Ads
ఎన్ని సంవత్సరాలు దాటినా, ఎన్ని రకాల సినిమాలు వచ్చినా కూడా ప్రేమ కథలకి మాత్రం ఎప్పటికీ ప్రేక్షకులకు అభిమానం అలాగే ఉంటుంది. అందుకే కొత్త రకమైన ప్రేమ కథలతో దర్శకులు ప్రేక్షకుల ముందుకి వస్తూ ఉంటారు. అలా తమిళ్ లో నిన్న రిలీజ్ అయిన లవర్ సినిమా తెలుగులో ట్రూ లవర్ పేరుతో ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : ట్రూ లవర్
- నటీనటులు : మణికందన్, శ్రీ గౌరీ ప్రియ, కన్నా రవి, శరవణన్.
- నిర్మాత : నజెరత్ పసిలియన్, మగేష్ రాజ్ పాసిలియన్, యువరాజ్ గణేశన్
- దర్శకత్వం : ప్రభురామ్ వ్యాస్
- సంగీతం : సీన్ రోల్డాన్
- విడుదల తేదీ : ఫిబ్రవరి 10, 2024
స్టోరీ :
అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీ గౌరి ప్రియ) కాలేజ్ సమయంలో ప్రేమించుకుంటారు. వీళ్ళిద్దరూ ఆరు సంవత్సరాలు ప్రేమలో ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. అరుణ్ కి ఉన్న పొసెసివ్ నెస్ వల్ల దివ్య వేరే ఏ అబ్బాయితో మాట్లాడినా కూడా తట్టుకోలేడు. దివ్య ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అరుణ్ ఒక కేఫ్ బిజినెస్ చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. అరుణ్ కి దివ్యతో ఉండే కొంత మంది స్నేహితులు నచ్చరు. అయినా కూడా దివ్య వారితోనే స్నేహంగా ఉంటుంది.
వీళ్ళిద్దరికీ గొడవలు జరిగి ఒక సమయం తర్వాత మాట్లాడుకోవడం మానేస్తారు. కానీ అరుణ్ తల్లి చనిపోయే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మళ్లీ వీళ్ళు మామూలుగా మాట్లాడుకుంటారు. దివ్య బర్త్ డే పార్టీ కోసం అరుణ్ ని వద్దు అనుకుంటూనే పిలుస్తుంది. అక్కడ గొడవ అవుతుంది. ఆ తర్వాత దివ్య తన స్నేహితులతో కలిసి గోకర్ణ ట్రిప్ కి వెళుతుంది. అరుణ్ ఇది తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్లిద్దరి మధ్య గొడవలు ఎలా పరిష్కారం అయ్యాయి? వీళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? అరుణ్ కేఫ్ పెట్టాడా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఈ సినిమా తమిళ్ లో నిన్న విడుదల అయ్యింది. నిన్న తెలుగులో కూడా కొన్ని సినిమాలు విడుదలకి ఉండడంతో, ఒక్కరోజు తేడాతో ఇక్కడ విడుదల చేశారు. ఈ సినిమాని తెలుగులో ఎస్ కే ఎన్, మారుతీ కలిసి సమర్పించారు. సినిమా కథ విషయానికి వస్తే యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. చాలా మంది ప్రేమలో ఉన్నవారికి ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి సమస్యల మీద అంతకుముందు కథలు కూడా వచ్చాయి. ఈ సినిమాలో కాస్త సహజంగా చూపించడానికి ప్రయత్నం చేశారు. అయితే, చాలా చోట్ల కేవలం హీరోయిన్ మాత్రమే హీరో వల్ల సమస్యలు ఎదుర్కొంటుంది అన్నట్టు చూపించారు.
హీరో తనలో తాను ఎదుర్కొనే ఒత్తిడి గురించి అంత ఎక్కువగా చూపించలేదు. హీరోకి పొసెసివ్ నెస్ ఉంది. కానీ అలా ఉండడానికి కారణం ఏంటి? దాని వల్ల అతను తనలో తనే ఎంత ఇబ్బంది పడ్డాడు? ఈ విషయాలను కూడా ఇంకా కొంచెం క్లియర్ గా చూపించి ఉంటే బాగుండేది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కబాలి, తమిళ్ డబ్బింగ్ సినిమా అయిన గుడ్ నైట్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు మణికందన్. ఈ సినిమాలో తెలుగులో కూడా తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. అరుణ్ పాత్రలో మణికందన్ చాలా బాగా నటించారు.
దివ్య పాత్రలో హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ కూడా బాగా నటించారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు చేశారు. సీన్ రోల్డాన్ అందించిన పాటలు కూడా బాగున్నాయి. శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ సహజంగా ఉంది. కానీ సినిమా స్లోగా నడుస్తుంది. వాళ్ల మధ్య ఉన్న గొడవలని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయడం కోసం దర్శకుడు కాస్త సమయం తీసుకున్నారు. దాంతో కొన్ని సీన్స్ మాత్రం కాస్త నిడివి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇలాగే ఆ ఎపిసోడ్ నిడివి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటుల పర్ఫార్మెన్స్
- సహజంగా చూపించిన కొన్ని సీన్స్
- డైలాగ్స్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
- తెలిసిన కథ
- ల్యాగ్ గా అనిపించే కొన్ని సీన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
ప్రేమ కథలు చాలానే వస్తాయి. కానీ రియల్ లైఫ్ కి దగ్గరగా ఉన్న కథలు మాత్రం కొన్ని మాత్రమే వస్తాయి. ఇది కూడా అలాంటి ఒక సినిమా. కథనం నుండి పెద్దగా కొత్తదనం ఆశించకుండా, ఒక మంచి సినిమా చూద్దాం అనుకునే వారికి ట్రూ లవర్ సినిమా ఒక్కసారి చూడగలిగే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “రవితేజ” పక్కన హీరోయిన్‌గా, వదినగా నటించిన… ఒకే ఒక్క నటి ఎవరో తెలుసా..?
End of Article