విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలు ఆయన పుట్టిన గ్రామం కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి.

Video Advertisement

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో నందమూరి ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ‘నిమ్మకూరు’ గ్రామం పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ తన స్వగ్రామం కోసం ఏం చేశారనే విషయాన్ని అక్కడి వారు గుర్తు చేసుకుంటున్నారు. మరి స్వగ్రామానికి ఎన్టీఆర్ ఏం చేశారో ఇప్పుడు చూదాం..
ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో తమ స్వగ్రామం అయిన నిమ్మకూరులో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిలో పాల్గొన్న బాలయ్య మాట్లాడుతూ తెలుగువారి హృదయాలలో ఎన్టీఆర్‌ శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు. ఎన్టీఆర్ కు జన్మనిచ్చిన భూమి అయిన  నిమ్మకూరు గ్రామాన్ని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తమ నాయనమ్మ కట్టించిన ఒక దాబాను కూడా ఎన్టీఆర్ కి అంకితమిస్తున్నామని తెలిపారు.
అన్నగారు అని తెలుగువారు అప్యాయంగా పిలుచుకునే ఎన్టీఆర్ పుట్టిన ఇల్లు ఇప్పటికి నిమ్మకూరులో అలాగే ఉంది. ఆ ఇంట్లో ఆయనకు సంబంధించిన ఫోటోలు, కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇక ఈ ఇంటి బాగోగులను హరికృష్ణ కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందే నటుడిగా ఉన్న సమయంలోనే స్వగ్రామం కోసం తన వంతు కృషి చేశారని స్థానికులు తెలిపారు. తన పలుకుబడిని ఉపయోగించి రోడ్డు వేయించారని, వంతెన కట్టించారని అక్కడివారు అన్నారు. ఇక ముఖ్యమంత్రి అయిన తరువాత రెసిడెన్షియల్ స్కూల్, దేవాలయం, హాస్పటల్ కట్టించారని చెప్పారు.
రెసిడెన్షియల్ విద్యాసంస్థల వల్ల నిమ్మకూరుకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికి కూడా ఈ స్కూల్ లో వందల మంది విద్యార్ధులు చదువుతున్నారు. రెసిడెన్షియల్ స్కూల్ ఇంచార్జ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ స్కూల్ లో చదివిన వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఎఎస్, ఐపీఎస్, ఇస్రో పనిచేస్తున్నవారు కూడా ఉన్నారని తెలిపారు. మహిళల శిక్షణ మరియు ఉపాధి కోసం నిమ్మకూరులో నైపుణ్యాభివృద్ధి మరియు మహిళా సాధికారత కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలతో పాటు, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఎన్టీఆర్ తన కుమారుడు హరికృష్ణ నిమ్మకూరులోనే చదివించారు. హరికృష్ణతో కలిసి చదువుకున్నవారు ఇప్పటికి ఇక్కడ ఉన్నారు. అలాగే హరికృష్ణ కుటుంబ సభ్యులు తరుచుగా ఇక్కడికి వస్తుంటారు. శతజయంతి ఉత్సవాలలో భాగంగా బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు నిమ్మకూరులో ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కూడా నిమ్మకూరులో స్థలం కొన్నట్టు తెలుస్తోంది.ఎన్టీఆర్ హయాంలోనే బందర్ కాలువ వంతెన, వాటర్ ట్యాంక్, రోడ్డు మంజూరు చేయించారని, పనులన్నీ కూడా ఏడాదిలోనే  పూర్తి అయ్యాయని స్థానికులు అప్పటి  సంగతులను వెల్లడించారు. ఇలా నందమూరి తారక రామారావు గారు తనకు జన్మనిచ్చిన గ్రామం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.

watch video :

Also Read: మే 9న హైదరాబాద్‌లో అరుదైన దృశ్యం జరగబోతోందా..? అసలు విషయం ఏంటంటే..?