభవిస్తున్నా..
మా బాబుకి కాళ్లు వంకరగా ఉంటే అదెప్పుడూ నాకు వంకగా అనిపించలేదు..కాని చూసేవాళ్లు స్నానం పోసే ఆమె బాగా రాయలేదని, నువ్వు కడుపులో ఉన్నప్పడు జాగ్రత్తలు తీస్కోలేదని,పిలగాడి కాళ్లు ఇలా ఉన్నాయి, సక్కగ అయితయో కావో ఒకసారి డాక్టర్ ని కలవమని అంటే ఆయన్ని కలిసాం.. …ఏమమ్మా, నీ కొడుకు కాళ్లు వంకర ఉంటే నీ కొడుకు కాకుండ పోతడా , నువ్ ప్రేమ చూపియడం మానేస్తావా.. ఏం కాదు పెద్ద అయితుంటే అవే సెట్ అయితయ్ అన్నారు. చూసేవాళ్లు చాలా అంటారు అవన్ని పట్టించుకోవద్దు.. ఇంకా నేను డౌబ్ట్ గా ఉండడంతో రికెట్స్ టెస్ట్ రాసారు..అంతా నార్మల్ వచ్చింది. ఆ టెస్టులో వాడి బోన్ లెగ్ బోన్ కి ఇచ్చిన ఇంజక్షన్ కి వాడు ఏడ్చిన ఇప్పటికి గుర్తొస్తే చాలా బాధగా ఉంటుంది.ఛీ ఎవరెవరి మాటలకో నా కొడుకుని కష్ట పెట్టుకున్నా అని నన్ను నేను చాలా తిట్టుకున్నా. ఆ తర్వాత ఏడాదికే వాడు కాళ్లు అందరి కాళ్లలా అయ్యాయి..
కనీసం ఐదేళ్లు వచ్చేవరకు పిల్లల్ని అపురూపంగా చూసుకోవాలి అనేవాళ్లు..వారి ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవ్వాలని..పాప విషయంలో అన్ని లిమిట్స్ క్రాస్ చేసా..పాప హెల్త్ పరంగా కొంత ఇబ్బంది పడ్డాం..అదే మరో డాక్టరెవరైనా అయ్యుంటే పరిస్థితి వేరుండేదేమో .. అక్కడున్నది డా.సుదర్శన్ రెడ్డి..ఆయన సూచనలతోనే ఇంట్లో ఉండే జాగ్రత్తలు పాటించడం ఎలానో తెలుసుకున్నా.. ఇప్పుడు ఐదేళ్లు నిండాయి ఒకసారి వెళ్లి కన్సల్ట్ చేద్దాం అనుకుంటూ అశ్రద్ద చేస్తూ వచ్చా..ఇప్పుడు అసలు కలవలేనంత దూరం వెళ్లిపోయారు..
ఎక్కువ మంది పేరెంట్స్ పిల్లల గురించి చేసే మేజర్ కంప్లైంట్ ఫూడ్ తినట్లేదని,తినడానికి పేచి పెడుతున్నారని , ఎక్కువ సేపు తింటున్నారని ఇలా..ఇదే కంప్లైంట్ తో సుదర్శన్ రెడ్డిగారి దగ్గరకి వెళ్తే ఏం చెప్తారో తెలుసా.. తినకపోతే వదిలేయ్.. నీకు ఆకలేస్తుందని నీకు తెలుస్తుందా ? నాకా? వాడికి ఆకలేస్తే వాడే తింటాడు.ఎందుకు బలవంతం చేస్తావ్.. పిల్లల్ని బాగా ఆడుకోనివ్వాలి.ఆడుకుంటే వాళ్లే అలసిపోతారు.ఆకలేస్తుంది. ఆకలి అనేది తెలుస్తుంది..అదేం తెలియకుండా ఉదయం లేవగానే గ్లాసుడు పాలు పోసి, తినడానికి ఏదో నువ్వే బలవంతంగా తినింపించేసి..మళ్లీ తినట్లేదు..తినట్లేదు అని వాడిపై కంప్లైంట్ చేస్తే ఏం ఫైదా.. కాబట్టి తిండి విషయంలో పిల్లల్ని ఫోర్స్ చేయకూడదు..వాళ్లకి ఆకలేస్తే వాళ్లే తింటారు అనేవాళ్లు.. పిల్లలకి నేను బలవంతంగా పెట్టను..అందరూ నన్ను పిల్లల ఆకలి పట్టించుకోని తల్లి అనుకుంటారు..కాని నాకు తెలుసు వాళ్లు ఎప్పుడు ఆకలి అంటారో ఎప్పుడు తింటారో..
ఇంత రాసినా ఇంకా రాయాల్సింది చాలా ఉంది అనిపిస్తోంది.. యూట్యూబ్‌లో ఆయనవి చాలా వీడియోస్ ఉంటాయ్.. సివిఆర్ హెల్త్ ఛానెల్ వాళ్లు ఆయన వీడియోస్ రెగ్యులర్ గా టెలికాస్ట్ చేసేవాళ్లు.. చిన్నపిల్లలు ఉన్న వాళ్లు చూడండి..కచ్చితంగా ఏ భయం లేకుండా ధైర్యంగా పిల్లల్ని పెంచగలుగుతారు..ప్రస్తుతం ఆయన లేరు..కాని ఆయన రాసిన “ఆరోగ్యమస్తు” పుస్తకమే చంటిబిడ్డల తల్లిదండ్రులకు రక్ష..
End of Article