ఇటీవలి కాలంలో పీటల మీద ఆగిపోతున్నపెళ్లిళ్ల వార్తలు తరచూ వింటున్నాము. తమిళనాడులో తాళి కట్టే ముందు వరుడు నచ్చలేదని ఓ యువతి పీటల మీద నుంచి లేచిపోగా… మరోక చోట వరుడు తాగి వచ్చాడని అతడ్ని చేసుకోటానికి నిరాకరించింది మరొక యువతి. ఇలాంటి సంఘటనలు ఇటీవల దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.
Video Advertisement
అయితే తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. ఆ అమ్మాయికి తండ్రి లేడు. తోడబుట్టిన వాళ్ళు ఆమె బాద్యత తీసుకొని అప్పులు చేసి మరీ పెళ్లి చేసారు. ఇక చివరికి అప్పగింతలు సమయం వచ్చేసరికి అత్తారింటికి సాగనంపడానికి కారు ఎక్కించగానే నిజం బయటపడింది. పెళ్ళికొడుకుకు ఉన్న జబ్బు బయట పడటం తో.. అతడితో వెళ్లానని మొండికేసింది వధువు. పెళ్ళిలో మోసపోయిన ఆ వధువు నేరుగా పోలీసులని ఆశ్రయించింది.
ఈ ఘటన కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో కొత్వాలి టౌన్ లో దీపక్, అతడి చెల్లి ఆర్తి నివసిస్తున్నారు. దీపక్ తండ్రి చనిపోవడంతో చెల్లెలి బాధ్యత తనే తీసుకున్నాడు. ఝాన్సీలోనే ప్రేమనగర్ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తితో ఆర్తి పెళ్ళి కుదిర్చారు. రెండునెలల క్రితం వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. అప్పుడు ఆ యువకుడు ఒక్క మాట కూడా మాట్లాడ లేదు.
దీంతో అతడు ఇంట్రావర్ట్ అనుకోని పెళ్లి కూతురు తరపు వాళ్ళు సర్దుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా ఎప్పుడు అతడు ఆర్తి తో ఫోన్ లో కూడా మాట్లాడ లేదు. వాళ్ళింట్లో వాళ్ళను కనుక్కొంటే.. రాజ్ కుమార్ ఫోన్ వాడడు అని చెప్పారు. వీరికి కాస్త అనుమానం వచ్చినా సరే చివరికి పెళ్లి ఘనంగా జరిపించారు. పెళ్ళి అయిపోయాక అప్పగింతలు మొదలయ్యాయి. అమ్మాయిని అబ్బాయితో అత్తారింటికి పంపడానికి కారు ఎక్కించారు.
ఇక ఆ తర్వాత అబ్బాయి కారు ఎక్కబోతుండగా ఒక్కసారిగా కింద పడిపోయాడు. కాళ్ళు చేతులు నేలమీద రాపాడించడం, నాలుక కొరుక్కోవడం, బట్టలు చింపుకోవడం చేశాడు. దీంతో అందరు షాక్ అయ్యారు. అబ్బాయి తల్లిదండ్రులు వెంటనే కాళ్ళలో ఉన్న చెప్పులు తీసి వాసన చూపించడంతో మెల్లిగా తిరిగి మామూలు స్థితికి వచ్చాడు. దీంతో అమ్మాయి వారికి అతడికి మూర్ఛ ఉందని అర్థం అయ్యింది. దీంతో ఆ అమ్మాయి కార్ దిగబోతుండగా అక్కడున్న కుర్రాళ్ళు అమ్మాయిని కారు దిగనివ్వలేదు.
చాలాసేపటి వాదన తరువాత అమ్మాయి కారు దిగింది. ఆ అమ్మాయి అత్తారింటికి వెళ్ళడానికి ఒప్పుకోకపోవడం తో ఆమెను అత్తారింటికి పంపాలని డిమాండ్ చేస్తూ గుంపుగా గొడవకు దిగారు. వారందరినీ తప్పుకుని అమ్మాయితోపాటు ఆమె అన్నలు కూడా పోలిస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అబ్బాయి తల్లిదండ్రులు మాత్రం మా అబ్బాయి పెళ్ళి ముహూర్తాల కారణంగా నిద్ర లేక ఇలా అయ్యింది అని చెప్పుకొచ్చారు. ఇక అతడితో కాపురం చెయ్యనని.. తాము పెళ్ళికి ఎంతో ఖర్చుచేశామని ఆ మొత్తం తిరిగి ఇవ్వాల్సిందేనని అమ్మాయి తెగేసి చెప్పింది. ఆర్తి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.