Ads
ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల సమయానికి ఇంటికి రాకపోతే తల్లిదండ్రుల్లో క్షణక్షణం టెన్షన్ పెరిగిపోతుంది. టైం కి ఇంటికి చేరుకోవడానికి అన్ని రూట్లలో బస్సు సౌకర్యం ఉండదు. అలాగని క్యాబ్ బుక్ చేసుకుందాం అంటే.. అంత బడ్జెట్ ఉండదు.
Video Advertisement
చివరకు బైక్ బుక్ చేసుకొని ఎలాగోలా ఇల్లు చేరుదాం అంటే.. ఎంతవరకు సురక్షితం? మహిళలు ధైర్యంగా బుక్ చేసుకొని వెళ్లగలరా?.. ఇలా ఎన్నో సందేహాలు. వాటికి పరిష్కారం చూపుతున్నారు హైదరాబాదీ అక్కాచెల్లెళ్లు!
సమస్య 1
అనిత హయత్ నగర్‌లో ఉంటుంది. ఉద్యోగం ఏమో జూబ్లీహిల్స్ లో. ఆఫీస్ నుంచి బయటికి చేరేసరికి సాయంత్రం ఏడు దాటుతుంది. అదేమో బస్ రూట్ కాదు. పోనీ ఆ దారిలో వెళ్లే కొలీగ్స్‌తో కలిసి వెళ్దామా అనుకుంటుంది కానీ, ఆ సమయానికి వాళ్ల పని పూర్తికాదు. దీంతో, ఓసారి క్యాబ్ కోసం సెర్చ్ చేసింది. అది చూయించే మొత్తం చెల్లించలేక వెంటనే క్యాన్సిల్ చేసింది. చివరిగా బైక్ ట్యాక్సీనే ఎంచుకుంది. ధర తక్కువే కానీ, మగ చోదకుడు. ఇబ్బంది పడుతూనే గమ్యానికి చేరుకుంది.
సమస్య-2
కవిత కృష్ణానగర్ లోని హాస్టల్‌లో ఉంటుంది. బేగంపేటలోని ఓ షోరూమ్‌లో పనిచేస్తుంది. మరీ దూరం కాదు కాబట్టి బస్సులో వెళ్లొచ్చు. అవసరాన్ని బట్టి బైక్ ట్యాక్సీ బుక్ చేసుకునేది. ఓసారి, కెప్టెన్ దురుసుగా ప్రవర్తించాడు. అప్పటి నుంచీ బైక్ జోలికే వెళ్ళలేదు కవిత. అనిత, కవిత.. ఇద్దరి వృత్తులూ వేరు. కానీ అవసరం ఒకటే. వెంటనే సురక్షితమైన, విశ్వసనీయమైన రవాణా సౌకర్యం కావాలి. హైదరాబాద్‌లో ఇలాంటివాళ్లు చాలామంది ఉన్నారు.
అందుకే టోలీచౌకీకి చెందిన ఇద్దరు యువతులు తమ స్నేహితులతో కలిసి ఓ పరిష్కారాన్ని కనిపెట్టారు. కేవలం మహిళా రైడర్ల కోసమే బైక్‌ట్యాక్సీ సేవలను ప్రారంభించారు. అదే “డవ్‌లీ”.. మహిళల కోసం మహిళలే స్థాపించిన స్టార్టప్ ఇది. ఇందులో బైక్‌లను నడిపేది కూడా మహిళా కెప్టెన్లే. డవ్‌లీ వ్యవస్థాపకులు.. జైనబ్ ఖాటూన్, ఉజ్మా ఖాటూన్ అనే అక్కాచెల్లెళ్ళు. వీరికి ఫాతిమా, ఉబేదుల్లా అనే మిత్రులు తోడయ్యారు.
జైనబ్ ఫార్మసీ విద్యార్థి. ఉజ్మా బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నది. ‘యాప్స్ వచ్చాక ప్రయాణం సులభతరమైనా, మహిళలకు రక్షణ ఉండటం లేదు. గతంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కాదు’ అంటూ ఓ సందర్భంలో తల్లి బాధపడిపోయిన సంఘటన ఆ ఇద్దరిలో కొత్త ఆలోచన రేకెత్తించింది. నిజానికి, జైనబ్ మిత్ర బృందానికి కూడా అలాంటి చేదు అనుభవాలు ఉన్నాయి.
వెంచర్ క్యాపిటలిస్టుల సహకారంతో ఈ వ్యాపారాన్ని విస్తరించాలన్నది ఆ తోబుట్టువుల ఆలోచన. క్రమంగా త్రీ వీలర్, ఫోర్ వీలర్ సేవలనూ అందించాలని అనుకుంటున్నారు. ‘ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య 7893128773 నంబర్‌కు వాట్సాప్ ద్వారా లేదా www.dovely.org ద్వారా బైక్ ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు. మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన.. ఈ రెండూ మా లక్ష్యాలు’ అని చెబుతారు డవ్‌లీ బృందంలోని నలుగురూ.
డవ్‌లీ పేరు వెనుక కథ
కంపెనీ పేరు నిర్ణయించే ముందు చాలా ఆలోచించారు. చివరికి ‘డవ్‌లీ’గా ఖరారు చేశారు. డవ్.. అంటే పావురం. ప్రస్తుతం ఇరవైమంది దాకా మహిళా కెప్టెన్లు పేరు నమోదు చేసుకున్నారు. నాలుగు వందల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. నిపుణుల సహ కారంతో పూర్తిస్థాయి యాప్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాలూ చేస్తున్నారు.
End of Article