Ads
గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి కన్నడ సినిమాల హవా నడుస్తోంది. స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలు ఇస్తూ, హిట్ మీద హిట్ కొడుతోంది కన్నడ ఇండస్ట్రీ. కన్నడ ఇండస్ట్రీలో తనదైన శైలి సినిమాలతో పేరు తెచ్చుకున్న నటుడు రక్షిత్ శెట్టి. రక్షిత్ శెట్టి మంచి నటుడు మాత్రమే కాదు, మంచి కంటెంట్ ని ఎంకరేజ్ చేసే నిర్మాత కూడా. ఇప్పుడు రక్షిత్ శెట్టి హీరోగా, హేమంత్ రావు దర్శకత్వంలో వచ్చిన సప్త సాగర దాచె ఎల్లో సినిమాని తెలుగులో డబ్ చేసి, సప్త సాగరాలు దాటి పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : సప్త సాగరాలు దాటి (సైడ్ A)
- నటీనటులు : రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, అచ్యుత కుమార్, శరత్ లోహితాశ్వ.
- నిర్మాత : రక్షిత్ శెట్టి
- దర్శకత్వం : హేమంత్ ఎం రావు
- సంగీతం : చరణ్ రాజ్
- విడుదల తేదీ : సెప్టెంబర్ 22, 2023
స్టోరీ :
మను (రక్షిత్ శెట్టి) ఒక కారు డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. మను యజమాని శేఖర్ గౌడ (అవినాష్) ఒక పెద్ద వ్యాపారవేత్త. ప్రియ (రుక్మిణి వసంత్) సింగర్ కావాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మను, ప్రియ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు. వారిద్దరూ కలిసి ఒక ఇల్లు కట్టుకొని, అందులో సంతోషంగా ఉండాలి అని ప్రియ కలలు కంటూ ఉంటుంది. అయితే, మను యజమాని కొడుకు డ్రైవింగ్ కారణంగా ఒక వ్యక్తి చనిపోతాడు.
దాంతో శేఖర్ గౌడ, ఈ కేసుని మను మీద వేసుకోమని, కొద్ది రోజుల్లోనే విడిపిస్తాను అని దాంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఇస్తాను అని మనుకి చెప్తాడు. ప్రియ వద్దు అని చెప్పినా కూడా వినకుండా, ఇలా వచ్చే డబ్బులతో ప్రియతో కలిసి సంతోషంగా బతకచ్చు అని ఆలోచించి మను ఆ కేసుని తన మీద వేసుకొని జైలుకి వెళ్తాడు. కానీ అక్కడ మను అనుకోని సంఘటనలు ఎదుర్కొంటాడు. మనుకి బెయిల్ రాదు. శేఖర్ గౌడ గుండెపోటుతో చనిపోతాడు.
అక్కడ జైలులో మను సోమ అనే ఒక వ్యక్తి గ్యాంగ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. పిఎ ప్రభు (అచ్యుత కుమార్) ఈ కేసును పక్కదారి పట్టించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇతని మాటలు విని శేఖర్ గౌడ మోసపోతాడు. మను బయటికి వచ్చాడా? మనుని బయటికి తీసుకురావడానికి ప్రియ ఎలాంటి పోరాటం చేసింది? ప్రియ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంది? మనుకి జైల్ లో ఉండే ఒక గ్యాంగ్ ఖైదీలతో గొడవ ఎందుకు అవుతుంది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
కిరిక్ పార్టీ నుండి ఇటీవల వచ్చిన చార్లీ 777 వరకు డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు సెలెక్ట్ చేసుకోవడంలో ముందు ఉన్న యంగ్ హీరో రక్షిత్ శెట్టి. ఒక సినిమాకి, మరొక సినిమాకి పోలిక ఉండకుండా, ప్రతి పాత్ర కోసం తనని తాను మార్చుకుంటూ, ఇంత గొప్ప కంటెంట్ ఉన్న సినిమాలని తానే నిర్మిస్తూ, కన్నడలో ఒక మంచి నటుడిగా, ఒక మంచి ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు. అతడే శ్రీమన్నారాయణ సినిమా నుండి రక్షిత్ శెట్టి నటించిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి.
ఈ సినిమా తెలుగు ప్రెస్ మీట్ లో భాగంగా రక్షిత్ శెట్టి మాట్లాడుతూ, “కన్నడలో సినిమా రిలీజ్ చేశాక, ఈ సినిమాని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా రిలీజ్ చేస్తాము అని మాకు ముందే తెలుసు” అని చెప్పారు. ఒక సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు ఏ రకంగా ఆదరిస్తారో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. డబ్బింగ్ సినిమా అయినా, స్ట్రైట్ తెలుగు సినిమా అయినా కంటెంట్ బాగుంటే తెలుగు వాళ్ళు ఆ సినిమాని కచ్చితంగా ఆదరిస్తారు. ఈ సినిమా ఇప్పటికే కన్నడలో చాలా పెద్ద హిట్ అయ్యింది.
