Ads
మనం ఏదైనా చేయగలం అనే నమ్మకం ఉండొచ్చు. కానీ మనం మాత్రమే అది చేయగలం అనే పొగరు మాత్రం ఉండకూడదు. ఒక వ్యక్తి అందరినీ అదుపులో పెట్టుకొని తనకంటే బలశాలి ఎవరూ లేరు అనే అహంకారంతో ఉంటే ఏమవుతుందో ఈ కథ చదివితే మీకు కూడా అర్థమవుతుంది.
Video Advertisement
ఒక పట్టణంలో రంగన్న అనే వ్యక్తి ఉండేవాడు. అతను కుస్తీ పోటీల లో పాల్గొనేవాడు. ప్రతి పోటీలో రంగన్నే గెలిచేవాడు. చూడటానికి బలంగా ఉండేవాడు అని అక్కడ ఉండే ప్రజలందరూ కూడా రంగన్న ని చూసి భయపడే వారు. రంగన్న ఎప్పుడైనా ఏదైనా కొనుక్కోవడానికి దుకాణానికి వెళితే అతనిని చూసి భయపడిన దుకాణదారులు రంగన్న కి కావాల్సినవి ఉచితంగానే ఇచ్చేవారు.
తనకి ఏదైనా సులభంగా దొరుకుతుంది అనుకున్న రంగన్న అందర్నీ భయపెట్టి తనకి కావాల్సినది తీసుకోవడం మొదలు పెట్టాడు.ఊరి పెద్దలు కూడా రంగన్న కుస్తీ పోటీల్లో పాల్గొని గెలిస్తే ఊరికి మంచి పేరు వస్తుంది అని అతను తప్పు చేస్తున్నా ఏమనేవారు కాదు.
ఒకరోజు రంగన్న వెళుతుంటే దారిలో ఒక ముసలావిడ బుట్టలో మామిడి పండ్లు పెట్టుకొని అమ్ముతూ కనిపించింది. రంగన్న మామిడి పండు ఎలా ఉందో చూస్తాను అని ఒక్కొక్క మామిడిపండ్లు తీసుకొని నొక్కడం మొదలు పెట్టాడు. అది చూసిన ఆ ముసలావిడ అలా చేస్తే పండ్లన్నీ పాడైపోతాయి కావాలంటే కొనుక్కోమని లేదంటే బుట్టలో పెట్టి వెళ్ళిపోమని చెప్పింది.
రంగన్నకు అలా ఒకరు ఎదురు చెప్పడం అదే మొదటిసారి.ముసలావిడ మాటలు విన్న రంగన్న కి కోపం వచ్చి పండ్ల బుట్ట ఎత్తి కింద పడేసాడు. దాంతో మామిడి పండ్లు అన్ని పాడైపోయాయి. ఆ ముసలావిడ కోపంతో “నీ ప్రతాపం ఇక్కడ చూపించడం కాదు మా ఊరికి వచ్చి రాజన్న ముందు చూపించు” అని చెప్పింది. “నా కంటే బలశాలి ఈ భూమి మీద ఎవరూ లేరు. మీ ఊరికి వచ్చి రాజన్న కి కూడా నేను ఏంటో చూపిస్తాను” అని జవాబు ఇచ్చాడు రంగన్న.
మరుసటి రోజు ఆ వృద్ధురాలు చెప్పిన చోటికి వెళ్లి రాజన్న కోసం వెతకడం మొదలుపెట్టాడు రంగన్న. అక్కడే పొలంలో పనిచేస్తున్న రాజన్న రంగన్న ని చూసి ఎవరు కావాలని అడిగాడు. దానికి రంగన్న “రాజన్న కోసం వచ్చాను” అని చెప్పాడు. రాజన్నకి విషయం అర్థంకాక అసలు రంగన్న ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి అనుకున్నాడు. అందుకని తను రాజన్న కి తమ్ముడు అవుతాడని అబద్ధం చెప్పాడు.
