2020 వచ్చి అప్పుడే ఆరు నెలలు అయిపోయింది. మనకి తెలియకుండానే సగం సంవత్సరం గడిచిపోయింది. ఎవరు ఊహించని విధంగా ప్రపంచం మొత్తం ఆగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందు కరోనా, తర్వాత తుఫాన్ వీటి నుండి కోలుకొనే లోపే ఇప్పుడు మరొకటి. కానీ ఈ సారి మిడతలు రంగంలోకి దిగాయి. గాలి కూడా దూరడానికి వీలు లేనంతగా మిడతలు అన్ని గుంపుగా చేరి పంటల పై దాడి చేస్తున్నాయి.
విచిత్రం ఏంటి అంటే ఇలాంటి దాడి దక్షిణ భారతదేశం పై జరిగితే ఎలా ఉంటుందో అని ముందుగానే పరిచయం చేశారు తమిళ డైరెక్టర్ కె వి ఆనంద్. తాను దర్శకత్వం వహించిన కాప్పన్ లో ఇలాంటి మిడతల దాడి గురించి చూపించారు. అదే సినిమా తెలుగులో బందోబస్తు పేరుతో అనువాదం అయ్యింది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా విడుదల సమయంలో అంత పెద్దగా ఆడకపోవడంతో ఎవరు పట్టించుకోలేదు. ఈ మిడతల దాడి ఏంటి ఈ సినిమా ఏంటి అని విమర్శించారు. కానీ ఇప్పుడు ఇలాంటి సంఘటనలు నిజజీవితంలో కూడా కనిపించడంతో అందరి చూపు ఈ సినిమా మీద పడింది.
దీనిపై డైరెక్టర్ కె.వి ఆనంద్ మాట్లాడుతూ ” నాకు ఎన్నో ఫోన్, మెసేజెస్ వస్తున్నాయి. ఇలాంటి సినిమా తీసినందుకు ఎంతో అభినందిస్తున్నారు. కానీ ఇవేమీ నాకు ఆనందంగా అనిపించడం లేదు. నిజ జీవితంలో ఇలాంటి నష్టాలు జరగడం చాలా బాధాకరం. నేను ఈ సినిమా తీసే ముందు ఎంతో రీసెర్చ్ చేశాను. మడగాస్కర్ లో ఒక షూటింగ్ కి వెళ్ళినప్పుడు మేమే స్వయంగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాం. నేను నా టీం కార్లో వెళుతున్నప్పుడు ఒక మిడతల గుంపు మా వైపు వచ్చింది. కారు ముందుకి కదలడం కూడా కష్టం కావడంతో అక్కడే ఎంతోసేపు ఆగిపోవాల్సి వచ్చింది. అప్పుడే అక్కడున్న జనాలతో ఈ మిడతల దాడి గురించి మాట్లాడి అవి దాడి చేయడానికి కారణాలు, తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనే వాటి గురించి తెలుసుకున్నాను. అప్పుడే కాప్పన్ సినిమా ఆలోచన వచ్చింది.” అని అన్నారు.
ఇది ఇలా ఉంటే సూర్య ఒక వ్యాధి పై తీసిన సినిమా సెవెంత్ సెన్స్ లో జరిగిన సంఘటనలు కరోనా సంఘటనలతో పోలి ఉండడం, ఇప్పుడు కాప్పన్ లో చూపించినవి కూడా నిజ జీవితంలో జరగడంతో తను చేసే సినిమాలు భవిష్యత్తులో నిజమవుతాయి అని జనాలు సరదాగా సోషల్ మీడియాలో అంటున్నారు.
సాధారణంగా జూలై అక్టోబర్ మధ్యలో మిడతలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. జనవరి సమయంలో దోమలు ఎలాగో జులై సమయంలో మిడతలు అలాగ. కానీ ఇప్పుడు అవి మామూలుగా వచ్చే సమయానికి ముందే రావడంతో జూలై సమయంలో మిడతల బెడద ఎలా ఉంటుందో ఊహకు కూడా అందడం లేదు. జులై లోపు ఈ సమస్య పరిష్కారం అయితే ఏ ప్రమాదం ఉండదు కానీ ఒకవేళ కాకపోతే ఆ తర్వాత జరిగే పంట నష్టం నుండి కోలుకుని మళ్లీ మామూలు స్థితికి రావడానికి చాలా సమయం పట్టొచ్చు.
There’s a giant #LocustInvasion in my hometown #Jaipur. It came, eating flowers, leaves and terrifying people with its aggression. That muddy covering you see? That’s #locust. Been getting WhatsApp forwards all day. Can you imagine what’s happening to the standing crops? pic.twitter.com/ZXN2jZLC72
— Maitreyi Bordia Das (@DasMaitreyi) May 25, 2020
ఇప్పటికే రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ పంజాబ్ హర్యానా పై ఈ మిడతల దాడి జరిగింది. ఎన్నో లక్షల ఎకరాల భూమి నాశనం అయింది. తర్వాత ముప్పు పొంచి ఉన్న ప్రదేశాలు మన తెలుగు రాష్ట్రాలే. తెలంగాణకు పక్కనే ఉన్న విదర్భ లో ఇప్పటికే ఈ దాడి వల్ల ఎంతో పంట నష్టం జరిగింది. ఇంకా తర్వాత తెలంగాణ వైపు ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ వైపు ఈ మిడతల గుంపు దాడిచేసి సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే రెండు రాష్ట్రాల్లో ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. కొన్ని ప్రదేశాల్లో క్లోరిపైరిఫోస్ అనే రసాయనిక పదార్థాన్ని ఆ కీటకాలకు వచ్చినప్పుడు పిచికారి చేయడానికి సిద్ధం చేశారు. మరికొన్ని చోట్ల వినూత్నంగా పెద్ద స్పీకర్ లలో పాటలు పెట్టి ఆ శబ్దానికి మిడతలు భయపడి పారి పోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు.