ఆశ క్యాన్సర్ ఉన్నోన్ని కూడా బతికిస్తుంది, కాని భయం అల్సర్ ఉన్నోన్ని కూడా చంపేస్తుంది అని ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు మనకి కావల్సింది ధైర్యమే. కరోనా వచ్చి పోయేకంటే, ఎక్కడ వస్తుందో అనే భయంతోనే పోయేలా ఉంది మనలో చాలామంది పరిస్థితి..మనం చేస్తున్నది పోరాటం.ఈ పోరాటం మన ఒక్కరికోసమే కాదు, మన తోటివాళ్లందరి కోసం, ఈ పోరాటంలో గెలవాలంటే మనకి కావలసింది ధైర్యం అని పదే పదే చెప్పుకుంటునే ఉన్నాం. అయినా కూడా భయపడుతూనే ఉన్నారు. ఒక జంట అయితే ఆత్మహత్య చేసుకున్నారు.
రాజమండ్రికి చెందిన రమేశ్, అతని భార్య వెంకటలక్ష్మీ తామిద్దరికి కరోనా సోకిందేమో అనే భయంతో, కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు రమేశ్, వెంకటలక్ష్మీ ఇళ్లల్లో పనులు చేస్తుంది. పదిహేనేళ్ల క్రితం పెళ్లైన వీరిద్దరికి ఇప్పటివరకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోయినప్పటికి ఒకరికొకరు అన్యోన్యంగా ఉండేవాళ్లు. ఇద్దరూ వారి ఇంటికి సమీపంలోని పొదల్లోకి వెళ్లి ఆత్మహత్యకి పాల్పడ్డారు.
ఆత్మహత్య చేస్కున్న స్థలంలో లెటర్ దొరికింది. వారికి కొన్ని అప్పులున్నాయని, ఇప్పుడు కరోనా సోకిందేమో అని భయంగా ఉందని అందుకే చనిపోతున్నామని రాసి ఉన్నట్టు సమాచారం. కరోనా సోకిందేమో అనే భయంతో చావులు, కరోనా సోకింది కాబట్టి చుట్టుపక్కల వాళ్లేమనుకుంటారో అనే భయంతో దాచిపెట్టడం, లేదా చనిపోవడం లాంటి పిచ్చిపనులు చేయకండి.
కరోనా లక్షణాలైనా దగ్గు, జలుబు , తలనొప్పి , జ్వరం లాంటివి ఉంటే ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేయకండి, మామూలు జ్వరం, తలనొప్పి కూడా కావొచ్చు . కాబట్టి మీకు ఆ లక్షణాలు కనపడితే భయపడకుండా, జాగ్రత్త పడండి, ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి టెస్టులు చేయించుకోండి. రోగం నిర్దారణ కాకముందే మీకు మీరే మీ జీవితానికి చెక్ పెట్టుకోకండి. . అయినా కరోనా వైరస్ సోకినంత మాత్రానా చనిపోరు , మనం ఆరోగ్యంగా ఉన్నంత కాలం ఏ వైరస్ మనల్ని ఏమీ చేయలేదు.. ధైర్యంగా ఉండండి..