Ads
“పరుల కోసం పాటు పడని నరుని బతుకు దేనికని …మూగ నేలకి నీరందివ్వని వాగు పరుగు దేనికని” సినారే చెప్పినట్టు.. దాతృత్వాన్ని చాటుకోవాలంటే లక్షాధికారులో , కోటీశ్వరులో కానక్కర్లేదు..సాటి మనిషికి సాయం చేయాలనే మనసుంటే సరిపోతుంది..ఏదో ఒక రూపంలో తమ శక్తి మేరకు సాయాన్ని అందించొచ్చని నిరూపిస్తుంది శీతల్.
Video Advertisement
ముంబయ్ లోని ఘట్ కోపర్ కి చెందిన శీతల్ ,కొన్నేళ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంది . కుటుంబం గడవాలంటే బండి తీయాల్సిందే..కాని లాక్ డౌన్ తో నెలన్నరగా ఆటో తీయడం లేదు.. తీసినా ఎక్కడానికి మనుషులెవరూ లేరు..ఒకవైపు తన కుటుంబ పోషణ కష్టం, మరోవైపు ముంబయ్ లో భారీగా కేసులు పెరిగిపోతున్న కరోనా భయం. ఇలాంటి పరిస్తితుల్లో ఇంటినుండి బయటకి రావడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి . అలాంటిది లాక్టౌన్ కారణంగా రవాణా సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ఉచితంగా ఆటో నడపుతోంది .
అత్యవసర పరిస్థితి ఉంటే సొంత వాహనాలు ఉన్న వారు ఎలాగోలా బయటికి వస్తున్నారు.కానీ ఎటువంటి వాహనాలు లేక, రవాణా సౌకర్యాలు లేక అత్యవసర పరిస్తితితో బయటికి వచ్చే పేదవారికోసం శీతల్ ఆటో నడుపుతుంది. వారిని ఆటోలో ఎక్కించుకుని తీసుకువెళ్లడమే కాదు, తిరిగి వారుండే చోటుకి చేరుస్తోంది.అంతేకాదు ఎవరికైనా లంచ్ బాక్స్ చేరవేయాల్సిన పరిస్థితి ఉన్నా ఆ బాద్యత శీతలే తీసుకుని, ఉచితంగా వారికి అందచేస్తుంది.
“నా కుటుంబ పోషణకు ఆటోను నడిపేదాన్ని. ఇప్పుడు పేదప్రజల ఇబ్బందిని చూసాక , నా దగ్గర వాహనం ఉండి దేనికి ఉపయోగం అనే ఆలోచన వచ్చింది.. వెంటనే రవాణా లేక ఇబ్బందులు పడుతున్న పేదవారికి సాయం చేయాలనుకున్నాను. ఇలా చేయడం నాకెంతో సంతోషంగా ఉంది” అని చెప్తుంది. ముంబై లాంటి మహానగరంలో నయాపైసా ఆశించకుండా ఉచిత సేవ చేయడం గ్రేట్ అంటూ ముంబై వాసులు తనని, తన సేవని కొనియాడుతున్నారు.
End of Article