ఆ కలెక్టరమ్మ పేరునే ఊరికి పేరుగా పెట్టుకున్నారు అక్కడి ప్రజలు…ఎందుకో తెలుసా.?

ఆ కలెక్టరమ్మ పేరునే ఊరికి పేరుగా పెట్టుకున్నారు అక్కడి ప్రజలు…ఎందుకో తెలుసా.?

by Mohana Priya

Ads

ఏం వ్యక్తపరచడానికైనా భాష ముఖ్యం అని ఆమె కి అర్థమైంది. మూడు నెలలు వ్యవధిలో పట్టు వదలకుండా ప్రయత్నించి గొండి భాషలో ప్రావీణ్యం సంపాదించింది. అక్కడి జనాల తో మాట్లాడ గలిగింది. వారి సమస్యలు తెలుసుకోగలిగింది. తన కష్టం ఫలించింది. అక్కడి ప్రజలకి వారు చెప్పేది విని అర్థం చేసుకునే ఎవరో ఒక మనిషి కావాలి. ఆవిడ ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగింది.

Video Advertisement

ప్రత్యేక గిరిజన కోఆర్డినేటర్ లను, ప్రభుత్వ ఆసుపత్రులలో భాషా అనువాదకులను నియమించడం నుండి, పరిపాలనా కార్యాలయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడం, భాషను స్వయంగా నేర్చుకోవడం వరకు, దివ్య దేవరాజన్ ఆ ఊరి ప్రజల కి చేరువయ్యి వారి కష్టాన్ని తెలుసుకోవడం వరకు వెళ్లడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. దాంతో దివ్య “ఆఫీసర్ మేడమ్” అనే హోదా నుండి వారి కుటుంబంలో ఒకరి లాగా కలిసిపోయారు.

ఇటీవల ఆదిలాబాద్ వాసులు దివ్య చేసిన పనులకి కృతజ్ఞతతో తమ జిల్లాలోని ఒక ఊరికి దివ్య గూడ అని పేరు పెట్టారు. దివ్య తో పని చేసిన బృందం ఆమె సమస్యలన్నిటిని చాలా తొందరగా పరిష్కరించగలుతుంది అని, ఆ ప్రాంతంలోని నిరక్షరాస్యత నిరుద్యోగం పారిశుద్ధ్య నీటిపారుదల అనారోగ్య సమస్యలు మరియు వరదలు ఇలాంటి ఎన్నో సమస్యలను అధిగమించడానికి ఎంతో కృషి చేసింది అని చెప్పారు.

కర్ఫ్యూల నుండి, ఇంటర్నెట్ కనెక్టివిటీ ని మూసి వేయడం వరకు ఇలాంటి ఇబ్బందులు ఎన్నిటినో అదిలాబాద్ లోని ఈ ప్రాంతం చూసింది. అలాంటి పరిస్థితులలో దివ్య ఆ ఊరి ప్రజలందరితో మాట్లాడి, వారి సమస్యలు పరిష్కరించి వారి నమ్మకాన్ని పొందింది.

ఆ గ్రామానికి దివ్య గూడ అనే పేరు పెట్టడంలో ముఖ్య పాత్ర పోషించిన తోతి వర్గానికి చెందిన గిరిజన నాయకుడు మారుతి మాట్లాడుతూ ” మా గ్రామానికి ఇప్పటి వరకు ఎంతో మంది కలెక్టర్లు వచ్చారు. కానీ నేను కలెక్టర్ ఆఫీస్ లో అడుగు పెట్టింది మాత్రం దివ్య మేడం వచ్చిన తర్వాతే.

అప్పటి వరకూ ఎవరూ ప్రజలను సరిగా పట్టించుకోలేదు. దివ్య మేడం మాకు కలెక్టర్ కార్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇంటింటికి వెళ్లి అందరిని పరిచయం చేసుకుంది. ఇప్పుడు ఆమెకి మా గ్రామ ప్రజలు అందరం పేర్లతో సహా తెలుసు” అని అన్నారు.

మారుతి నివసించే చోటు వరదల నీళ్లు ఎక్కువగా వచ్చే ప్రాంతం. దివ్య వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని బాగుచేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు.” మేము గిరిజనులం. దివ్య మేడం మాకు చేసిన ఈ సహాయాన్ని మా తరమే కాకుండా వచ్చే తరాలు కూడా గుర్తు పెట్టుకోవాలి అనుకున్నాం. పెద్ద బహుమతి ఇద్దామంటే అంత గొప్ప పనికి ఏ బహుమతి ఇవ్వాలో అర్థం కాలేదు. అందుకే మా ఊరికి ఆమె పేరు పెట్టాం” అని మారుతి చెప్పారు.

ఆ ఊరికి వచ్చిన ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు గొండి భాషను నేర్చుకోవడానికి ప్రయత్నించారు. కానీ మొదట్లోనే ఆపేశారు. దివ్య మాత్రం భాష మొత్తం నేర్చుకున్నారు. దీనిపై దివ్య మాట్లాడుతూ ” వారిని ఏదో పలకరించడమే కాకుండా వారితో అన్ని విషయాలు మాట్లాడి పూర్తిగా తెలుసుకోవాలి అని నాకు అనిపించింది.

