Ads
ఒక వ్యక్తిని చూడగానే వారి గురించి అంచనాకి రావద్దు. ఈ విషయాన్ని మనం చాలా సార్లు విన్నాం. చాలా సార్లు ఇదే విషయం రుజువైంది కూడా. ఇప్పుడు మీరు చదవబోయే ఈ సంఘటన ఇందుకు ఒక ఉదాహరణ. ఒక ట్రైన్ లో ఒక తండ్రి, కొడుకు ప్రయాణిస్తున్నారు. తండ్రి వయసు 50 పైన ఉంటుంది. కొడుకు వయసు 20 పైన ఉంటుంది. కొడుకు విండో సీట్ ఉన్న వైపు కూర్చోగా, తండ్రి కొడుకు పక్కన కూర్చున్నారు.
Video Advertisement
వారు ఎక్కిన ట్రైన్ లోనే ఇంకొంచెం సేపటికి ఒక జంట వచ్చింది. ఆ దంపతులు ఇద్దరు తండ్రి, కొడుకుల పక్క సీట్ లో కూర్చున్నారు. ట్రైన్ కదిలింది. కదులుతున్న ట్రైన్ కిటికీలో నుండి బయటకి చూస్తున్నాడు కొడుకు. తర్వాత కొంచెం సేపటికి చెట్లు ఉన్న ప్రదేశం వచ్చింది. ఆ ప్రదేశాన్ని చూసిన కొడుకు తన తండ్రితో “నాన్నా చూడు ఆ చెట్లని దాటి మనం ఎలా ముందుకు వెళ్లిపోతున్నామో!” అని అన్నాడు.
అందుకు తండ్రి “అవును నాన్నా. ఆ చెట్లను దాటి మనం ముందుకు వెళ్లిపోతున్నాం” అని అన్నారు. ఆ తర్వాత కొండలు వచ్చాయి. అప్పుడు కొడుకు “నాన్నా మనం ఆ కొండలను దాటి వెళ్లిపోతున్నాం చూడు” అని అన్నాడు. తర్వాత మబ్బులని చూసి కొడుకు “నాన్నా చూడు ఆ మబ్బులు మనతో పాటే వస్తున్నాయి” అని అన్నాడు. అందుకు తండ్రి “అవును నాన్నా. అవి మనతోపాటే వస్తున్నాయి” అని అన్నారు.
ఇదంతా చూస్తున్న దంపతులు వారు వింతగా ప్రవర్తిస్తున్నారు అని అనుకున్నారు. వారు ఆ తండ్రితో “ఏంటండీ మీ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు? అన్నిటి గురించి అంత వింతగా అడుగుతున్నాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లొచ్చు కదా?” అని అన్నారు.
అందుకు తండ్రి “నా కొడుకుకి పుట్టినప్పటి నుంచి చూపులేదు. ఇటీవల ట్రీట్మెంట్ చేయిస్తే కళ్ళు వచ్చాయి. అందుకే తనకి అన్నీ కొత్తగా అనిపించి అలా అడుగుతున్నాడు”. అని అన్నారు. వారి తప్పు అర్థం చేసుకున్న దంపతులు ఇద్దరు ఆ తండ్రికి సారీ చెప్పారు. అలా ఒక వ్యక్తిని చూడగానే ఒక అంచనాకి రాకూడదు అనే విషయం మళ్ళీ రుజువయ్యింది.
End of Article