Ads
మహిళా సాధికారత గురించి ఇప్పుడు చెప్పే మాటలన్నీ ఒట్టి కబుర్లే తప్ప ఆచరణలో అంతగా కనిపించడం లేదు. మహిళా దినోత్సవం అంటూ మహిళలకు ఓ ప్రత్యేక రోజుని కేటాయించి ఆరోజు మాత్రం ఆమె ను ఆకాశానికెత్తేస్తుంటారు. ఆ మరుసటిరోజునుంచి షరా మామూలే అన్నట్లు ఉంటుంది. ఈరోజుకి కూడా చాలా మంది ఇళ్లల్లో ఆడ పిల్లను ఒకలా, మగపిల్లాడిని ఒకలా చూస్తూ ఉంటారు.
Video Advertisement
అయితే, ఆడపిల్లల కోసం ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు మిషాసింగ్. మిషాసింగ్ మధ్యప్రదేశ్ షాజాపూర్ జిల్లా పంచాయితీ విభాగం సీఈఓ గా పని చేస్తున్నారు. ఆమె ఆలోచన ప్రకారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు అయినా లబ్ధిదారులకు ఆడపిల్లల పేర్లతో ఇంటిని అందిస్తున్నారు.
అన్ని రంగాలలో ఆడపిల్లలు కూడా సమానం గా అవకాశాలు పొందాలన్న ఉద్దేశ్యం తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “భేటీ బచావో భేటీ పడావో” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2015 లోనే ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. మిషాసింగ్ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశ్యం తో ఇల్లు మంజూరు అయిన వారికి.. వారి ఇంట్లోని ఆడబిడ్డల పేర్లను ఆ భవనానికి పెట్టి ఇస్తున్నారు.
అయితే, ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి మిషాసింగ్ చాలానే కష్టపడాల్సి వచ్చింది. ముందుగా, ఆమె గ్రామ సర్పంచ్ లను కలిసి తన ఆలోచనను వివరించి అమలు చేయడానికి సాయం కావాలని కోరారు. ఆమె ఆలోచనకు అనూహ్య రీతిలో స్పందన వచ్చింది. ఆ జిల్లాలోని గ్రామాలలో చాలా మంది తమ ఆడపిల్లల పేర్లను తమకు రాబోయే ఇళ్లకు పెట్టుకోవడానికి ముందుకొచ్చారు.
జన్ పడ్ పంచాయితీ కి చెందిన ఓ తండ్రి తనకు కొడుకైనా.. కూతురైనా ఒకటేనని, ఇద్దరినీ సమానం గా చదివిస్తున్నానని, తనకు మంజూరైన ఇంటికి “మోనికా నివాస్” అని తన పదేళ్ల కూతురి పేరే పెట్టుకున్నానని గర్వం గా చెబుతున్నాడు. ఇలా గర్వం గా చెప్పుకునే తండ్రులు చాలా మందే ఉన్నారు. “రేఖా భవన్”, “వందనా నివాస్”, “కవితా భవన్”.. ఇలా ఏ ఇల్లు చూసినా ఆడపిల్లల పేర్లే దర్శనమిస్తూ ఉంటాయి. దాదాపు వేయి ఇళ్లకు పైగా ఇలానే ఆడపిల్లల పేర్లు పెట్టుకున్నారు.
ఈ విషయమై మిషా సింగ్ మాట్లాడుతూ “ఇలా ఇన్ని ఇళ్లకు ఆడపిల్లల పేర్లను పెట్టి నామఫలకం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అనుకుంటున్నా.. ఇప్పటి వరకు వేయి ఇళ్ళు పూర్తి చేసాం. మొత్తం నాలుగు వేల ఇళ్లను లక్ష్యం గా పెట్టుకున్నాం. మహిళా సాధికారత, బాలికా విద్య, లింగ సమానత్వం, అమ్మాయిల ప్రాధాన్యత, ఆర్ధిక సాధికారత వంటి అంశాలపై అవగాహనా కల్పించాల్సి ఉన్నది. ఇది కేవలం ఆరంభం మాత్రమే” అని పేర్కొన్నారు. ఎంతైనా ఈ మేడం ఆలోచనకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
A 1000 shout out to “बेटी है गृह लक्ष्मी.” Villages of Shajapur decide to name #Pmay-g houses after their girl child. An initiative of Zila Panchayat.1000 houses in ten days & counting. @ShajapurZila @CMMadhyaPradesh @mopr_goi @PMOIndia @MinistryWCD @smritiirani @JansamparkMP pic.twitter.com/JNP2OY1lsi
— Misha singh (@Mishasinghms) February 25, 2021
End of Article