Ads
గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఒక పోలీస్ తండ్రి తన పోలీస్ కూతురుకి సెల్యూట్ చేస్తున్నారు. ఈ ఫోటోను చూసిన చాలా మంది ఇన్స్పైరింగ్ గా ఉంది అని అభినందిస్తున్నారు. కానీ ఆ అమ్మాయి ఎవరు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. సాక్షి కథనం ప్రకారం ఆ అమ్మాయి పేరు జెస్సీ ప్రశాంతి. ప్రశాంతి కుటుంబం నెల్లూరు జిల్లా, టీపీ గూడూరు మండలం, పాపిరెడ్డిపాలెం కి చెందిన వారు. ప్రశాంతి తిరుపతిలో పుట్టి పెరిగారు.
Video Advertisement
తండ్రి శ్యామ్ సుందర్ తిరుపతిలో కల్యాణిడ్యామ్ పోలీస్ ట్రైనింగ్ సిఐ గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి సునీత గృహిణి. చెల్లెలు మెర్సీ స్రవంతి కడప డెంటల్ కశాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నారు. తమ్ముడు డానియన్ కుమార్ బీటెక్ పూర్తి చేసి సివిల్స్ కి శిక్షణ పొందుతున్నారు. ప్రశాంతి తాతగారు పేరం వెంకయ్య గారు ఐపీఎస్ అధికారిగా ఉద్యోగం చేశారు. ప్రశాంతి ఎస్వీయూలో ఎంబీఏ లో గోల్డ్ మెడల్ సాధించారు.
ఐఏఎస్, ఐపీఎస్ అయితే ప్రజలకు నేరుగా సేవ చేయగలరు అనే ఉద్దేశంతో ఐఏఎస్ అవుదామని అనుకున్నారు ప్రశాంతి. మొదటి ప్రయత్నంలో విఫలం అయ్యారు. రెండవ ప్రయత్నంలో గ్రూప్స్ లో అర్హత సాధించారు. వేరే శాఖలకు వెళ్లే అవకాశం ఉన్నా కూడా పోలీసు శాఖలో పనిచేసిన తన తండ్రిని, తాతని ఆదర్శంగా తీసుకొని పోలీసు శాఖను ఎంచుకున్నారు ప్రశాంతి.
ప్రశాంతి సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న సమయంలో తోటి స్నేహితులు అందరూ స్థిర పడ్డారు. ప్రశాంతిని కూడా చదువు ఆపేసి పెళ్లి చేసుకోమని బంధువులు ఒత్తిడి చేసేవారట. కానీ ప్రశాంతి తల్లిదండ్రులు తనని తన లక్ష్యం వైపు వెళ్లేందుకు ప్రోత్సహించారు. ప్రశాంతి ప్రస్తుతం గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పీ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం తిరుపతిలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ లో సిఐ అయిన ప్రశాంతి తండ్రి శ్యామ్ సుందర్ గారు, తన పై అధికారి అయిన కూతురు డిఎస్పీ ప్రశాంతికి సెల్యూట్ చేశారు. తన కూతురు ఇంత గొప్ప స్థానంలో ఉండడంపై శ్యామ్ సుందర్ గారు మాట్లాడుతూ “పిల్లలకి వాళ్ళ చదువు విషయంలో నేను పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను.
వాళ్లు ఎంచుకున్న రంగంలో ముందుకు వెళ్లేందుకు ప్రోత్సాహం అందించాను. చదువు ఎంత ముఖ్యమైనదో తెలుసుకున్న పిల్లలు ఉన్నత స్థాయిలో స్థిరపడుతున్నారు. తమ పిల్లల్ని తమ కంటే ఉన్నత స్థాయిలో చూసినప్పుడు ఏ తల్లిదండ్రికైనా సరే చాలా ఆనందంగా ఉంటుంది. నా కూతురికి సెల్యూట్ చేసే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నాను” అని అన్నారు.
End of Article