Ads
ట్రైయాంగిల్ ప్రేమ కథతో తెరకెక్కిన చిత్రం ‘బేబీ’. జూలై 14న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, ప్రధానపాత్రలలో నటించగా, సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఆడియెన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
Video Advertisement
యువతకు, లవ్ ఫెయిల్యూర్ అయినవాళ్లకు ఈ చిత్రం కనెక్ట్ అవుతుండడంతో తొలి షో నుండి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఏ ప్రశ్నకైనా సమాధానం దొరికే కోరాలో బేబీ సినిమా ఎలా ఉందని అడుగగా, ఒక యూజర్ ఈ మూవీ గురించి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం..
“బేబీ సినిమా ఎలా ఉంది? దానిపై మీ రివ్యూ ఏంటి?” అని కోరాలో ప్రశ్నించగా, దానికి శ్రీహర్ష అనే యూజర్ ఇలా చెప్పుకొచ్చారు. “ఒక సినిమా ఫేమస్ అవ్వడానికి, సినిమాని హిట్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో కొంత మంది నిజ జీవితానికి దగ్గరగా తీస్తారు. మరి కొందరు సమాజంలో ఎక్కడో జరిగే ఒక ఎక్స్ట్రీమ్ పరిస్థితిని చూపించి ప్రపంచం అంతా ఇంతే ఉందా ? అన్న భావన కలిగేలా తీస్తారు. సమాజానికి అన్ని రకాల సినిమాలు అవసరమే.
కాకపోతే కొన్ని ఎంత ఎక్స్ట్రీమ్ గా ఉంటాయంటే అసలు ఈ సినిమా తీయడం నిజంగా అవసరమా ? అన్న భావన కలుగుతుంది. ఆ కోవలోకే ఈ “బేబీ ” సినిమా వస్తుంది. డైరెక్టర్ సాయి రాజేష్ హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో మనల్ని నవ్వించాడు. కలర్ ఫోటో లాంటి సినిమాకు కథ రాసి జనాల గుండెలను తాకాడు. కానీ బేబీ లాంటి సినిమా తీసి విజయమైతే సాధించాడు కానీ, ఒక దర్శకుడిగా తన స్థాయిని బాగా తగ్గించుకున్నాడు. ఇందులో కథ గురించి చెప్పడానికి ఏమి లేదు ట్రైలర్ లో చూపించిందే.
ఒక స్కూల్ అమ్మాయి ( వైష్ణవి చైతన్య ) అబ్బాయిని (ఆనంద్ దేవరకొండ ) ప్రేమిస్తుంది. అబ్బాయి టెన్త్ ఫెయిల్ అయ్యి ఆటో డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. వైష్ణవి మట్టుకు ఇంజనీరింగ్ కాలేజీ దాకా వెళుతుంది. అక్కడ ఉండే కొత్త పోకడలకు పూర్తిగా ఆకర్షితురాలై తన ప్రవర్తన, అలవాట్లు, డ్రెస్సింగ్, ఆలోచనలు అన్ని మార్చేసుకుంటుంది. స్వతహా మొదటి నుంచి వైష్ణవికి రిచ్ లైఫ్, గిఫ్టుల మీద ఆశ ఎక్కువ ఉండటం వలన తప్పు దారి పడుతుంది. అక్కడ కలిగే కొత్త పరిచయాలు, అట్లాగే విరాజ్ కొత్తగా తన జీవితంలోకి రావడం, అతనితో స్నేహాన్ని మించిన బంధం.
