Ads
ఇటీవల పెళ్లి చేసుకోవడం అంటే అందులో హంగు ఆర్భాటాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల వచ్చిన మోడరన్ కల్చర్ కూడా ఎక్కువగా జత కలుస్తోంది. పెళ్ళికి ముందే ఫోటో షూట్, కుదరకపోతే పెళ్లి అయిన తరువాత అయినా పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ అంటూ రకరకాల ప్రదేశాలకు వెళ్తూ ఫోటోలు తీసుకుంటున్నారు.
Video Advertisement
ఈ తంతు ఫోటోలు తీసుకోవడం వరకే ఉంటె బాగుండేది. కానీ.. ఇందులో ప్రమాదకరమైన ప్రయోగాలు చేస్తుండడం వల్లనే ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా.. కేరళకు చెందిన ఓ జంట ఇలానే ఫోటో షూట్ తీసుకోబోయి ప్రాణాలని ప్రమాదంలో పడేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే, కేరళలో కడియంగడ్‌కు చెందిన రెజిల్, కార్తీక గత నెల 14 వ తేదీన వివాహం చేసుకున్నారు. కాగా, వేడుక పూర్తి అయిన తరువాత ఫోటో షూట్ తీసుకుందామని ప్లాన్ చేసుకున్నారు. కాగా, అందుకోసం సమీపంలోనే ఉన్న కట్టియాడి నది వద్దకు వెళ్లారు. అయితే. అక్కడ కట్టియాడి నది ప్రవాహ వేగం కొంచం ఎక్కువగానే ఉంది.
వీరు ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆ నదిలో పడిపోయారు. ఆ ప్రవాహంలో చిక్కుకుపోయి కాపాడాలంటూ కేకలు పెట్టారు. అయితే.. వీరి అరుపులు విన్న స్థానికులు నదిలోకి దూకి ఇద్దరినీ రక్షించారు. వీరిద్దరిని ఆసుపత్రికి తరలించారు. కానీ, దురదృష్టం వీరిని వీడలేదు. వరుడు రెజిల్ మరణించాడు. కాగా, వధువు కార్తీక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సరదాలు ఎన్ని ఉన్నా.. హద్దు మీరకుండా.. జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి.
End of Article