కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతో జర్మనీలోని హెస్సే రాష్ట్ర ఆర్దికమంత్రి థామస్ షపెర్ ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్ర ఒత్తిడికి లోనైన షపెర్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. రెండు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న ఆయన, దాదాపు పదేళ్లు ఆర్దిక మంత్రిగా పనిచేసిన థామస్ మరణ వార్త అందరిని కలచివేస్తుంది.
పారామెడికల్ సిబ్బంది హొచీమ్ పట్టణంలో హై స్పీడ్ రైల్వే లైన్ పై ఒక డెడ్ బాడీని గుర్తించారు .వెంటనే రైల్వే ట్రాక్ పై పడి ఉన్న డెడ్ బాడీ గురించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత చనిపోయింది థామస్ అని గుర్తించారు.బలవనర్మరణానికి పాల్పడే ముందు థామస్ సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం . థామస్ షపెర్ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు చెందిన క్రిస్టియన్ డెమొక్రాట్స్ (సీడీయూ) పార్టీకి చెందిన నాయకుడు.
ప్రస్తుత స్టేట్ ప్రీమియర్ వోకర్ బౌఫీయర్ కి షపెర్ వారసుడిగా భావించేవారు. ప్రీమియర్ అంటే మన దగ్గర సిఎం పదవి లాంటిది. వచ్చే ఎన్నికల్లో థామస్ ప్రీమియర్ గా ఎన్నికవుతారనే అనుకున్నారందరూ కాని ఇంతలో థామస్ ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్ కి గురయ్యారు. జర్మనీ ఆర్థిక రాజధాని ఫ్రాంక్ ఫర్ట్ నగరం కూడా హెస్సే రాష్ట్ర పరిధిలోనే ఉంది. కోవిడ్ మహమ్మారి కారణంగా షఫెర్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని బౌఫీయర్ తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో తరచుగా ప్రజల మద్య కనిపించిన షపెర్ సంక్షోభసమయంలో ఆర్ధిక సాయం ఎలా ఉండబోతుంది అనే సమాచారం కూడాప్రజలకు ఇచ్చారు. ఆర్థిక సాయం పట్ల ప్రజలకు ఉన్న అంచనాలను అందుకోవడం ఎలా అనే ఆందోళనతో, తీవ్ర మనస్తాపానికి గురైన థామస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం.
ఇప్పటివరకు జర్మనీలో 58 వేల మందికిపైగా కోవిడ్ బారిన పడగా 455 మంది ప్రాణాలు కోల్పోయారు . కరోనా వైరస్ వ్యాప్తి నేపద్యంలో ప్రపంచదేశాలన్ని తీవ్రంగా భయపడుతున్నాయి. అన్ని దేశాలు లాక్ డౌన్ ఏర్పరచుకున్నాయి. ప్రపంచదేశాలన్ని ఆర్దికంగా తీవ్ర నష్టాన్ని చవిచూడనున్నాయి. ఈ సంధర్బంలో షపెర్ మరణం అందరిని భయాందోళనలకు గురిచేస్తోంది.