రాజన్న వచ్చేటప్పటికి కొంత సమయం పడుతుంది అని అంత లోపు ఇంటికి వచ్చి భోజనం చేయమని రంగన్నని అడుగుతాడు. రంగన్న కూడా సరే అని రాజన్న తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రాజన్న వాళ్ళ అమ్మ రంగన్న కి రాజన్న కి భోజనం వడ్డిస్తుంది. రంగన్న కి పాలు, పెరుగు, బాదంపప్పులు, గుడ్లు, కోడి మాంసం, మేక మాంసం తప్ప అన్నం తినే అలవాటు లేదు. దాంతో రంగన్న తినలేకపోయాడు.
రాజన్న మాత్రం భోజనాన్ని ఆస్వాదిస్తూ తింటున్నాడు. రంగన్న కి అసలు ఇలాంటి భోజనం ఎలా తింటారా అని ఆశ్చర్యమేసింది. రాజన్న అన్నంలో నూనె కలుపుకుంటే బాగుంటుంది అని వాళ్ళ అమ్మని నూనె తీసుకు రమ్మని అడుగుతాడు. రంగన్న కి కూడా నూనె కలుపుకుని తింటే అన్నం బాగుంటుంది అని చెప్తాడు.
రాజన్న వాళ్ళ అమ్మ నువ్వులు పట్టుకొచ్చి ఇద్దరి దోసిట్లో పోస్తుంది. రాజన్న చేతితో ఆ నువ్వులను గట్టిగా పిండి ఆ వచ్చిన నూనెను అన్నంలో కలుపుకుని తింటూ ఉంటాడు. రంగన్న మాత్రం ఎంత గట్టిగా ఆ నువ్వులను పిండడానికి ప్రయత్నించినా ఒక్క చుక్క నూనె కూడా రాదు.
ఇదంతా చూసిన రాజన్న తన ఎడమచేతిని రంగన్న నువ్వులు పట్టుకున్న చేతి పై పెట్టి గట్టిగా నలుపుతాడు. దాంతో నూనెతో పాటు రంగన్న చేతికి రక్తం కూడా వస్తుంది. ఇంక రంగన్న ఆ అన్నం తినలేక మజ్జిగ అన్నం తింటాను అని చెప్పి రాజన్న వాళ్ళ అమ్మ ని అడిగి మజ్జిగ అన్నం తినేసి బయలుదేరుతాడు.
రాజన్న లేచి “మీరు రాజన్న ని కలవాలి అన్నారు కలవకుండానే వెళ్ళిపోతున్నారు. ఆగండి రాజన్న ని కలిసి వెళ్ళండి” అని అంటాడు. దానికి రంగన్న “అవసరం లేదు నాకు అర్థం అయింది” అని చెప్పి వెళ్ళిపోతాడు.
దీన్ని బట్టి అర్థం అయిన విషయం ఏంటి అంటే భయపెట్టి లేదా పెత్తనం చెలాయించి మన పనులన్నీ ఇతరులచేత చేయించు కోవడం, కావాల్సినవన్నీ కష్టపడకుండా సులభంగా దక్కించుకోవడం అనేది తప్పు. ఒక వేళ అలా చేసినా కూడా వాటి నుండి వచ్చిన ఫలితం ఎక్కువ కాలం నిలవదు.
ఇవాళ మనం అందరి కంటే బలంగా ఉండొచ్చు కానీ తర్వాత మన కంటే బలం, తెలివి గల వాళ్ళు ఎంతో మంది వస్తారు. కాబట్టి మన స్థానాన్ని నిలుపుకోవాలంటే కష్టపడి పని చేయాలి. డబ్బైనా, పేరైనా, గుర్తింపైనా ఏదైనా కావాలి అంటే సాయశక్తులా కష్టపడాలి. అలా కష్టపడితేనే ఎదుగుతాం. తెలివి, శ్రమ రెండు కలిస్తేనే ఎంతో కాలం నిలిచిపోయే గుర్తింపును, మంచిపేరుని సంపాదించగలం.
End of Article