మీడియా విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరు కరెక్టేనా?
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చాలా పెద్ద మార్పుకు సంకేతం ఇచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుని, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేసిన తీరును ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే వాళ్లకు వచ్చిన అవకాశంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అటు లోక్ సభలోనూ.. ఇటు అసెంబ్లీలోనూ పూర్తిగా పక్కన పెట్టేశారు. 151 స్థానాలతో ఏకఛత్రాధిపత్యాన్ని చలాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని.. ఏకంగా 11 సీట్లకు పరిమితం చేశారు. అదే సమయంలో.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీకి 135 సీట్లు ఇచ్చి, పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా దీవించారు. మరోవైపు.. టీడీపీ మిత్రపక్షమైన జనసేనకు 21 సీట్లు, భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇచ్చి ఏపీ ప్రజలు కూటమికి తమ మద్దతు తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా అధికారం కట్టబెట్టాలన్నా.. శిక్షించాలన్నా ప్రజలకు ఉన్న ఏకైక మార్గం ఇదేనని ప్రముఖ జర్నలిస్ట్ హర్షవర్ధన్ త్రిపాఠి అభిప్రాయపడ్డారు. అధికారం ఇచ్చినప్పుడు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదని ఏపీ ప్రజలు భావించారు. కాగా.. చంద్రబాబు నాయుడుకు విజనరీ లీడర్ అనే పేరు ఉంది. దేశంలోనే తొలిసారిగా అభివృద్ధి రాజకీయాలు చేసిన నాయకుడు చంద్రబాబును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. ప్రజలు ఓడించి ఉండొచ్చు, కానీ ఆయన చేసిన కృషి, అభివృద్ధి ఇప్పటికీ కళ్లముందు కనిపిస్తుంటుంది. కాగా.. ఇప్పుడు తన పాత ఇమేజ్ను మళ్లీ ఆవిష్కరించుకునే అవకాశాన్ని చంద్రబాబుకు ఏపీ ప్రజలు కల్పించారు.
అయితే.. పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. చంద్రబాబు నాయుడు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చేయటమే కాకుండా.. ఏపీలో 4 టీవీ ఛానళ్లపై నిషేధం విధించినట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఏదైనా ఛానెల్ తప్పుడు వార్తలను ప్రచురించినప్పుడు.. సదరు కథనాలపై వివరణ ఇవ్వాలని అడగొచ్చు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తప్పుడు మార్గంలో నిర్మిస్తుంటే దానిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ.. అఖండ మెజార్టీతో ఏర్పడిన ప్రభుత్వం ఇలా ప్రతీకార ధోరణితో వ్యవహరించడమనేది సరైన పద్ధతి కాదు.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఏ రాజకీయ పార్టీ కూడా ఏ న్యూస్ ఛానెల్‌ను నిషేధించడం ద్వారా తమ ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు నడిపించినట్టు చరిత్రలో లేదు. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత.. మీడియాపై నిషేధం విధించాలన్న ఆలోచనను చంద్రబాబు ఎందుకు నిలువరించుకులేకపోయారన్నది పెద్ద ప్రశ్న. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే టీవీ9, ఎన్టీవీ, సాక్షి టీవీ, 10 టీవీ అనే నాలుగు తెలుగు న్యూస్ ఛానళ్లపై నిషేధం విధించారు. ఈ 4 న్యూస్ ఛానళ్లకు ఆంధ్రప్రదేశ్‌లో 60 లక్షల వరకు వీక్షకులు ఉన్నారని తెలుస్తోంది.
అయితే.. సాక్షి టీవీని నడుపుతున్న ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ కంపెనీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంతో సంబంధం ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏబీఎన్, టీవీ5, ఈటీవీలను టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణలో కూడా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏబీఎన్, టీవీ9 జర్నలిస్టులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరికి ఎదురైన అనుభవాలు చూసైనా.. చంద్రబాబు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
దక్షిణ భారత రాజకీయాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. మీడియాపై నిషేధం విధించటమనే వింత సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో.. ఆయా పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తమకు ప్రతికూలంగా వ్యవహరించే ఛానెళ్లను నిషేధిస్తూ వస్తున్నాయి. ఈ విషయంలో.. ఆయా పార్టీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. “మా ఛానల్- వాళ్ల ఛానెల్” అంటూ టీవీ ఛానెళ్లను నిషేధించే ఆటను కేంద్ర ప్రభుత్వం ఆడలేదు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురితమైన వార్తల ప్రకారం.. చంద్రబాబు నాయుడు విజయం సాధించినప్పటికీ.. ఈ ఛానెల్‌లు ఆయనకు మద్దతుగా కథనాలు చూపించట్లేదు కాబట్టి.. ప్రజలు వాటి మెంబర్‌షిప్‌ను ముగించేస్తున్నారని కేబుల్ టీవీ ఆపరేటర్లు చెప్తుండటం గమనార్హం. మీడియాపై ఇలాంటి ఆంక్షలు పెట్టటం వల్ల.. ఏ ప్రభుత్వానికి మంచి జరగలేదన్నది గతం చూస్తే అర్థమవుతోంది.
విజనరీ లీడర్‌గా పేరున్న చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓ మార్పు కోసం తనకు ఈ అఖండ విజయాన్ని కట్టబెట్టారని గుర్తించాలి. ఇలా మీడియా స్వేచ్ఛను హరించటం వల్ల.. ఆయన ప్రయాణంలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పార్లమెంటులో జరుగుతున్న సమావేశాల్లో అప్పటి ఎమర్జెన్సీని నేతలు గుర్తు చేసుకోవటం గమనార్హం. చంద్రబాబు కూడా దాని నుంచి ఎంతో కొంత గుణపాఠం నేర్చుకుని.. మీడియాతో విభేదాలు పెట్టుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేయాలని హర్షవర్ధన్ త్రిపాఠి సూచించారు.