అయిపోయింది , ఏడు తారిఖుతో కరోనా మాయం అన్నాడు కెసిఆర్ , కాని రాత్రికి రాత్రే పరిస్థితి మారిపోయింది. అంతా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి మూలంగానే , వారే ఢిల్లి వెళ్లి కరోనా అంటించుకుని వచ్చి ఇక్కడ అందరకి అంటిస్తున్నారు వార్త దావనంలా వ్యాపించింది. దాంతో కరోనాకి భయపడే స్థానంలోకి పూర్తిగా మతపరమైన ఇష్యూ వచ్చి చేరింది. జరుగుతున్న పరిణామాలకు ట్రీట్మెంట్ క సహకరించని వారి ప్రవర్తన మరింత ఆజ్యం పోసింది. వారం రోజుల్లో పరిణామాలు మారిపోయాయి..

Video Advertisement

సరే అసలు ఏం జరిగిందో, దాని వలన అమాయకులు కూడా బలయ్యారో? లేదంటే మత మౌడ్యంలో కొట్టుకుపోతున్నారో? అవగాహన రాహత్యమో? భయమో? వారం రోజులుగా పేపర్ల నిండా మర్కజ్ వార్తలే , టివిలలో ఆ మతం వారే అంటూ పదే పదే వేలెత్తి చూపిస్తూ తబ్లిగి జమాత్ న్యూసే. ఇవన్ని కాసేపు పక్కన పెట్టి  ఈ వార్తని ఒకసారి చదవండి.

మధ్య ప్రదేశల్లోని ఇండోర్ కి చెందిన  ఒక హిందూ మహిళ మరణించింది.  వయసు అరవై ఐదేళ్లు , ఇద్దరు కొడుకులు కూడా ఉద్యోగరిత్యా ఇంటికి దూరంగా ఉంటారు. తల్లి చనిపోయిన విషయం తెలియగానే ఎలాగో కష్టపడి ఇంటికి చేరుకున్నారు. కాని లాక్ డౌన్ వేళ  ఇద్దరే ఏం చేయలేకపోయారు. చుట్టాలు, తెలిసిన వాళ్లు రావాలనుకున్నా రావడానికి వీల్లేని పరిస్థితి. కొందరు బంధువులు కరోనాకి భయపడి అంత్యక్రియలకు హాజరు కాలేదు. అప్పుడు మేమున్నామంటు ముందుకొచ్చారు అదే ఏరియాలో ఉండే ముస్లిం కుర్రాళ్లు.

ఇద్దన్నదమ్ములకు తోడుగా నిలబడి వారే పాడెమోసి, అంత్యక్రియలకు సహకరించి, తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటనకు సంభందించిన ఫోటోలు, వీడియో ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమారు  రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానానికి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎటువంటి వాహన సౌకర్యం లేదు. దాంతో వారే నడుచుకుంటూ ముసలమ్మ దేహాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్లారు. ఇదంతా కూడా వారు మాస్కులు ధరించి, డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తూ తగిన జాగ్రత్తలు పాటిస్తూనే చేశారు.

ఇదిలా ఉండగా, తమకు ఆమె చిన్నప్పటి  నుంచి తెలుసు, ఆమె మరణిస్తే, అంత్యక్రియలకు సహకరించడం మా విధి, మా బాద్యత అంటూ పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు కదా ఇప్పుడు ప్రజలకు చేరాల్సింది. ఒక్క సారి ఆలోచించండి ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పు చేసిన వ్యక్తిని మాత్రమే ధూషిస్తారు, కాని వీరి విషయంలో మాత్రం మొత్తం కమ్యునిటిని తప్పు పడతారు.

ఇలాంటి సంఘటనలు తరచి చూస్తే ఎన్నో కనపడతాయి , అంతెందుకు మీ వరకు ఒకసారి ఆలోచించుకోండి మీ జీవితంలో ఒక్కరు కూడా వాళ్లు లేరా? వాళ్లు శత్రువుల్లానే కనపడ్డారా? మన దేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటి “భిన్నత్వంలో ఏకత్వం” . చిన్నప్పటి నుండి చదువుకుంటున్నాం, మన జీవితాల్లో అనుసరిస్తున్నాం. కాని అప్పుడప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు మనల్ని కుదిపేస్తాయి. అంతా ఒక్కసారిగా మారిపోతుంది..కాని ఒకటి నిజం ఉగ్రవాదులు ముస్లింలు కావొచ్చు కాని ప్రతి ముస్లిం ఉగ్రవాది కాదు..