ఒకేసారి ఆనంద్, విరాజ్ ఇద్దరితో ఆడుకోవడం, చెడు స్నేహాలు, ఇలా ఒక్కో పరిస్థితి వలన తెలియకుండానే వైష్ణవి ఒక ఊబిలో పడిపోతుంది. ఇంకా క్లైమాక్స్ ఏంటి అని స్క్రీన్ మీద చూడాలి. ఈ సినిమాలో ఇంకో ప్రత్యేకత ఉంది. సినిమాలో క్యారెక్టర్ల పేర్లు కూడా వాళ్ళ పేర్లే ఉంటాయి. ఉదాహరణకు ఆనంద్, వైష్ణవి, విరాజ్, కుసుమ, సీత వంటివి. ఈ మధ్యన మన తెలుగు దర్శకుల పంథా ఎలా ఉందంటే బయట టీనేజ్ పిల్లలు, లేదా 20ల్లో ఉన్న వాళ్ళు బాతులు బాగా వాడుతారు. కాబట్టి, బయట జరిగిందే చూపిస్తున్నాం కదా అని అంటారు.
ముఖ్యంగా అమ్మాయిలను నెగటివ్ గా చూపించడం అనేది Rx 100 తో ఊపందుకుంది. 2005 లో మన్మథలో చూపించారు. ఇప్పడూ అది బ్యాక్ టూ బ్యాక్ చూపిస్తున్నారు. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలకు బ్రహ్మ రథం పడుతున్నారు . అందరు అమ్మాయిలు ఇలా ఉన్నారని కాదు కానీ, బహుశ సమాజంలో అమ్మాయిల్లో వస్తున్న మార్పుని దర్శకుడు చూపించే ప్రయత్నం చేసాడని అనిపించింది. సినిమా హిట్ అయింది అంటే జనాలు దీనికి బాగా కనెక్ట్ అయ్యారు అని అర్ధం. బహుశ కొన్ని పరిస్థితులు బయట అలానే ఉన్నాయేమో అనిపించింది.
ఫ్యామిలిస్ ఈ సినిమా చూడటం అనేది చాలా దూరం. ఒక్క టీనెజర్స్, కాలేజీ స్టూడెంట్స్ తప్ప ఈ సినిమాని ఎవరు ఎంజాయ్ చేయలేరు. ఆ దశలో ఉన్న వాళ్లకు బాగా నచ్చుతుంది. ఇప్పడీ తరం అమ్మాయిలు అబ్బాయి ఈ సినిమా లో చూపించిన విరాజ్, వైష్ణవిలాగానే ఉన్నారు. అబ్బాయిలు చాలా మంది తమని ఆనంద్ దేవరకొండ క్యారక్టర్ తో తమని తాము పోల్చుకుంటారు. ఆర్ ఎక్స్ 100 లాంటి సినిమాతో దర్శకుడు ఆడియన్స్ కు షాక్ ఇచ్చాడు. దాదాపు అదే పంథాలో ఈ సినిమా కూడా సాగుతుంది.
కాకపోతే ఈ సినిమాలో వైష్ణవి పరిస్థితుల వలన చెడిందైతే, ఆర్ ఎక్స్ 100 లో హీరోయిన్ క్యారెక్టర్ పరమ వరస్ట్ గా ఉంటుంది. నటినటుల గురించి మాట్లాడుకోవాలి అంటే, ముందుగా వైష్ణవి గురించి చెప్పాలి. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ లో అందరికి తెలిసిన వైష్ణవి. బేబీలో చాలా బాగా నటించింది. ఒక స్కూల్ అమ్మాయిగా, కాలేజీ అమ్మాయిగా, చెడు దోవ పట్టిన అమ్మాయిలాగ వేరియేషన్స్ చాలా అద్భుతంగా చూపించింది. ఎక్కడ కూడా మోనోటనీ రాలేదు. ప్రతి క్యారక్టర్ లో కొత్తగా ఎక్స్ప్రెషన్ పెట్టింది. బాడీ లాంగ్వేజ్ కూడా మారింది.
