Ads
తారక్,
Video Advertisement
నిన్ను అందరూ ఇలాగే పిలుస్తారు. నీ అభిమానులు నిన్ను యంగ్ టైగర్ అంటారు. కానీ మాకు మాత్రం నువ్వు నందమూరి తారక రామారావువి. ఎన్నో కోట్ల మంది మీ తాత గారి అభిమానుల్లో నేను కూడా ఒకడిని. మీ తాత గారి సినిమా వస్తోంది అంటే టికెట్ల కోసం థియేటర్ క్యూలో నిలబడే వాళ్ళలో నేను ముందు వరుసలో ఉంటాను.
మీ తాత గారి తర్వాత, నీ కంటే ముందు మీ కుటుంబంలో ఎంతమంది నటులుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వారందరూ కూడా మీ తాత గారి పేరు నిలబెట్టారు.
వారందరూ ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే ఏమీ అనిపించలేదు. కానీ నువ్వు వస్తున్నావ్ అంటే మాత్రం కాస్త ఆలోచించాను. అందుకు కారణం ఆ పేరు. “అంత గొప్ప వ్యక్తి పేరు పెట్టుకున్నాడు అంటే ఆ పేరుకు తగ్గ గుర్తింపు కూడా సంపాదించుకోవాలి. అతనేమో మరీ చూడడానికి కుర్రాడిలాగా ఉన్నాడు. చిన్నప్పుడు నటించాడులే కానీ ఇప్పుడు హీరోగా చేయగలుగుతాడా? అసలు నటించగలుగుతాడా? ఆయన పేరు నిలబెట్టకపోయినా పర్లేదులే కానీ, పాడు చేయకుండా ఉంటే చాలు” అని అనుకున్నాను.
నీ మొదటి సినిమా తర్వాత అనుకున్నట్టుగానే అందరూ ఇలాగే అన్నారు. “సరేలే మొదటి సినిమా కదా? ఇంక ముందు ముందు ఏం చేస్తాడో చూద్దాం” అనుకున్నాను. తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్-1 సినిమా కూడా చూశాను. అది చూశాక పర్లేదు బానే చేస్తున్నాడు అనుకున్నాను. తర్వాత వచ్చిన ఆది, సింహాద్రి చూసి నీ మీద ఇంకొంచెం నమ్మకం పెరిగింది. కానీ తర్వాత కారణాలు తెలియదు కానీ నీ సినిమాలు ఏవి అనుకున్నంత బాగా ఆడలేదు. అందులో నీ కష్టం కనిపిస్తోంది కానీ ఫలితం మాత్రం అంత బాగా రావట్లేదు.
ఒక్కొక్కసారి నిన్ను చూస్తే, “అంత కష్టపడుతున్నాడు. అంత మంచి హిట్లు కూడా వస్తే బాగుండు” అనుకున్నాను. అప్పుడే వచ్చింది రాఖీ సినిమా. అప్పటికే నువ్వు పెద్ద హీరో స్థాయిలో ఉన్నావు. అలాంటి సమయంలో ఇలాంటి సినిమా చేయడం చాలా గొప్ప విషయం. కానీ అంత గొప్ప విషయాన్ని పక్కనపెట్టి అందరూ నీ గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. యమదొంగ సినిమాతో అలా మాట్లాడిన వాళ్ళ అందరి నోళ్ళు మూతపడేలా చేశావు. చాలా సంతోషంగా అనిపించింది. ఇంక అప్పటి నుంచి నీకు తిరుగులేదు అనే స్థాయిలో నీ సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమాకి నువ్వు పడే కష్టం తెరపై కనిపిస్తోంది.
అదుర్స్ లో చారి లాంటి కామెడీ పాత్ర చేసిన నువ్వే, జై లవ కుశ సినిమాలో జై లాంటి పాత్ర చేసావు అంటే నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది.టెంపర్ లాంటి సినిమా చేసిన నువ్వే, అరవింద సమేత లాంటి సినిమా చేసావు అంటే ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. బహుశా ఒక పరిపూర్ణ నటుడు అంటే ఇలాగే ఉంటాడేమో. నువ్వు కొమరం భీమ్ గా నటించావు అంటే తప్పే అవుతుంది. నువ్వు ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉన్నాం. నువ్వు కొమరం భీముడో అంటూ బాధపడుతూ ఉంటే మాకు బాధగా అనిపించింది.
ఒక్క నాలుగు నిమిషాల పాట అప్పటి వరకూ ఈలలు వేస్తూ అరుస్తూ ఉన్న జనాలని ఒక్కసారిగా ఎమోషనల్ చేసింది. అందులో నువ్వు పడిన బాధ మాకు కంటతడి పెట్టించింది. ఒక సమయం వరకు మీ తాత గారి పేరు నిలబెట్టకపోయినా పర్వాలేదు కానీ, పాడు చేయకుండా ఉంటే చాలు అనుకున్నాను. తర్వాత తాత లాగానే మంచి పేరు సంపాదించుకుని పెద్ద నటుడు అవుతాడు అని అర్థమయింది. తాతకు తగ్గ మనవడు అనిపించావు. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం తాతని మించిన మనవడు అయ్యావ్ ఏమో అనిపిస్తుంది. ఇలాగే మంచి సినిమాలు చేస్తూ, సినిమాల్లో మాత్రమే కాకుండా బయట కూడా అందరితో కలిసిపోతూ సరదాగా ఉంటూ మేము ఎప్పుడూ గర్వంగా చెప్పుకునే మా తారక్ లాగా ఉంటావని ఆశిస్తూ…
మీ తాత గారి కోట్లమంది అభిమానుల్లో ఒక అభిమాని.
End of Article