Ads
ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. మొదటి వేవ్ తో పోలిస్తే.. రెండవ వేవ్ లో పరిస్థితి మరింత క్లిష్టతరం గా ఉంది. ఈ పరిస్థితిలో కరోనా తీవ్రరూపం దాల్చిన రోగులను దక్కించుకోవడాని డాక్టర్లు చేయని ప్రయత్నం లేదు. ప్రత్యామ్నాయ మందుల కోసం తీవ్రం గా శ్రమిస్తూనే ఉన్నారు.
Video Advertisement
2-DG డ్రగ్ అంటే ఏంటి..?
ఈ పరిస్థితిలో భారత్ లో 2-DG డ్రగ్ లాంచ్ అయింది. సింపుల్ గా చెప్పాలంటే.. ఈ డ్రగ్ పేరు 2-డియోక్సీ-డి-గ్లూకోజ్. ఈ డ్రగ్ ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) అభివృద్ధి చేసింది. ఈ ఇన్స్టిట్యూట్ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) లో భాగమైన ప్రయోగశాల మరియు హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారం తో ఈ పరిశోధనను జరిపి.. 2-DG డ్రగ్ కు రూపకల్పన చేసారు.
ఏప్రిల్ 2020 నుంచే ఈ డ్రగ్ కోసం ప్రయోగాలు ప్రారంభించారు. ఈ డ్రగ్ SARS-CoV-2 వైరస్ పై ప్రభావం చూపించి, వైరస్ ను అంతమొందించగలుగుతోందని ట్రయిల్స్ లో కనుగొన్నారు. 2-డిజి ఒక సాచెట్‌లో పౌడర్ రూపంలో వస్తుంది మరియు దానిని నీటిలో కరిగించిన తరువాత తీసుకోవాలి. నేషనల్ డ్రగ్ రెగ్యులేటర్ అయిన డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) మే 1 న దాని అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఇదివరకే తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ మే 17 న మొదటి బ్యాచ్ మందును విడుదల చేశారు.
ఈ డ్రగ్ ఎలా పని చేస్తుంది..?
ఈ డ్రగ్ ఉపయోగించడం వలన కరోనా సోకిన వారు తొందరగా కోలుకోగలుగుతారు.. అంతే కాదు.. ఆక్సిజెన్ పై ఆధారపడాల్సిన అవసరాన్ని కూడా ఈ డ్రగ్ తగ్గిస్తుంది. వైరస్ సోకిన కణాల వద్దకు ఈ డ్రగ్ చేరి వైరస్ వృద్ధి చెందటాన్ని ఆపుతుంది. తద్వారా ఇది వైరస్ పెరుగుదలను నిరోధించి రోగులు కోలుకోవడానికి సాయం చేస్తుంది.
ఈ డ్రగ్ ను ఎవరికీ ఇవ్వచ్చు..? ఎక్కడ దొరుకుతుంది..?
కరోనా డ్రగ్ ను లిమిటెడ్ గా అత్యవసరమైన కేసులకు మాత్రమే వినియోగిస్తారు. ఇప్పటివరకు ఈ డ్రగ్ ఇంకా మార్కెట్ లోకి అందుబాటులోకి రాలేదు. “మే 19 న ఈ డ్రగ్ న అధికారికం గా లాంచ్ చేస్తామని” డా.రెడ్డీస్ లాబొరేటరీస్ గతం లోనే ప్రకటించింది. జూన్ రెండు లేదా మూడవ వారం నాటికి ఈ డ్రగ్ హాస్పిటల్స్ కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
2-DG డ్రగ్ గురించి ట్రయల్స్ ఏమి చెబుతున్నాయి..?
గతేడాది మే నుంచి అక్టోబర్ వరకు 110 పేషెంట్స్ పై ఈ డ్రగ్ ను ప్రయోగించారు. వీరందరికి ఈ డ్రగ్ మంచి ప్రయోజనాన్ని చేకూర్చింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నమోదు కాలేదు. 2-DG డ్రగ్ కరోనా వైరస్ పై గట్టి ప్రభావాన్నే చూపిస్తోందని ట్రయల్స్ చెబుతున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 220 పేషెంట్స్ తో మూడవ ఫేస్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ఫలితాలు కూడా ఆశాజనకం గానే ఉంది. ఇతర మెడిసిన్ తో పోలిస్తే ఈ డ్రగ్ మెరుగైన ఫలితాన్నిచ్చింది. ఆక్సిజెన్ అవసరాన్ని కూడా తగ్గించింది. 65+ సంవత్సరాల రోగులలో కూడా ఇలాంటి ఫలితాలే కనిపించాయి. అయితే ఈ డ్రగ్ సామర్ధ్యాన్ని వివరించడానికి పూర్తి డేటా లేకపోవడం పై కొందరు ఆందోళన వ్యక్తం చేసారు. 2-డిజి కాన్సర్ చికిత్స లో మంచి ఫలితాలే ఇచ్చింది. అయితే.. కొవిడ్ విషయం లో ఈ మెడిసిన్ గురించి మరింత అధ్యయనం చేయాల్సి ఉంది.
End of Article