అమెరికాలో రోడ్డు యాక్సిడెంట్ లో తెలుగు యువతి మరణించడం పై అమెరికా పోలీసు ఆఫీసర్ చులకనగా మాట్లాడిన విషయం భారత్ లో కలకలం రేపుతోంది. TV9 తెలుగు కథనం ప్రకారం, యువతి చనిపోయిన తరువాత ఆ పోలీసు ఆఫీసర్ నవ్వుతూ, ఆమెను చులకన చేస్తూ, జోకులు వేసినవి వారి బాడీ కెమెరాలో రికార్డు అవ్వడం, ఆ వీడియో క్లిప్ లు వైరల్ కావడంతో యూఎస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
ఈ ఘటన పై దేశవ్యాప్తంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఆ తెలుగు యువతి ఎవరు? ఎలా చనిపోయింది? ఇంతకు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాల గురించి నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇరవై మూడేళ్ళ కందుల జాహ్నవి అమెరికాలో నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువుకుంటోంది. ఆమె కర్నూలు జిల్లాలోని ఆదోనికి చెందిన యువతి. ఆమె నందిగామలో ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ లో ఇంజినీరింగ్ చదివింది. ఆ తర్వాత ఆమెకు అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ లో సీటు రావడంతో 2021లో మాస్టర్స్ లో చేరింది.
జాహ్నవి తల్లి స్కూల్ టీచర్, వాళ్ల ఫ్యామిలీకి అప్పుల భారం పెరగడంతో చదువు పూర్తి అయిన తరువాత జాబ్ లో జాయిన్ అయ్యి, జాహ్నవి అప్పులు తీర్చాలనుకుంది. కానీ రోడ్డు ప్రమాదంలో జాహ్నవి కన్నుమూసింది. ఆమె రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ కారు ఢీకొట్టడంతో జాహ్నవి అక్కడికక్కడే మరణించింది.
ఆ ఘటన పై దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీసు ఆఫీసర్ డానియెల్ అడరర్, వివరాలు చెప్తూ జాహ్నవి గురించి చులకనగా మాట్లాడారు. గట్టిగా నవ్వుతూ 11 వేల డాలర్ల చెక్ ఇస్తే సరిపోతుంది అని హేళనగా మాట్లాడారు. ఈ పోలీసులు మాట్లాడిన మాటలు బయటికి వచ్చాయి. దాంతో ఈ ఇన్సిడెంట్ పై భారత్ సీరియస్ అయ్యింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ ఈ ఘటన పై తీవ్రంగా స్పందిస్తూ, ఆగ్రహం వ్యక్తం చేసింది.