Ads
కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇప్పటికీ కూడా అభిమానించే సినిమా అమ్మోరు. అమ్మోరు సినిమాని ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టైంలో ఒక ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది అమ్మోరు. అసలు ఆ టైమ్ లో అంత గ్రాఫిక్స్ తో, మైథలాజికల్ ఫాంటసీ సినిమా తీయడం అంటే ఒకరకంగా రిస్క్ తీసుకున్నట్టే. కానీ కోడి రామకృష్ణ గారు, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆ రిస్క్ తీసుకున్నారు.
Video Advertisement
అంతే కాకుండా రిస్క్ తీసుకుంటేనే, కష్టపడితేనే ఒక ట్రెండ్ సెట్ చేయగలుగుతాం అనడానికి ఒక ఉదాహరణగా నిలిచారు. అసలు అమ్మోరు సినిమా 1992 లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న అయినవిల్లి ప్రాంతంలో మొదలైంది. కానీ 1995 లో విడుదలైంది. శ్యాం ప్రసాద్ రెడ్డి గారు ఈ సినిమాని ఒక కోటి 80 లక్షల బడ్జెట్ తో తీశారు. ఆ టైమ్ లో ఇంత బడ్జెట్ అవ్వడంతో ఎన్నో చర్చలకు దారి తీసింది. ఇంకా అప్పటికి ఆ సినిమాలో నటించిన వాళ్ళందరూ స్టార్ స్టేటస్ లో లేరు.
ఈ సినిమాకి సౌందర్య గారు తీసుకున్న రెమ్యూనరేషన్ 40 వేల రూపాయలు. అమ్మోరు సినిమా విడుదలైన తర్వాత ఎన్నో రికార్డులు సృష్టించింది. ఆ సమయంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాల్లో ఒకటిగా అమ్మోరు సినిమా నిలిచింది.
ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో ఎక్కువ శాతం పాత్ర సౌందర్య గారిది. ఈ సినిమాలో నటించిన వాళ్లకి, అందులోనూ ముఖ్యంగా సౌందర్య గారికైతే అమ్మోరు సినిమా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాతో సౌందర్య గారు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు.
సినిమాలో సౌందర్య గారి పాత్ర బాధపడితే మనం కూడా బాధపడ్డాం, భయపడితే మనం కూడా భయపడ్డాం. అలా ప్రతి ఎమోషన్ ని చాలా బాగా కన్వే చేశారు సౌందర్య గారు. తర్వాత శ్యాం ప్రసాద్ రెడ్డి గారు, ఈ సినిమాలో అంత బాగా నటించినందుకు సౌందర్య గారికి ఇంకొక లక్ష రూపాయల పారితోషకం ఇవ్వాలనుకున్నారు. కానీ సౌందర్య గారు డబ్బులు తీసుకోకుండా, తనకి అంత మంచి పాత్ర ఇచ్చినందుకు శ్యాం ప్రసాద్ రెడ్డి గారికి థాంక్స్ చెప్పారు.
అమ్మోరు సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు వడివుక్కరసి గారు. అసలు ఆ పాత్రలో వడివుక్కరసి గారిని తప్ప మరొకరిని ఊహించుకోలేం. కానీ ఈ పాత్రకి మొదటి ఛాయిస్ వడివుక్కరసి గారు కాదు. సీనియర్ యాక్ట్రెస్ నాగమణి గారు మొదట వడివుక్కరసి గారి పాత్రలో నటించారు.
అలాగే రామిరెడ్డి గారు పోషించిన పాత్రలో మొదట నటుడు చిన్నా నటించారు. 1992 లో మొదలైన అమ్మోరు సినిమా కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అవుట్ పుట్ అంత బాగా అనిపించలేదు. దాంతో కోడి రామకృష్ణ గారిని రీ షూట్ చేయమని రిక్వెస్ట్ చేశారు శ్యాం ప్రసాద్ రెడ్డి గారు.
అప్పుడు కోడి రామకృష్ణ గారు చిన్నా పాత్రలో రామి రెడ్డిని, నాగమణి గారి పాత్రలో వడివుక్కరసి గారిని రీప్లేస్ చేసి షూట్ చేశారు. అలా అమ్మోరు సినిమా షూటింగ్ రెండు సార్లు జరిగింది. అందుకే సినిమా మేకింగ్ ప్రాసెస్ పూర్తవడానికి చాలా సమయం పట్టింది.
End of Article