Ads
ఓ బేబీ సినిమాతో హిట్ కొట్టి, డైరెక్టర్ గా మరొక మెట్టు ఎక్కిన దర్శకురాలు నందిని రెడ్డి. ఆ సినిమా తర్వాత మళ్లీ చాలా కాలం వరకు నందిని సినిమా రాలేదు. ఇప్పుడు అన్నీ మంచి శకునములే సినిమాతో మళ్ళీ ప్రేక్షకులు ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : అన్నీ మంచి శకునములే
- నటీనటులు : సంతోష్ శోభన్, మాళవిక నాయర్, గౌతమి.
- నిర్మాత : ప్రియాంక దత్
- దర్శకత్వం : నందిని రెడ్డి
- సంగీతం : మిక్కీ జే మేయర్
- విడుదల తేదీ : మే 18, 2023
స్టోరీ :
రిషి (సంతోష్ శోభన్), ఆర్య (మాళవిక నాయర్) పుట్టిన వెంటనే డాక్టర్లు వారిద్దరిని మార్చేస్తారు. అందుకు కారణం వారి ఇద్దరి కుటుంబాల మధ్య పూర్వీకుల నుండి వస్తున్న ఆస్తులు వల్ల అవుతున్న గొడవలే. తర్వాత వాళ్ళిద్దరూ పెరిగి పెద్దగా అవుతారు. వారితో పాటు వారి కుటుంబాల మధ్య గొడవలు కూడా పెరుగుతాయి. కాని వీరు మాత్రం ఒకరిని ఒకరు ప్రేమిస్తారు. అసలు వారి కుటుంబానికి మధ్య ఉన్న గొడవ ఏంటి? దాన్ని వీళ్ళిద్దరూ ఎలా పరిష్కరించారు? వీరు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వీరి ప్రేమ విషయం వారి ఇళ్లల్లో ఎలాంటి పరిణామాలు సృష్టించింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
Anni Manchi Sakunamule Review రివ్యూ :
కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు నందిని రెడ్డి. కుటుంబ కథా చిత్రం అంటే కేవలం కుటుంబం చుట్టూ మాత్రమే నడవడం కాకుండా, అందులో ఉన్న ముఖ్య నటీనటుల ప్రేమ కథకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ దాదాపు ఇలాగే ఉంటాయి. ఒక పక్క హీరో హీరోయిన్ల ప్రేమ కథ ఉంటూనే, మరొక పక్క కుటుంబం ఎమోషన్స్ కి కూడా సినిమాలో ప్రాముఖ్యత ఇస్తారు. ఈ సినిమా కూడా అలాగే ఉంది.
సినిమా మొత్తం రిషి, ఆర్య అనే ఇద్దరి మనుషుల చుట్టూ తిరిగినా కూడా, సినిమా ఎక్కువగా వారి కుటుంబ నేపథ్యాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద నడుస్తుంది. సినిమా కథ పెద్దగా ఏమీ ఉండదు. చాలా సినిమాల్లో ఇలాంటి కథలు చూస్తూనే ఉంటాం. కానీ ఇలాంటి సినిమాలకి ఆ డైరెక్టర్ టేకింగ్ స్టైల్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ సినిమాని కూడా నందిని రెడ్డి తనదైన స్టైల్ లో హ్యాండిల్ చేశారు. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సంతోష్ శోభన్ ఇలాంటి పాత్రలు చాలా చేశారు.
ఇప్పుడు కూడా దాదాపు అలాంటి పాత్ర చేశారు. కాకపోతే అంతకుముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో మాత్రం నటనపరంగా చాలా పరిణితిగా నటించారు. హీరోయిన్ మాళవిక నాయర్ కూడా తన పాత్రకి తగ్గట్టుగా నటించారు. సినిమాలో చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. గౌతమి, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సీనియర్ నటి షావుకారు జానకి, నరేష్ ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరూ మనకి తెలిసిన వారే. వీరందరితో పాటు తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలిగా నటించిన వాసుకి కూడా చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో మళ్ళీ కం బ్యాక్ ఇచ్చారు.
ఈ సినిమాకి సపోర్టింగ్ పాత్రల్లో నటించిన వారే హైలైట్ అయ్యారు. పాటలు కూడా సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. కానీ గొప్పగా ఏమీ లేవు. ఒక్క టైటిల్ సాంగ్ తప్ప మిగిలిన పాటలు పెద్దగా గుర్తు కూడా ఉండవు ఏమో. కానీ టేకింగ్ విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. సినిమా కథ మామూలుగా ఉన్నా కూడా చూసే ప్రేక్షకులకి ఆసక్తికరంగా చూపిస్తే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ సినిమా చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. డైరెక్టర్ ఎమోషన్స్ ని తెరపై చూపించడానికి సమయం తీసుకున్నారు అని అర్థం అవుతోంది.
కానీ అది చాలా చోట్ల చాలా సీన్స్ చాలా స్లో గా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ మాత్రం తెరపై చాలా బాగా వచ్చాయి. అందులోనూ సినిమాలో ఉన్న ముఖ్య నటినటులు బాగా అనుభవం ఉన్నవారు కావడంతో, అందులోనూ ఇలాంటి సహజమైన నటనకి పెట్టింది పేరు అయిన నటులు కావడంతో, వారు నటిస్తూ ఉంటే మనం ఇంకా ఎమోషన్ బాగా ఫీల్ అవుతాం. కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగానే వచ్చాయి. కానీ ఏదేమైనా సినిమా చాలా నెమ్మదిగా నడుస్తుంది కాబట్టి కొన్ని చోట్ల చూసే ప్రేక్షకుడికి సహనానికి పరీక్ష ఎదురవుతుంది.
ప్లస్ పాయింట్స్ :
- నిర్మాణ విలువలు
- సహాయ పాత్రల్లో నటించిన వారి నటన
- కొన్ని కామెడీ సీన్స్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- సాగదీసినట్టుగా అనిపించే కొన్ని సీన్స్
- పాటలు
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
తెలుగులో ఫీల్ గుడ్ సినిమాలు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతున్న విషయం. కథ నుండి మాత్రమే కాకుండా, టేకింగ్ నుండి కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూద్దాం అనుకునే వారికి అన్నీ మంచి శకునములే సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
మరికొన్ని వార్తలు: “లీడర్” సినిమాలో చెప్పే “చితిలోనే సీమంతం” అంటే ఏంటి..? ఆ కథ ఏంటో తెలుసా..?
watch trailer :
End of Article