Ads
పుట్టిపెరిగిన ఊరిలో ఉపాది దొరకక, చిన్నచిన్న పనులు చేసుకోవడానికి వేలాది మైళ్లు దాటి వచ్చిన కుటుంబాలన్ని ప్రస్తుతం అష్టకష్టాలు పడుతున్నాయి.. నిండు గర్భిణిలూ రోడ్లపైనే ప్రసవం అయితే, చిన్నారులు, ముసలి ప్రాణాలు ఆకలికి, ఎండకి తట్టుకోలేక అల్లాడుతున్నాయి.. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలకు, లాక్ డౌన్ వేళ ఎటువంటి ఉపాది లేక, సొంత ఊర్లకు వెళ్లడానికి రవాణా సదుపాయం లేక నడక బాట పట్టిన ఒక్కో వలస కూలిది ఒక్కో దీనగాధ..
Video Advertisement
మధ్యప్రదేశ్‌కు చెందిన రాము ఉపాది కోసం హైదరాబాద్ కి వలస వచ్చాడు. తనతో పాటు భార్య , కూతురు కూడా హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు..లాక్ డౌన్ ప్రకటించగానే ఉపాది లేదు, తినడానికి తిండిలేదు. సొంత ఊరు వెళ్లిపోతే అయినవాళ్ల నడుమ కలోగంజో తాగి బతకొచ్చనుకున్నారు.కానీ వెళ్లడానికి రవాణా సౌకర్యం లేదు. మరోవైపు రాము భార్య గర్భిణి..ఇక్కడ రోజురోజుకి బతుకు భారంగా మారింది.. సొంత ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు..కాలి నడకన బయలుదేరారు.
ఒకట్రెండు కి.మీ నడిచి పోవచ్చు..మరికొంచెం కష్టమైనా పర్లేదు పది ఇరవై కి.మీ..కానీ 700 కి.మీ..అందునా గర్భిణి అయిన రాము భార్య..సగం దూరం నడిచాక ఇక తన వల్లకాదని కూలబడిపోయింది..అటు సొంత ఊరికి, ఇటు బతకొచ్చిన ఊరికి కాకుండా మధ్యలో ఆగిపోయారు..దీంతో రాము కర్రలు, చెక్కతో ఓ లాగుడు బండిని తయారు చేశాడు. ఆ లాగుడు బండిపై భార్యతో పాటు కూతర్ని కూర్చోపెట్టి వారిని లాగుకుంటూ మళ్లీ నడక మొదలు పెట్టాడు..
మార్గం మద్యలో పోలీసులు ,దాతలు ఇచ్చిన బిస్కట్లు , ఆహరంతో మొత్తానికి సొంతూరికి చేరుకున్నారు. ఊరికి చేరుకోగానే హమ్మయ్యా అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.. ప్రస్తుతం 14రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలనే నియమనిబంధనలప్రకారం , క్వారంటైన్లో ఉన్నారు రాము కుటుంబ సభ్యులు..పరీక్షలు నిర్వహించి వారిని పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందిగా ఆదేశించారు అధికారులు..ఇక్కడ ఎన్ని రోజులైనా ఉంటాం సర్ అని కళ్లల్లో నీళ్లతో సమాధానం ఇచ్చారు.
సొంత ఊరిలో మనకోసం మిద్దెలు, పంచభక్ష్య పరమాణ్నాలు ఉంటాయని కాదు, అదో ఆనందం..అయిన వారి మద్య ఉన్నామన్న సంతోషం.. మహానగరంలో దిక్కులేని చావు చచ్చే కంటే అయిన వాళ్లమధ్య బతకడం మంచిది అనుకునే రాము లాంటి కుటుంబాలు ఎన్నో..గమ్యం చేరేవి కొన్ని, మార్గమద్యలోనే గాలిలో కలిసే ప్రాణాలు కొన్ని.. ప్చ్
End of Article