“ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు” అన్న పాట అక్షర సత్యం. నిజంగానే ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. తన కూతురు జలుబు చేసి అవస్థ పడుతుంటే చూడలేక.. మందు తీసుకొద్దామని బయటకు వచ్చిన ఆ తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ విషాద ఘటన అనంతపురం లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే, అనంతపురానికి చెందిన జాస్మిన్ (29) శ్రీనివాస్ నగర్ కు చెందిన జగదీష్ ను ప్రేమించింది. వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల పాప కూడా ఉంది. అయితే ఆ పాపకు జలుబు చేసి ఇబ్బంది గా ఉంది. గురువారం రాత్రి సమయం లో శ్వాస అందక ఆమె అవస్థపడుతుంటే కన్న తల్లిగా జాస్మిన్ చూడలేకపోయింది. బయటకు వెళ్లి మందు తీసుకొస్తానని బయలుదేరింది.
జగదీశ్ వారించినా ఆమె వినిపించుకోకుండా బయటకు వెళ్ళింది. అర్ధరాత్రి రెండు గంటల సమయం లో ఆమె మందుల చీటీ తీసుకుని బయటకు వచ్చింది. చంద్ర ఆసుపత్రి సర్కిల్ దాటి వస్తుండగా వేగం గా వస్తున్న కారు ఆమెను ఢీకొంది. దీనితో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయం లో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఈ సమాచారాన్ని జగదీశ్ కు అందించారు.
ఆ సమయం లో గస్తీ కాస్తున్న కానిస్టేబుల్ శివకుమార్ ఆ కార్ డ్రైవర్ ను పట్టుకున్నారు. జాస్మిన్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. బిడ్డకోసం అంత రాత్రివేళ బయటకొచ్చిన ఆమె మృత్యువు కు బలి అయిపోవడం తో స్థానికులు కలత చెందారు. జగదీశ్ కన్నీరు మున్నీరవుతున్నారు.