- చిత్రం : అంటే సుందరానికి
- నటీనటులు : నాని, నజ్రియా నజీమ్, నరేష్, రోహిణి, నదియా, పెరుమాళ్, హర్షవర్ధన్, అరుణ భిక్షు.
- నిర్మాత : నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై.
- దర్శకత్వం : వివేక్ ఆత్రేయ
- సంగీతం : వివేక్ సాగర్
- విడుదల తేదీ : జూన్ 10, 2022.
స్టోరీ :
సుందర్ ప్రసాద్ (నాని) ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన వాడు. వారి కుటుంబంలో ఒక్కడే అబ్బాయి. లీలా థామస్ (నజ్రియా నజీమ్) తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలి అని కష్టపడే వ్యక్తి. సుందర్, లీలా చిన్నప్పట్నుంచి స్నేహితులు. వారి నేపథ్యాలు వేరు అయినా సరే సుందర్ కి లీలా అంటే ఇష్టం ఉంటుంది. పెద్దయ్యాక వారిద్దరూ ప్రేమించుకుంటారు. వారి కుటుంబాలని ఒప్పించడానికి వారిద్దరూ ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ఏంటి? సుందర్, లీలా కుటుంబాలకు వారి సంగతి తెలిసిందా? తర్వాత వారు ఏం చేశారు? చివరికి సుందర్, లీలా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? వారు అనుకున్నట్టు చేయగలిగారా? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
గత కొంత కాలం నుండి నాని ఎన్నో రకాల పాత్రలని చేస్తున్నారు. దాంతో నాని కామెడీ పాత్ర చేసి చాలా సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమాలో నాని మళ్లీ కామెడీ ఎక్కువగా ఉన్న పాత్ర చేస్తున్నారు అని మనకు ముందే అర్థమయ్యింది. నానిని ఇలా చూడాలి అని ప్రేక్షకులు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ లో చూపించినట్టుగానే ఒక సింపుల్ స్టోరీ లైన్ మీద నడుస్తుంది. కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఆ సింపుల్ స్టోరీని కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా చూపించారు.
ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా పాత్రలని ప్రేక్షకులకి పరిచయం చేయడంలోనే అయిపోతుంది. అసలు కథ ఉండేది మాత్రం సెకండ్ హాఫ్ లోనే. సినిమాకి పెద్ద హైలైట్ మాత్రం నాని. అసలు నాని కాకుండా ఆ పాత్ర ఇంకెవరైనా చేసుంటే అనే ఆలోచన ఊహించుకోవడం కూడా కష్టమేమో. అంత బాగా చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అయితే నాని నటన చాలా నాచురల్ గా అనిపిస్తుంది. అలాగే నానికి, నాని తండ్రి పాత్ర పోషించిన నరేష్ కి మధ్య వచ్చే సీన్స్ కూడా హైలైట్ గా నిలిచాయి. తెలుగులో మొదటి సినిమా అయినా కూడా నజ్రియా నజీమ్ నానితో సమానంగా చేశారు. డబ్బింగ్ కూడా తనే చెప్పుకోవడంతో నజ్రియా నజీమ్ పాత్ర చాలా దగ్గరగా అనిపిస్తుంది.
అలాగే హీరో తల్లి పాత్ర పోషించిన రోహిణి, హీరోయిన్ తల్లి తండ్రి పాత్ర పోషించిన నదియా, పెరుమాళ్, అలాగే మరొక ముఖ్య పాత్ర అయిన హీరో బామ్మ పాత్ర పోషించిన అరుణ కూడా ఈ పాత్రలో చాలా బాగా నటించారు. వీరందరినీ చూస్తూ ఉంటే వారందరూ నటిస్తున్నట్టు అనిపించదు. మన నిజ జీవితంలో ఎక్కడో చూసే పాత్రలేమో అన్నట్టే అనిపిస్తాయి. కానీ ఫస్ట్ హాఫ్ లో మాత్రం కొంత భాగం వరకు చాలా స్లోగా నడుస్తున్నట్లు అనిపిస్తుంది. పాటలు బాగున్నా కూడా చిత్రీకరించే విధానం ఇంకా కొంచెం బాగుంటే ఆ పాటలు ఇంకా బాగా కనిపించేవేమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- కామెడీ సీన్స్
- చాలావరకు వర్కౌట్ అయిన ఎమోషన్స్
- కథని రాసుకున్న విధానం
- హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ
మైనస్ పాయింట్స్:
- స్లోగా నడిచే ఫస్ట్ హాఫ్
- పాటల పిక్చరైజేషన్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
ఒక మంచి కామెడీ సినిమా చూడాలి అనుకునే వారు అంటే సుందరానికి సినిమా తప్పకుండా చూసేయండి. సినిమా టీజర్, ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉంటుంది అనే ఆసక్తితో వెళ్ళిన వారిని, అలాగే నానిని ఒక కామెడీ రోల్ లో చూడాలి అనుకున్న వారిని సినిమా అస్సలు నిరాశపరచదు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మంచి కామెడీ ఎమోషనల్ డ్రామాగా అంటే సుందరానికి నిలుస్తుంది.