Ads
మొన్నటికి మొన్న కరోనా వైరస్ సోకిన పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేస్తున్నారని , డాక్టర్స్ ని ఉన్నపలంగా ఇల్లు ఖాళీ చేయమన్నాడో ఇంటి యజమాని, సిటి నుండి వచ్చారు కాబట్టి కరోనా ఉండొచ్చేమో అనే అనుమానంతో ఇంట్లోకి రానివ్వకుండా రెండేళ్ల పసిపాప ఉన్న దంపతులను రెండు రోజులపాటు ముప్పతిప్పలు పడేలా చేశాడు మరో యజమాని, ఇప్పుడు ఏకంగా తన సొంత ఇంట్లోనే ఉండకుండా అమ్మేసుకుని వెళ్లిపోయేలా ప్రవర్తిస్తున్నారు స్థానికులు ..మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్న సంఘటన వివరాలు..
Video Advertisement
మధ్యప్రదేశ్ లోని శివపురికి చెందిన దీపక్ శర్మ మార్చి నెలలో దుబాయి నుండి ఇండియాకు వచ్చాడు. వచ్చిన వెంటనే టెస్టులు చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి ట్రీట్ మెంట్ తీసుకుని పూర్తిగా నయమైన తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లాడు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత దీపక్ శర్మ కు కొత్త తిప్పలు ఎదురయ్యాయి. అతనికి కరోనా వైరస్ సోకిందని చుట్టుపక్కల వారు తీవ్రంగా అవమానించి మాట్లాడడం మానేశారు. సూటిపోటి మాటలంటూ దూరం పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దీపక్ తాను ఉంటున్న ఇంటిని అమ్మేసి అక్కడి నుండి దూరంగా వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాడు.
మీడియాతో మాట్లాడుతూ “సామాజిక బహిష్కరణను తట్టుకోలేకపోతున్నా. ఇరుగుపొరుగు వారిని నా కుటుంబసభ్యులుగా భావించాం . కష్టకాలంలో తోడు నిలుస్తారనుకున్నా కాని వాళ్లు తోడు నిలవకపోగా, నాకు నా ఇంటికి, నా కుటుంబానికి దగ్గరగా వస్తే కరోనా సోకుతుందని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. మా అమ్మానాన్నలని కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు అని వాపోయాడు..
చుట్టుపక్కల వారు మాట్లాడకపోగా వారింటికి పాలు పోయడానికి ఎవరిని రానివ్వట్లేదు, పాలు పోయడానికి ఎవరొచ్చినా, కూరగాయలు అమ్మేవాళ్లొచ్చినా వారిని వెంబడించి మరీ పంపించేశారు. వీటన్నింటిని చూస్తూ, ఆ మాటలు భరించడం మా వల్ల కాదు. అందుకే ఇంటిని అమ్మేందుకు సిద్దపడ్డాను అంటూ దీపక్ శర్మ కన్నీరు పెట్టుకున్నాడు .
End of Article