Ads
- చిత్రం : కాంతార
- నటీనటులు : రిషభ్ శెట్టి, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ.
- దర్శకత్వం : రిషభ్ శెట్టి
- నిర్మాత : విజయ్ కిరగండూర్
- సంగీతం : అజనీష్ లోక్ నాథ్
- సినిమాటోగ్రఫీ : అరవింద్ కశ్యప్
- విడుదల తేదీ : అక్టోబర్ 15, 2022
Video Advertisement
స్టోరీ :
అసంఖ్యాకమైన సంపద, కుటుంబం, సంతానం అన్నీ ఉన్నా.. ఏదో తెలియని లోటుతో మదనపడే ఓ రాజు, ప్రశాంతతను వెతుక్కుంటూ పయనిస్తుండగా.. అడవిలో కనిపించిన ఓ శిల ముందు ఆగిపోతాడు. మనసులో ఏదో తెలియని ఆనందం, అప్పటివరకూ అతనికి నిద్రలేకుండా చేసిన చింత మొత్తం మాయమైపోతుంది. దాంతో.. ఆ దేవుని శిలను తనకు ఇచ్చేయమని, దానికి బదులుగా ఏం కావాలన్నా ఇస్తానని అక్కడి గ్రామ ప్రజలను కోరతాడు.
ఆ శిలకు బదులుగా.. ఆ అడవి మొత్తాన్ని సదరు ప్రజలకు ఇచ్చేయాలని, మళ్ళీ ఆ భూమిని లాక్కోవడానికి ప్రయత్నించకూడదని మాట తీసుకుంటాడు మనిషికి పట్టిన దేవుడు. అయితే కాలక్రమేణా అంటే 1970 ప్రాంతంలో రాజు కుటుంబీకుల్లో కొంత మందికి ఆ భూమి మీద ఆశ పెరుగుతుంది. వాటిని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఊరిని కాపాడుతూ, దైవసేవ చేస్తూ కోలం ఆడే వారికి ఎదురెళ్తారు రాజ కుటుంబీకులు.
హీరో శివ తండ్రి కోలం ఆడుతూ చివరకు అదృశ్యం అవ్వడం వెనుకున్న కథ ఏంటి? చివరకు శివ కోలం ఆడతాడా?.. అసలు ఆ భూములను కాజేసేందుకు ప్రయత్నించిన వారు ఎవరు? క్షేత్రపాలకుడుగా మారి శివ ఆ భూములను కాపాడుతాడా? అనేది సినిమా కథ..
రివ్యూ :
కన్నడ చిత్రపరిశ్రమ నుండి విడుదలైన మరో చిత్రరాజం “కాంతార”. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ అనువాదరూపంలో విడుదల చేసింది. కాంతార కథ సింపుల్‌గానే అనిపిస్తుంది. కానీ ఆ పాయింట్ కోసం ఎంచుకున్న నేపథ్యం, రాసుకున్న కథనం, అల్లుకున్న ఆచార సంప్రాదాయాలు అన్నీ అద్భుతంగా సెట్ అయ్యాయి. అటవీ ప్రాంతం, అందులో రాజ కుటుంబీకులు భూములు, కోలం ఆడే సంప్రదాయం, కాపాడే క్షేత్ర పాలకుడు అంటూ ఇలా కథలో ఎన్నో ఆసక్తిరమైన అంశాలను జోడించాడు దర్శకుడైన రిషభ్ శెట్టి.
రాసింది తానే తీసింది తానే.. నటించింది తానే కాబట్టి రిషభ్ శెట్టికి అన్నీ కలిసి వచ్చాయి. తన పరిధిని మించి రాసుకున్న కథకు.. అద్భుతంగా న్యాయం చేశాడు. కథ, కథనం ఇలా ఎంతో పకడ్బందీగా పేర్చుకున్నట్టు అనిపిస్తుంది. సినిమాలో ఎంతో మంది నటీనటులు కనిపిస్తారు. అయితే ఎంత మంది కనిపించినా అందరి చూపు మాత్రం రిషభ్ శెట్టి మీద పడుతుంది. రిషభ్ శెట్టి నటన ఏ స్థాయిలో ఉంటుందనేది క్లైమాక్స్ వరకు ఎవ్వరూ ఊహించలేరు. రిషభ్ శెట్టి లాంటి నటులు ఇంకా ఎవరైనా ఉంటారా? అనే స్థాయిలో నటించేశాడు. రిషభ్ శెట్టి కనిపించిన తీరుకు అందరూ దండం పెట్టేస్తారు.
ఈ సినిమా ప్రాణం అంతా కూడా ఆ క్లైమాక్స్ ఎపిసోడ్‌లోనే పెట్టినట్టు అనిపిస్తుంది. రిషభ్ కూడా ఈ కోణంలోనే కథ రాసుకున్నట్టు అనిపిస్తుంది. ముందు అంతా కూడా తనలోని ఓ కోణాన్ని చూపించుకుంటే.. చివర్లో మాత్రం మరో కోణాన్ని ఆవిష్కరించేసుకున్నాడు. దర్శకుడిగా, హీరోగా ఒకేసారి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేశాడా? అని అందరూ ఆశ్చర్యపోవాల్సిందే.
అచ్యుత్‌కు పర్ఫామెన్స్ చేసే స్కోప్ బాగా దొరికింది. విభిన్న షేడ్స్‌లో మెప్పించాడు. ఇక అటవీ అధికారికా కిషోర్ మెప్పించాడు. లీల పాత్రలో హీరోయిన్గా కనిపించిన సప్తమీ గౌడ అద్భుతంగా అనిపిస్తుంది. అందంగా కనిపించడమే కాదు.. చివర్లో యాక్షన్ సీక్వెన్స్‌లోనూ మెప్పించింది.
అద్భుతమైన సౌండ్ డిజైనింగ్, అజనీష్ లోక్నాధ్ సంగీతం, రిషబ్ నటన-దర్శకత్వం, భూత కోలా ఎపిసోడ్స్, చివరి 20 నిమిషాల కోసం “కాంతార” చిత్రాన్ని థియేటర్లో రెండుసార్లు చూసినా తనివి తీరదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే.. ప్రతి ఒక్క సినిమా అభిమాని కచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా “కాంతార”.
ప్లస్ పాయింట్స్ :
- రిషబ్ నటన దర్శకత్వం
- అజనీష్ లోక్‌నాథ్ సంగీతం
- భూత కోలా ఎపిసోడ్స్
- క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
- స్లో గా సాగే కొన్ని సన్నివేశాలు
రేటింగ్ :
4 /5
ట్యాగ్ లైన్ :
కొన్ని సినిమాలను మనం లెక్కలేసుకుని చూడకుండా ఆస్వాదించాలి. అందులో ఈ ‘కాంతార’ కూడా ఒకటి.
End of Article