Ads
డొక్కా సీతమ్మ. ఈ పేరు మీలో కొంతమందికైనా తెలిసే ఉంటుంది. గత సంవత్సరం నవంబర్ 15వ తేదీన భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన తరపున డొక్కా సీతమ్మ పేరిట శిబిరాలు ఏర్పాటు చేశారు.
Video Advertisement
అలా డొక్కా సీతమ్మ పేరు మనలో చాలామందికి తెలిసింది. డొక్కా సీతమ్మ ను ఆంధ్రుల అన్నపూర్ణ అని కూడా అంటారు. మండపేటలో నివసించే అనుపిండి భవానీశంకరం, నరసమ్మ దంపతులకు 1841 లో సీతమ్మ జన్మించారు.
తన చిన్నతనంలోనే డొక్కా సీతమ్మ తన తల్లిని కోల్పోయారు. డొక్కా జోగన్న అనే ఒక ధనిక రైతు డొక్కా సీతమ్మ ని పెళ్లి చేసుకున్నారు. కాలంతో పాటు డొక్కా సీతమ్మ యొక్క సేవా గుణం కూడా పెరుగుతూ వచ్చింది. అప్పట్లో గోదావరి దాటాలి అంటే పడవ ప్రయాణం మాత్రమే ఉండేది.
జోగన్న, సీతమ్మ నివసించే ఊరు లంకగన్నవరం గోదావరి మధ్య మార్గంలో ఉంటుంది. అందుకే గోదావరి దాటడానికి వచ్చినవాళ్లు ఎక్కువగా లంకగన్నవరం లో విశ్రాంతి తీసుకునేవారు. వారికి జోగన్న, సీతమ్మ భోజన ఏర్పాట్లు చేస్తూ ఉండేవారు. ఏ వేళలో ఎవరు వచ్చి అడిగినా కూడా భోజనం పెట్టేవారు. అదే తర్వాత నిత్యకృత్యం గా మారింది.
తర్వాత కొంత కాలానికి జోగన్న కాలం చేశారు. డొక్కా సీతమ్మ తన చివరి దశలో ఉన్నప్పుడు తన ఆస్తులన్నీ ఇచ్చేసి, హిందూ ధర్మాలకు అనుగుణంగా చనిపోవడానికి ఒక ఎద్దుల బండిని ఏర్పాటు చేసుకుని, ఎద్దుల బండి కి ఒక డ్రైవర్ ని కూడా నియమించి వారణాసికి బయలుదేరారు.
కానీ మధ్యలో ఒక కుటుంబం ఆకలితో ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి ప్రయాణం నుండి వెనుదిరిగి ఆ కుటుంబానికి భోజనం వండి పెట్టారు డొక్కా సీతమ్మ. డొక్కా సీతమ్మ అన్నదానం చేయడం మాత్రమే కాకుండా ఎన్నో పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలకు విరాళాలు కూడా ఇచ్చారు.
ఎంత ఇచ్చినా కూడా ఎవరి వద్ద చందాలు కానీ, విరాళాలు కానీ తిరిగి తీసుకోలేదు. దాంతో తదనంతరం ఆస్తులు ఎక్కువగా మిగలలేదు. బ్రిటిష్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ దానగుణాన్ని గుర్తించి ఏడవ రాజు ఎడ్వర్డ్ ఆమెను తన వార్షికోత్సవ వేడుకలకు ఆహ్వానించారు.
డొక్కా సీతమ్మని మర్యాదపూర్వకంగా ఢిల్లీకి తీసుకు రావాలి అని మద్రాస్ యొక్క ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. కానీ సీతమ్మ మాత్రం ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఆమె తన సేవలను ప్రచారం కోసం చెయ్యట్లేదు అని చెప్పారు.
దాంతో కింగ్ ఎడ్వర్డ్ డొక్కా సీతమ్మ ఫోటో ని ఒక సోఫా లో పెట్టి ఆవిడకి నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నారు. 1909లో డొక్కా సీతమ్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. కాకినాడ లోని వివేకానంద ఉద్యానవనంలో డొక్కా సీతమ్మ విగ్రహం కూడా ఉంటుంది.
also watch:
End of Article