Ads
ఒకవైపు కరోనా.. మరోవైపు ఆకలి..చేయడానికి పనులు లేవు, చేతిలో చిల్లిగవ్వ లేదు.. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి.. ఇంట్లో మతి భ్రమించిన అమ్మ, అవిటి చెల్లి.. వారి కడుపు నింపడానికి దొంగతనానికి తెగించాడు ఆ అన్న . పోలీసులకి దొరికిపోయాడు, చివరికి న్యాయస్థానంలో అతడి కథ విన్న న్యాయమూర్తి అతడికి శిక్ష వేయకుండా పరిహారంగా తిరిగి తనే కొన్ని సరుకులు కొని పంపించాడు..ఇది ఏ సినిమా కథో కాదు. నిజంగా జరిగిన కథ..ఈ కరోనా కాలంలో మనుషుల్ని కదిపితే మనసుల్ని కదిలించే ఇలాంటి కథలెన్నో.
Video Advertisement
బీహార్ కి చెందిన 16ఏళ్ల కుర్రాడు ఇస్లాంపూర్ మార్కెట్లో పనిచేసేవాడు. లాక్ డౌన్ విధించడంతో పని లేకుండా పోయింది. దాంతో తిండిలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది, ఎక్కడ పనికి వెళ్దామనుకున్నా కరోనా భయంతో ఎవరూ పనిలో చేర్చుకోలేదు..దాంతో గత నెల మార్కెట్లో ఒక మహిళ పర్సు దొంగతనం చేశాడు. సిసి టివి పుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ కుర్రాన్ని పట్టుకుని నలందాలో న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు.
అక్కడి మేజిస్ట్రేట్ మన్వేంద్ర మిశ్రా దొంగతనం ఎందుకు చేశావాని కుర్రాణ్ని ప్రశ్నించగా.. “తండ్రి కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు, తల్లి మానసికంగా కృంగిపోయింది. 12ఏళ్ల తమ్ముడు ఉన్నాడు.వాళ్లిద్దరికి తిండి పెట్టాల్సిన బాధ్యత నాదే. పనులు దొరకకపోవడంతో, వారి ఆకలి తీర్చడానికి దొంగతనం చేశానని చెప్పుకొచ్చాడు. కుర్రాడి మాటలు విన్న జడ్జి చలించిపోయి, కుర్రాణ్ని క్షమించి వదిలేయడమే కాకుండా తన సొంత డబ్బులతో ఆ పిల్లాడి కుటుంబానికి కావలసిన నిత్యావసర సరుకులు కొనాల్సిందిగా కోర్టు సిబ్బందిని అభ్యర్దించారు.
ఇవే కాదు కాలు విరిగి, సరైన ట్రీట్మెంట్ లేక కర్రల సాయంతో నడుస్తున్న ఆ కుర్రాడికి కుడికన్ను కనిపించదు, గులకరాళ్లు తగిలి దృష్టిపోయింది. కుర్రాన్ని తీసుకుని, జడ్జి ఆ కుర్రాడి కుటుంబానికి ఇవ్వమన్న నిత్యావసర సరుకులని తీసుకుని వారి ఇంటికి వెళ్లిన పోలీసులను చలింపచేసేలా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఆ బాలుడి కుటుంబం ఉంటున్న ఇంటికి గోడలు తప్ప, ఇల్లు అనడానికి ఏ వస్తువులు లేవు.. అత్యంత పేదరికంలో ఆ కుర్రాడు చేసిన పనికి వారెవరికి కోపం రాకపోగా, బాధతో కన్నీళ్లొచ్చాయి.
ఆ కుర్రాడి కుటుంబానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేదు. భవిష్యత్తులో ఈ కుర్రాడి కుటుంబం ఆకలితో ఉండకూడదని, అర్హత ఉన్న అన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలను కూడా పొందేలా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి మిశ్రా స్థానిక అధికారులను ఆదేశించారు. జడ్జి ఆదేశాల మేరకు అక్కడికి చేరుకుని , పరిస్థితులను గమనించిన అధికారులు తొందరలోనే వారి కుటుంబానికి రేషన్ కార్డు,ఇతర సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు..
End of Article