నిన్ను చూసాకే ధైర్యం అంటే ఏంటో తెలిసింది…మహింద్ర చైర్మన్ పొగిడిన ఆ అమ్మాయి ఎవరో తెలుసా?

నిన్ను చూసాకే ధైర్యం అంటే ఏంటో తెలిసింది…మహింద్ర చైర్మన్ పొగిడిన ఆ అమ్మాయి ఎవరో తెలుసా?

by Mohana Priya

Ads

మనలో ఎంతో మందికి మన మీద మనకు నమ్మకం ఉండదు. ఆత్మనూన్యత భావం తో ఏ పని సరిగ్గా చేయలేక బాధపడుతూ ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి భయాలన్ని వదిలేసి ధైర్యంతో మేము ఏమైనా సాధించగలం అని కష్టపడి పని చేస్తే కచ్చితంగా మీకంటూ మీరు ఒక గుర్తింపు ఏర్పరచుకుంటారు. అలా ధైర్యంగా ముందడుగు వేసి తనకంటూ ఒక గుర్తింపు సాధించింది మారియట్.

Video Advertisement

మారియట్ కి పుట్టుకనుంచి చేతులు లేవు. దానికి కారణం థాలిడోమైడ్ సిండ్రోమ్. మారియట్ ఊరు కేరళలోని ఇడుక్కి లోని తోడు పూజ ప్రాంతం. తండ్రి వ్యవసాయం చేస్తూ ఉంటారు. తల్లి గృహిణి. తన తల్లి తండ్రి చిన్నప్పటి నుంచి తనకి ధైర్యంగా ఉండటం నేర్పి అన్నిట్లో ప్రోత్సహించే వాళ్లు. స్కూల్లో తన స్నేహితులు టీచర్లు కూడా తను ఏదైనా సాధించగలదు అని ఉత్సాహం నింపే వాళ్ళు.

కానీ చాలా మంది తన వైపు జాలిగా చూడటం లాంటి అనుభవాలు తనకు ఎదురయ్యాయి. తనకి అసలు నచ్చేవి కావు. చేతులు లేనంత మాత్రాన తను ఏమీ చెయ్యలేదు అని అన్నట్టు అనిపించేవి వారి చూపులు. వాళ్లందరికీ తను ఏదైనా సాధించగలదు అని నిరూపించాలి అని నిర్ణయించుకుంది.

ఇతరుల సహాయంతో కాకుండా తన కాళ్ళపై తాను నిలబడాలని అనుకుంది. తనకు చిన్నప్పటి నుండి పెయింటింగ్ అంటే ఇష్టం ఉండటంతో పెయింటింగ్ నేర్చుకుంది. అలా చిన్నతనం నుండే అనేక సవాళ్లను ఎదుర్కొంటూ కొచ్చిలోని వియాని ప్రింటింగ్స్ లో గ్రాఫిక్ డిజైనర్ గా ఉద్యోగం సంపాదించింది.

తన ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నా పెయింటింగ్ పై ఇష్టంతో ఖాళీ సమయాల్లో పెయింటింగ్ గీసి ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తూ ఉంటుంది. పెయింటింగే కాకుండా కార్ నడపాలని కూడా తనకు చిన్నప్పటి నుండి కల. చేతులు లేకుండా కారు నడపడం సాధ్యం కాదు అని తనని చాలా మంది నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. కానీ తను ఏమీ పట్టించుకోకుండా తోడు పూజ ఆర్టీవో ఆఫీస్ లో డ్రైవింగ్ ట్రైనింగ్ కోసం అప్లై చేసింది. కానీ వాళ్లు కూడా తన అప్లికేషన్ను తిరస్కరించారు. అప్పుడు తనలో పట్టుదల పెరిగి 2018లో ప్రత్యేక వ్యక్తుల కోసం తయారుచేసిన మారుతి సెలెరియో ఆటోమేటిక్ కారుని కొనుక్కుంది.

తల్లి తండ్రి తను ఒంటరిగా డ్రైవింగ్ నేర్చుకుంటాను అంటే వద్దు అన్నారు. మారియట్ వారిని ఒప్పించింది. ఎర్నాకులం లోని యంగ్ ఉమెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ (వైఎంసిఎ) లో కారు నడపడం నేర్చుకుంది. కారు నేర్చుకున్న తర్వాత లైసెన్స్ కోసం హైకోర్టును ఆశ్రయించింది. కొన్ని నెలల పోరాటం తర్వాత హైకోర్టు తనకి లైసెన్స్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశం ప్రకారం తోడు పూజలోని ఆర్టిఓ ఆఫీస్ లెర్నర్ లైసెన్స్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ ఏడాది పర్మనెంట్ లైసెన్స్ అందుకుంది. చేతులు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి ఆసియా మహిళగా మారియట్ గుర్తింపును అందుకుంది.

మనోజ్ కుమార్ అనే వ్యక్తి మారియట్ ని అభినందిస్తూ తను కార్ డ్రైవ్ చేస్తున్న వీడియో ని ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ వీడియో చూసిన వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసి రీ ట్వీట్ చేసి సి తనని చూశాకే ధైర్యసాహసాలు అంటే ఏంటో అర్థం అయింది అని. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను జయించడానికి మనందరికీ ఇలాంటి ధైర్యం కావాలని, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం సవాళ్ళను ఎదుర్కోవడానికి ఈ వీడియో స్ఫూర్తిగా నిలుస్తుంది అని మారియట్ ని ప్రశంసించారు.

మారియట్ మాట్లాడుతూ ” నేను ఇప్పుడు ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణించగలను. నా పనులన్నీ నేనే చేసుకోగలను. చిన్నప్పటినుండి రద్దీ ఉన్న రోడ్డుపై కారు నడపాలి అనేది నా కల. అది ఇప్పుడు నిజమైంది. లోపం ఉంది అన్న కారణంగా నాలుగు గోడలకి పరిమితమవుతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనం ఏం చేయగలం మన ప్రత్యేకతలు ఏంటి అనేది అందరికీ తెలీదు. కాబట్టి వాటిని సవాలుగా తీసుకొని ధైర్యంగా ముందుకెళ్లాలి. అప్పుడే మనం  ప్రపంచానికి మనమేంటో నిరూపించగలం” అని చెప్పింది.

images source: facebook/jilumol.mariet


End of Article

You may also like