Ads
సైనిక శిక్షణలో భాగంగా హెలికాఫ్టర్ నుంచి కిందకు దూకిన మెరైన్ కమాండో సకాలంలో పారాచ్యూట్ తెరుచుకోకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన నేవీ ప్రెట్టీ ఆఫీసర్ ర్యాంకులో ఉన్న చందక గోవింద్ ప్రమాదంలో మృతిచెందారు. దీంతో గోవింద్ స్వగ్రామం విజయనగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ప్యారాచుట్ తెరుచుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు నేవీ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Video Advertisement
ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ వైరల్ గా మారింది. బుర్ద్వాన్ జిల్లాలోని పనాగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో పారాట్రూపర్స్ ట్రైనింగ్ టీమ్‌లో కమాండో గోవింద్ విధులు నిర్వహిస్తున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. శిక్షణలో భాగంగా ఆయన ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి కిందకి దూకగా..వందల అడుగుల ఎత్తులో ఉండగా ఆయన ప్యారాచ్యూట్ తెరుచుకోలేదు. తీవ్ర గాయాలతో ఉన్న కమాండో గోవింద్‌ను వెంటనే బార్జోరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు నేవీ అధికారులు తెలిపారు. పనాగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఉన్న వ్యూహాత్మక విమానాల్లో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ యూనిట్లు ఇక్కడ శిక్షణలో పాల్గొంటాయి. గోవింద్ నేవీలో 12 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. 2011లో నేవీలో చేరారు. కుటుంబ బాధ్యతల కారణంగా వివాహం చేసుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
గోవింద్ మీద కుటుంబం మొత్తం ఆధారపడి ఉండటంతో పెళ్లికి దూరంగా ఉండిపోయారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఏడాది క్రితమే గోవింద్ తండ్రి మృతి చెందారు. ఇక ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న పెద్ద కుమారుడు కూడా మరణించడం తో గోవింద్ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.
ఇక చందక గోవింద్ పార్థివదేహం ఆయన స్వస్థలం విజయనగరం జిల్లాలోని పర్ల గ్రామానికి స్థానికులు, గ్రామస్థులు సుమారు 20 కి.మీ. దూరం ర్యాలీగా పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. నేవీ, ఆర్మీ అధికారులు వెంట రాగా.. జవాన్ గోవింద్ పార్థివదేహం ఉంచిన వాహనం ముందుకు కదిలింది. అనంతరం గోవింద్ మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ నేవీ ఉన్నతాధికారులు, జిల్లా రిజర్వ్ పోలీసు అధికారులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.
End of Article