కరోనా కారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయట వస్తువులని డైరెక్ట్ గా తాకడం అంత మంచిది కాదు. అందుకే శానిటైజర్ వాడుతున్నాం. సరే వస్తువుల వరకు అంటే పర్లేదు. కానీ  చాలామంది పండ్లు, కూరగాయలు లాంటి తినే పదార్థాల ని కూడా శానిటైజర్ తో తుడవడం, లేదా వాటిపై శానిటైజర్ స్ప్రే చేయడం చేస్తున్నారు.

Video Advertisement

కొంతమందేమో సబ్బు నీటిలో లేదా డిటర్జెంట్ కలిపిన నీటిలో పండ్లను కూరగాయలను కడుగుతున్నారు. ఇలా శుభ్రం చేయడం చాలా ప్రమాదకరం అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వీటిలో ఆల్కహాల్ ఇంకా రసాయనాలు ఉంటాయి.

ఈ కెమికల్స్ వల్ల కూరగాయల్లో ఉండే పోషకాలు నశిస్తాయి అంతేకాకుండా రసాయనాల యొక్క అవశేషాలు కూరగాయల పై జిడ్డు లాగా అంటుకుపోతాయి. ఆ జిడ్డు ఎంత కడిగినా పోదు. అలాంటి ఆహార పదార్థాలను మనం తింటే జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఇలాంటి సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు గా కూడా మారుతాయట.

మరి ఇప్పుడు పండ్లు, కూరగాయల సంగతేమిటి? వాటిని ఎలా శుభ్రపరచుకోవాలి? ఇప్పుడు ఉన్న ప్రమాదకరమైన సమయంలో మామూలు నీళ్లతో కడిగితే అయితే సరిపోదు కదా? ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం మామూలే. అందుకే ఇంట్లోనే కూరగాయల ని కడగడానికి ఇప్పుడు చెప్పబోయే పద్ధతుల్లో మీకు నచ్చిన ఇంకా సౌకర్యవంతంగా ఉండే పద్ధతిని పాటించండి.

#1 ఒక బకెట్ లో నీళ్లు తీసుకోండి. అందులో గళ్ళ ఉప్పు కలపండి. ఆ నీళ్లలో కూరగాయలు వేసి అరగంట పాటు అలాగే వదిలేయండి. తర్వాత ఆ కూరగాయలను తీసి మళ్లీ మామూలు నీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రపరచండి. అలా చేస్తే కూరగాయల మీద ఉన్న బ్యాక్టీరియా పోతుంది.

#2 పది వంతుల నీళ్లలో ఒక వంతు మోతాదులో ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి. ఆ నీళ్లలో కూరగాయల ని కొద్దిసేపు పెట్టి తర్వాత మామూలు నీళ్ళతో శుభ్రంగా కడిగేసేయ్యండి. అప్పుడు కూరగాయల మీద ఉన్న పెస్టిసైడ్స్ పోతాయి.

#3 హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా కూరలని శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. మరీ ఎక్కువ మొత్తంలో కాకుండా కొంచెం హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపిన లిక్విడ్ మార్కెట్లో దొరుకుతుంది. అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ మోతాదు మూడు శాతం మాత్రమే ఉంటుంది. మనం ఉపయోగించేది ఇంటి పనులకే కాబట్టి అంత మోతాదు సరిపోతుంది.

ఆ లిక్విడ్ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని నాలుగు లీటర్ల నీటిలో కలపండి పదినిమిషాల పాటు కూరగాయలను అందులో ఉంచి తర్వాత తీసి మామూలు నీటితో కడిగేసి ఫ్రిజ్ లో భద్రపరచండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. అవి కూరగాయలు శుభ్రపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

#4 ఒక బకెట్ లో వేడి నీళ్ళు తీసుకొని అందులో ఉప్పు పసుపు వెనిగర్ కలపండి ఆ నీళ్లల్లో కూరగాయలు వేసి నానబెట్టి తర్వాత మళ్ళీ మామూలు నీళ్లతో కడిగేయండి. కావాలంటే అదనంగా కొంచెం నిమ్మరసం కూడా కలపొచ్చు.

#5 మూడు వంతుల నీటిలో ఒక వంతు వెనిగర్ కలిపి మీరు బయటనుండి తెచ్చిన కూరగాయలను లేదా పండ్లను పది నిమిషాల పాటు ఆ నీళ్లలో పెట్టండి. తర్వాత మామూలు నీటితో కడిగేయండి. వెనిగర్ లో సహజసిద్ధంగా శానిటైజ్ చేసే గుణాలు ఉంటాయి. అందుకే వంట లోనే కాకుండా ఏవైనా శుభ్రపరచడానికి కూడా వెనిగర్ ని వాడతారు.

#6 వెనిగర్ తో పాటు బేకింగ్ పౌడర్ కూడా సమపాళ్ళలో తీసుకుని నీళ్లలో కలిపి కూరలను శుభ్రం చేసి అరగంట తర్వాత కడిగేస్తే బ్యాక్టీరియా సులభంగా పోయే అవకాశాలు ఉంటాయి.

#7 ఇవన్నీ మామూలు కూరగాయలకు మాత్రమే. ఒకవేళ దుంపకూరలు అయితే స్క్రబ్బర్ తో ఒకసారి రుద్ది తర్వాత చల్లటి నీళ్లలో రెండు మూడు నిమిషాలు నానబెట్టండి. ఒకవేళ ఆకుకూరలు అయితే ముందు ఒకసారి మామూలుగా కడిగేసితరువాత ఒక పెద్ద గిన్నెలో చల్లటి నీళ్లు తీసుకోండి. అందులో కొంచెం ఉప్పు వేసి ఆకుకూరల్ని కొంచెం సేపు ఆ నీళ్లల్లో ఉంచండి.

తర్వాత మళ్లీ మామూలు నీళ్ళతో కడిగేసి ఆరబెట్టండి. ఆకుకూరలు పూర్తిగా ఆరిన తర్వాత జాగ్రత్తగా కవర్ లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టండి. అలా అయితే ఆకుకూరలు తొందరగా వడిలి పోవడం, పాడైపోవడం అవ్వదు.

ఇలా మీకు ఏది సులభంగా ఉంటే ఆ పద్ధతిని ఎంచుకుని కూరగాయలను, పండ్లను శుభ్రపరుచుకోండి.