Ads
ఆరాటం ముందు ఆటంకం ఎంత..సంకల్పం ముందు వైకల్యం ఎంత.. ద్రుడచిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత అని ఒక సినిమా పాట ఉంటుంది.. ఆ పాటలోని ప్రతి అక్షరం అతడి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.. పేదరికంగ, వైకల్యం ఇవేవి అతడి సంకల్పానికి అడ్డుకట్ట వేయలేకపోయాయి.. అనుకున్నది సాధించి రియల్ విన్నర్ అనిపించుకున్నాడు, ఎందరికో ఆ రోల్ మోడల్ అయ్యాడు… అతడే కట్టా సింహాచలం, అసిస్టెంట్ కలెక్టర్..
Video Advertisement
తూర్పు గోదావరి జిల్లా, మలికి పురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన సింహాచలం కలెక్టర్ అయ్యాడు.. ఇందులో గొప్ప విషయం ఏముంది..ప్రతి ఏడాది చాలా మంది సివిల్స్ కొడతారు కదా అనుకుంటున్నారా.. కాని సింహాచలం గెలుపు గురించి మనం మాట్లాడుకోవాలి ..ఎందుకంటే పుట్టుకతో అంధుడు, పేదరికం ఇలా ఎన్నో కష్టాలని అధిగమించి ప్రస్తుతం అతడు ఈ విజయాన్ని దక్కించుకున్నాడు.
సింహాచలం తల్లిదండ్రులు కట్టా వాలి, వెంకట నర్సమ్మలకు ఐదుగురు సంతానం, వారిలో సింహాచలం నాలుగవ వాడు, పుట్టుకతో అంధుడు..తండ్రి పాత గోని సంచుల వ్యాపారం చేసేవాడు, అదే ఆ కుటుంబానికి జీవానాధారం..పిల్లల్ని చదివించే స్తోమత లేని తండ్రి, చదువుకోవాలనుకునే కోరిక బలంగా ఉండి ఏం చేయాలో పాలుపోని సింహాచలానికి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని బ్రెయిలీ స్కూల్ చదువుకునే అవకాశం దక్కింది.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సింహాచలం అక్కడ నుండి మలికిపురం ఎంవీఎన్ జేఎస్ అండ్ ఆర్వీఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు.. సింహాచలం చదువు పూర్తి కావడానికి కొందరు దాతలు తమ చేయందించారు.
డిగ్రీ చదువుతున్న టైంలోనే ఐఏఎస్ కావాలని కలలు కన్నాడు.కానీ అదే సమయంలోనే తండ్రి పోవడంతో , ఇక కుటుంబానికి భారం కాకూడదనుకుని బిఇడి పూర్తి చేసి, తిరుపతి కేంద్రీయ విద్యాలయంలో టీచర్ గా చేరారు. ఉద్యోగంలో జాయిన్ అయినప్పటికి కలెక్టర్ అవ్వాలనే కోరిక సింహాచలం మనసులో నుండి పోలేదు..దాంతో 2014 సంవత్సరంలో సివిల్ సర్వీస్ పరీక్షలు రాశారు. 1212 ర్యాంకు సాధించారు. కలెక్టర్ అయ్యే అవకాశం కొద్దిలో మిస్ అయింది. అయినా నిరాశ పడకుండా మళ్లీ ప్రయత్నించాడు.
2016లో పరీక్ష రాస్తే ఐఆర్ఎస్ లో అవకాశం వచ్చింది. ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఢిల్లీ, హైదరాబాద్‌లలో పని చేస్తూనే తన ఆశయం అయిన ఐఏఎస్‌కు ప్రిపేర్ అయ్యాడు.మొత్తానికి 2019 ఐఏఎస్ ఫలితాల్లో ర్యాంకు సాధించాడు. ప్రసుతం సింహాచలం ముస్సోరిలో ట్రై నీ కలెక్టర్‌గా శిక్షణ పూర్తైంది..అసిస్టెంట్ కలెక్టర్ గా ఆంధ్రా కేడర్ కి ఎంపిక అయ్యాడు. కాబట్టి కలలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని కలాం గారు చెప్పారు, సింహాచలం నిరూపించారు..హ్యాట్సాఫ్..
సివిల్స్ కి ప్రిపేరవుతున్నాం అనగానే చాలా మంది ఒకసారి మనల్ని కింది నుండి పై వరకు చూసి ఒక వెకిలి నవ్వు పడేస్తారు. సింహాచలం కథ ద్వారా మనకి అర్దం కావాల్సింది.. మన మీద మనకి నమ్మకం ఉండాలని.. మనం పెట్టుకున్న గోల్ చూసి చాలామందికి నవ్వు రావొచ్చు, నమ్మకం లేకపోవచ్చు..కాని ఆ నవ్వుల్ని చూసి అక్కడే ఆగిపోతే మరింత నవ్వుల పాలవుతాం.. నవ్విన వాళ్లతోనే శెభాష్ అనిపించుకునే శక్తి మనకే ఉంది..కమాన్..
End of Article