లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన పనిలేదు. తన సినిమాలతో పాటు వ్యక్తిత్వంలో ఆమె తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇక అది అలా ఉంటే నయన్ ఇటీవల తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని.. నాలుగు నెలల్లోనే కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యం లో ఈ జంటపై పలు విమర్శలు వెలువెత్తాయి. నయనతారపై చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తమిళనాడు సర్కార్ సరోగసీపై విచారణ కమిటీకి ఆదేశించింది. ఈ మేరకు కమిటీ తమ నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి బుధవారం సమర్పించింది. ఈ నివేదికలో నయన్, విఘ్నేష్ శివన్ ల వివాహం, సరోగసీ కోసం దంపతులు చేపట్టిన చర్యలను కమిటీ పూర్తి స్థాయిలో వెల్లడించింది.
2016 మార్చి 11న విఘ్నేష్ శివన్ ను నయనతార పెళ్లి చేసుకున్నట్లు దంపతులు అఫిడవిట్ దాఖలు చేసినట్లు కమిటీ తెలిపింది. నయనతార దంపతులు 2021 ఆగస్టు నెలలో సరోగసీ ప్రక్రియను ప్రారంభించారని, నిబంధనలకు అనుగుణంగానే అదే ఏడాది నవంబర్ లో సరోగసీ కోసం ఒప్పందం చేసుకున్నారని కమిటీ వెల్లడించింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నయనతార దంపతులు సరోగసీ ద్వారా పిల్లలను కన్నారని కమిటీ తేల్చింది.
కాబట్టి నయనతార దంపతులకు కలిగిన పిల్లలు చట్టబద్ధమేనని, చట్టబద్ధంగానే నయనతార దంపతులు పిల్లల్ని కన్నారని కమిటీ తెలిపింది. దీంతో నయనతార దంపతులకు సరోగసీ కేసులో ఉపశమనం లభించినట్టయ్యింది.