Ads
వారిద్దరికీ పెళ్లి అయ్యి ఏడాదే అయ్యింది. మూడు ముళ్లతో ముడిపడి.. అందరికీ దూరంగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఒకరికి ఒకరిగా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వీరిని చూసి విధికి కన్నుకుట్టింది అనుకుంటా..భర్తను హార్ట్ ఎటాక్ రూపంలో మృత్యువు తీసుకెళ్లిపోయింది. అది తట్టుకోలేక తనువు చాలించింది భార్య..ఈ గుండెలు పిండేస్తున్న ఘటన హైదరాబాద్‌లోని అంబర్ పేటలో జరిగింది.
Video Advertisement
హైదరాబాద్ అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన సాహితి(29)కి వనస్థలిపురానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మనోజ్‌తో ఏడాది కిందట వివాహం జరిగింది. వివాహానంతరం దంపతులు ఇద్దరూ అమెరికా వెళ్లిపోయారు. ఇద్దరూ డల్లాస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. తల్లిదండ్రులను చూసేందుకు ఈ నెల 2వ తేదీన సాహితి హైదరాబాద్ వచ్చింది. ఆమె హైదరాబాద్‌లో ఉన్న సమయంలో అమెరికాలో ఉన్న మనోజ్‌కు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.
భర్త మరణవార్త తెలిసినప్పటి నుంచి సాహితి తీవ్ర మనో వేదనకు గురైంది. ఈ నెల 23న మనోజ్ భౌతికకాయాన్ని అమెరికా నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. బుధవారం మనోజ్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత సాహితిని అంబర్‌పేటలోని పుట్టింటికి తీసుకెళ్లారు. మనోజ్ అంత్యక్రియలు తర్వాత సాహితి ఇంకా కుమిలిపోయింది. సాహితి బాధను చూసి ఆమె చెల్లెలు అక్కను క్షణం కూడా వదలకుండా పట్టుకోనే ఉంది. రాత్రి కూడా అక్కను అంటిపెట్టుకోనే పడుకుంది.
అయితే గురువారం ఉదయం తొమ్మిదిన్నర సమయంలో.. సాహితి చెల్లెలు వాష్‌రూమ్‌కని అక్కను విడిచి బయటకు వెళ్లింది. అమె బయటకు వెళ్లి వచ్చేటప్పటికి గదికి లోపలి నుంచి లాక్ చేసి ఉంది. అక్కను ఎంత పిలిచినా పలకలేదు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూస్తే.. చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా వేలాడుతోంది సాహితి.
చెల్లి బయటకు వెళ్లిన పది నిమిషాల్లోనే సాహితి ఈ కఠిన నిర్ణయం తీసుకోవటం కుటుంబసభ్యులను కలచివేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి జరిగిన ఏడాదిలోనే.. రోజుల వ్యవధిలో ఇద్దరు భార్యభర్తలు ఇలా చనిపోవటం పట్ల బంధువులంతా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.
Also read: ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు..! కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!
End of Article