మొదట చేసిన తీన్మార్ డాన్స్ నుంచి,టెన్త్ క్లాస్ అమ్మాయిగా, ఆనంద్ ప్రేయసిగా, ఆ తరువాత ఒక హై క్లాస్ అమ్మాయిగా విరాజ్ కు కలరింగ్ ఇచ్చేడప్పుడు, మందు తాగి ఆనంద్ తో మాట్లాడేటప్పుడు, బాడీ లాంగ్వేజ్ కానీ, వేరియేషన్ కానీ అద్భుతంగా చూపించింది. వైష్ణవి పాత్రని బాగా పండించింది. వైష్ణవి స్టార్ హీరోయిన్ కాకపోవచ్చు. కాని ఐశ్వర్య రాజేష్ లా మంచి నటిగా గుర్తింపు పొందుతుందని అనుకుంటున్నాను. ఆనంద్ నటనతో తన ప్రత్యేకతను చాటాడు. ప్రేయసి మోసం చేస్తే ఒక ప్రియుడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆ బాధను బాగా చూపించాడు.
మనసారా ప్రేమించిన అమ్మాయి గుండెల్లో గుచ్చితే ఎలా ఉంటుందో చాలా బాగా తెలిసేలా నటించాడు. విరాజ్ ఉన్నంతలో బాగానే చేసాడు. ఇంకా మిగతా వాళ్లంతా వాళ్ళ వాళ్ళ పరిధుల్లో బాగానే నటించారు. సినిమా కథనం ఎక్కడా బోర్ కొట్టకుండా, సాగుతుంది. ఒక్క ప్రీ క్లైమాక్స్ మాత్రమే బాగా సాగదీసినట్టు అనిపించింది. విరాజ్ క్యారక్టర్ విషయంలో మట్టుకు దర్శకుడు రాజేష్ కొంచెం కంఫ్యూజ్ చేసాడు. విరాజ్ వైష్ణవిని ప్రేమిస్తున్నాడా? కామిస్తున్నాడా ? అన్న క్లారిటీ లేకుండా చేసాడు.
కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది సినిమా రిచ్ గా కనిపించి కానీ ఎక్కడ కూడా చిన్న సినిమాలాగా అనిపించలేదు. మొదటి నుంచి ఫేమస్ అయిన ” ఓ రెండు మేఘాలిలా ” పాట మంచి ఫీల్ ఉన్న టైంలో సినిమాలో వస్తుంది. అనంత శ్రీరామ్ ఈ పాటకు లిరిక్స్ చాలా అద్భుతంగా రాసాడు. మన్మధ, ఆర్ ఎక్స్ 100, బేబీ లాంటి సినిమాలతో ఇప్పుడు హీరోయిన్లు ఎంత బ్యాడ్ అయితే అంతగా జనాలు పడి పడి చూస్తున్నారా? అన్న భావన కలిగేలా దర్శకులు మార్చేశారు. ఈ సినిమా చూడాలి అంటే 22 ఏళ్ళ వాళ్ళ లాగ ఫీల్ అయ్యి చూడాలి. అప్పుడే ఎంజాయ్ చేయగలము.
ఫ్యామిలిస్ ఇంకా లేడీస్ మట్టుకు ఈ సినిమాకు కచ్చితంగా దూరంగా ఉండొచ్చు. ఒక నెల తరువాత ఓటీటీలో ఫ్రీగా వచ్చింది కదా అని కక్కుర్తి పడి అందరి ముందర చూడొద్దు సినిమాలో చాలా చోట్ల, సీన్లు, బూతులు ఉంటాయి. ఇళ్లలో పెద్దవాళ్ళ ముందర లేదా పిల్లల ముందర పరువు పోతుంది. ఇయర్ ఫోన్స్ యే శరణ్యం, తస్మాత్ జాగ్రత్త. వన్ లైన్ రివ్యూ దీని గురించి రాయాలి అంటే ” Oh baby.. సినిమా హిట్ అయితే కొట్టావు కానీ తెలుగు సినిమా స్థాయిని ఇంకో 4 మెట్లు దిగజార్చావు, ఈ తరం అబ్బాయిలకు అమ్మాయిల మీద అనుమానాలు పెంచావు” అని బేబీ గురించి చెప్పారు.
Also Read: “మన్మధ” తో పాటు… హీరోయిన్ ని “నెగెటివ్” గా చూపించిన 14 సినిమాలు..!
End of Article