నన్ను ఈ ఊరికి ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించమని అపాయింట్ చేశారు. ఏదో హడావిడిగా నాకు అనిపించింది చేసేసి వెళ్లిపోవడం కరెక్ట్ అనిపించలేదు. సమస్యను వారి కోణం నుండి విని పరిష్కరిస్తేనే ఆ పరిష్కారానికి ఒక అర్థం ఉంటుంది అనిపించింది. వారి నమ్మకాన్ని గెలుచుకోవడం అంత సులభంగా అయిన పని కాదు. వారి హక్కుల్ని తీసుకోవడానికి వచ్చాం ఏమో అని వాళ్ళు అనుకున్నారు.

కానీ మా టీం ప్రశాంతంగా ఆలోచించి వారికి వారి సమస్యలు మాతో పంచుకునే అంత స్వేచ్ఛ ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేశాం. తర్వాత వాళ్లు కూడా మమ్మల్ని వాళ్ళింట్లో మనుషుల్లానే అనుకున్నారు” అని చెప్పారు. కమ్యూనికేషన్ అనేది ముఖ్యంగా ఉండాల్సిన చోటు హాస్పిటల్.

కాబట్టి దివ్య హాస్పిటల్ లో గొండి భాష ట్రాన్స్లేటర్లను నియమించారు. దాంతో పేషెంట్లకి తమ సమస్యలను డాక్టర్లతో సులభంగా చెప్పే వీలుంటుంది.ఇంకా ఏదైనా పెద్ద ఆపరేషన్ లాంటివి చేయించాల్సి ఉంటే వెంటనే హైదరాబాద్ కి తీసుకెళ్లడానికి అంబులెన్సులను కూడా ఏర్పాటు చేశారు.

దివ్య ప్రాథమిక బాధ్యత ఏంటంటే ఆ ఊరి వాళ్లకు తమ హక్కులను తెలుసుకొనేలా చేయడం. అందుకోసం పెసా (ది ప్రొవిజన్స్ ఆఫ్ పంచాయత్ (ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్, 1996) లో గ్రామ కోఆర్డినేటర్ లను నియమించారు. వాళ్ళ ఊర్లో ఎప్పటినుండో ఉన్న రాయి సెంటర్లను కూడా ఇందులో భాగస్వాములను చేశారు. గ్రామ అభివృద్ధి పనుల్లో పాలు పంచుకోవడానికి రాయి సెంటర్ కార్యకర్తలను దివ్య నియమించారు.

దివ్య ఐఏఎస్ అవ్వాలి అని నిర్ణయం తీసుకోవడానికి స్ఫూర్తి తన తండ్రి, ఇంకా తన తాత. ఈ విషయంపై దివ్య మాట్లాడుతూ ” మా నాన్న తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డ్ లో పని చేసేవారు. ఆయన వేరే వాళ్లకు సహాయం చేయడంలో ఎంత ఆనందంగా ఉంటుందో చెబుతుండేవారు. ఒకసారి రైతులకు విద్యుత్ సరఫరా అందేలా చేసినప్పుడు వారు ఎంతో ఆనంద పడ్డారు అని దాని వల్ల తనకు ఎంతో ఆనందంగా అనిపించింది అని చెప్పారు.

అప్పుడే నేను కూడా ప్రజలకు ఏమైనా చేయాలి అని నిర్ణయించుకున్నాను. నేను లోన్ సిస్టం ఎలా పని చేస్తుందో చూశాను. దాని వల్ల రైతులకు ఎంత నష్టం వాటిల్లుతుందో కూడా చూశాను. అధికారులు ఆ లోన్ డబ్బులు వసూలు చేసుకోవడానికి వస్తున్నారని తెలిసి భయంతో మా తాత గుడి లోకి వెళ్లి దాక్కునే వాళ్ళు.

ఈ ఘటన ప్రభుత్వం తలుచుకుంటే రైతుల సమస్యలు విని వారిని ఆ కష్టం నుంచి గట్టెక్కించడానికి ఎంతో మద్దతు ఇవ్వగలదు అని ఆలోచించటానికి నన్ను ప్రేరేపించింది. ఒక రకంగా నేను ఐఏఎస్ వృత్తిని ఎంచుకోవడానికి ఈ ఘటన కూడా కారణమే” అని చెప్పారు.

ప్రస్తుతం ఉమెన్, చిల్డ్రన్ , డిసేబుల్డ్, సీనియర్ సిటిజన్లకు సెక్రటరీ అండ్ కమిషనర్ గా నియమితురాలైన దివ్య ఆ ప్రాంతానికి తన పేరు పెట్టడంపై మాట్లాడుతూ ” నేను అక్కడ ఉండి ఉంటే కచ్చితంగా వాళ్ళని ఆ పని చేయనిచ్చేదాన్ని కాదు. ఇప్పుడు నా స్నేహితులు కొంతమంది నాకు ఫోన్ చేసి తమ పేర్లను ఏదైనా గ్రామానికి పెట్టమని సరదాగా అడుగుతూ ఉంటారు” అని నవ్వారు దివ్య.

 


End of Article

You may also like