Ads
నాగ చైతన్య హీరోగా పరిచయమైన సినిమా జోష్. ఈ సినిమాకి వాసు వర్మ దర్శకత్వం వహించగా, దిల్ రాజు గారు నిర్మించారు. ఇదే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు కార్తీక. సీనియర్ నటి రాధ గారి పెద్ద కూతురు కార్తీక. యూత్ అలాగే ఎడ్యుకేషన్ సిస్టం మీద రూపొందిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా కూడా నాగ చైతన్య, కార్తీకకి పేరు తీసుకొచ్చింది.
Video Advertisement
ఆ తర్వాత కార్తీక తమిళ్ సినిమా కో లో నటించారు. ఇది కార్తీక తమిళ్ లో మొదటి సినిమా. ఇదే సినిమా తెలుగులో రంగం పేరుతో డబ్ అయ్యి తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత తన మొదటి మలయాళ సినిమా అయిన మకరమంజు లో నటించారు కార్తిక. 2012 లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము సినిమాలో త్రిషతో పాటు మరొక హీరోయిన్ గా నటించారు.
ఆ తర్వాత కమ్మత్ అండ్ కమ్మత్ అనే మలయాళం సినిమాలో, అన్నకోడి అనే తమిళ సినిమాలో నటించారు. తర్వాత 2013లో బృందావన అనే కన్నడ సినిమాలో నటించారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బృందావనం సినిమాకి రీమేక్. ఆ తర్వాత బ్రదర్ అఫ్ బొమ్మాలి తో పాటు రెండు తమిళ సినిమాల్లో నటించారు. 2017 లో ఆరంభ్ అనే హిందీ సీరియల్ లో కూడా నటించారు.
అయితే కార్తీక చివరిగా నటించిన తెలుగు సినిమా 2014 లో విడుదలైన బ్రదర్ అఫ్ బొమ్మాలి. ఆ తర్వాత మరే తెలుగు సినిమాలోనూ నటించలేదు. కార్తీక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో బిజినెస్ లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. అంతే కాకుండా యు.ఎస్.లో ఎంబీఏ కూడా చేశారు.
కార్తీక ప్రస్తుతం కేరళలోని యుడిఎస్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ హోటల్ బిజినెస్ లో కార్తీక తండ్రి రాజశేఖరన్ నాయర్, తల్లి ఉదయ చంద్రిక నాయర్ (రాధ గారి మరొక పేరు) కూడా ఉన్నారు. రాజశేఖరన్ నాయర్ చైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ అవ్వగా, రాధ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి కార్తీక మళ్లీ సినిమాల్లో నటిస్తారా? లేదా? అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.
End of Article