లవ్ స్టోరీస్ అంటే ఒక రకమైన టెంప్లేట్ ఉంటుంది అని ప్రేక్షకుల మెదడులో ఒక భావన ఏర్పడిపోయింది. కానీ ఈ సినిమా ఆ టెంప్లేట్ కి కాస్త భిన్నంగా ఉంటుంది. సినిమా మొత్తం ఒక ప్రశాంతమైన టోన్ లో సాగుతూనే, చాలా బలమైన ఎమోషన్స్ ని తెరపై చూపించింది. కెరీర్ గురించి కలలు కనే యువతి, నిజాయితీ ఉన్న ఒక యువకుడు, వారిద్దరూ ప్రేమలో పడడం. ఒకరితో ఒకరు జీవితాన్ని ఊహించుకోవడం. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది.
ఆ తర్వాత దర్శకుడు సినిమా ముందుకు తీసుకువెళ్లడానికి ఎంచుకున్న పాయింట్ మాత్రం సినిమా అయిపోయాక కూడా వెంటాడుతూ ఉంటుంది. సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ సహజమైన బ్యాక్ డ్రాప్ లో సినిమా నడవడం. వారు మాట్లాడుకునే మాటలు, ప్రవర్తించే విధానం, వారు ఎదుర్కొనే సంఘటనలు ఇవన్నీ దర్శకుడు చాలా సహజంగా చూపించడానికి ప్రయత్నించాడు. అంతే కాకుండా, సినిమాలో చాలా వరకు జైలులో హీరో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు అనే విషయాన్ని చూపించారు.
కొన్ని దశాబ్దాల నుండి జైలు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఏ సినిమాలో కూడా ఇలాంటి సంఘటనలు చూపించలేదు అని చెప్పవచ్చు. చాలా సినిమాల్లో జైళ్ళని చాలా సినిమాటిక్ గా చూపిస్తారు. కానీ ఈ సినిమాలో అలా కాకుండా అసలు నిజంగా జైళ్లు ఎలా ఉంటాయో వెళ్లి చూసి, అలాగే సెట్ డిజైన్ చేసి చూపించారు. అలాగే జైల్లో ఖైదీల మధ్య జరిగే గొడవలు కూడా ఏదో డిజైన్ చేసినట్టు కాకుండా, నిజంగానే కొంత మంది వ్యక్తులు గొడవ పడితే ఎలా ఉంటుందో అలాగే ఉండేలాగా రూపొందించారు.
ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో హీరో హీరోయిన్లు ఉన్నారు అనడం కంటే, గొప్ప నటులు ఉన్నారు అనడం కరెక్ట్ ఏమో. రక్షిత్ శెట్టి మను పాత్రలో చాలా బాగా నటించారు. అలాగే ప్రియ పాత్రలో నటించిన రుక్మిణి వసంత్ రక్షిత్ శెట్టి తో సమానంగా నటించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అయితే ఆమె పర్ఫార్మెన్స్ పక్కన ఉన్న వాళ్ళని ఓవర్ షాడో చేసింది. అంత బాగా నటించారు. అలాగే మిగిలిన ముఖ్య పాత్రల్లో నటించిన అవినాష్, అచ్యుత కుమార్ కూడా వారి పాత్రలకి తగ్గట్టుగా నటించారు.
లొకేషన్స్ కూడా బాగున్నాయి. చరణ్ రాజ్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమా టోన్ ని పర్ఫెక్ట్ గా తెర మీద చూపించింది. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంది. సైడ్ బి లో ఏం జరగబోతోంది అనేది ఈ పార్ట్ లోనే చివరిలో చూపించారు. ఈ సినిమా కూడా ఇంకా కొద్ది రోజుల్లోనే విడుదల అవుతుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం సినిమా చాలా స్లోగా అనిపిస్తుంది. దర్శకుడు ఆ ఎమోషన్ ని తెరపై బాగా చూపించే ప్రయత్నంలో సీన్స్ చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- ఎమోషనల్ సీన్స్
- సంగీతం
- దర్శకుడు ఎంచుకున్న పాయింట్
మైనస్ పాయింట్స్:
- నిడివి ఎక్కువగా ఉన్న కొన్ని సీన్స్
- స్లోగా నడిచే కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్ :
3.25/5
ట్యాగ్ లైన్ :
సినిమాలో చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా అవి ప్రేక్షకులకి పెద్దగా కనిపించవు. సినిమా చూసి థియేటర్ నుండి బయటికి వచ్చాక కూడా చాలా కాలం వరకు ఆ సీన్స్ ప్రేక్షకులని వెంటాడుతూనే ఉంటాయి. అంటే ఈ సినిమాలోని ఎమోషన్స్ అంత ప్రభావితం చేస్తాయి. ఇటీవల కాలంలో వచ్చిన ఒక బెస్ట్ ఎమోషనల్ లవ్ స్టోరీ సినిమాగా సప్త సాగరాలు దాటి సినిమా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : కూతురి గురించి విజయ్ అంటోని ఎమోషనల్ లెటర్..! “నా కూతురు చాలా ధైర్యవంతురాలు..!” అంటూ..?
End of Article