కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలందరూ లాక్ డౌన్ పాటిస్తుంటే, మన నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్టుగా మాయమయ్యారు.ఎవరో ఒకరిద్దరు ఫోటో పోజులకి దానాలు, ధర్మాలు చేస్తుంటే .. ఒకరు మాత్రం కరోనా కాలంలో కూడా ప్రజలకోసం కష్టపడుతూ, ప్రజల మధ్యే ఉంటే ప్రజాసేవ చేస్తూ నిజమైన ప్రజాప్రతినిధి అనిపించుకుంటున్నారు.ఆవిడే సీతక్క.. ములుగు ఎమ్మేల్యే..ఒకప్పుడు నా చేతిలో తుపాకీ ఉండేది, ఇప్పుడు బియ్యం, కూరగాయలు ఉంటున్నాయని ఆమె ఆనందంగా చెబుతున్నారు.

Video Advertisement

ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, పస్రా ప్రాంతాలకు చెందిన వాళ్ళు  ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్ళి వచ్చారు, వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది.. కిరాణా షాపులు నిర్వహిస్తున్న వీరికి కరోనా పాజిటివ్ రావడంతో బాధితుల కుటుంబ సభ్యులను, వారితో దగ్గరగా మెలిగిన వారిని కూడా క్వారంటైన్ సెంటర్లకు తరలించారు.

ఆ జిల్లాను నో మూవ్ మెంట్ జోన్ గా ప్రకటించి ప్రజలు బయటకు రావద్దని ప్రకటించారు.దీంతో ప్రజలకు నిత్యావసర సరుకులు కూడా  దొరకని స్థితి.అక్కడ పరిస్థితులను గమనించే ఎమ్మేల్యే సీతక్క తనే స్వయంగా రంగంలోకి దిగి అక్కడ ప్రజలకు అండగా నిలబడుతున్నారు.

ములుగు నియోజకవర్గం అంటే పూర్తిగా ఏజన్సి ప్రాంతం, దట్టమైన అడవులు, గిరిజన తెగలు..  రోడ్డు మార్గం కూడా కరువైన ప్రాంతాలు..అలాంటి ప్రాంతాల్లో కాలినడకనైనా ప్రయాణిస్తూ అక్కడి ప్రజలకు కరోనా గురించి అవగాహన కల్పిస్తున్నారు. కరోనా ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, వ్యక్తి గత శుబ్రత తదితర విషయాలను గిరిజనులకి వివరిస్తున్నారు, వారికి కావలసిన నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు సీతక్కా.

ప్రజాప్రతినిధులంతా ప్రజలకు అండగా ఉండాలి. ప్రజల బాగోగులు చూస్కోవాలని సిఎం ప్రకటించినప్పటికి అధికార పార్టికి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మేల్యే కూడా బయటికి వచ్చిన దాఖలాలు లేవు. కాని ప్రతిపక్ష పార్టీ ఎమ్మేల్యే అయినప్పటికి  సీతక్క చేస్తున్న ప్రజాసేవను అందరూ కొనియాడుతున్నారు.సోషల్ మీడియాలో వైరలవతున్న సీతక్క ఫోటోలు, వీడియోలు చూసిన నెటిజన్లంతా ప్రజాప్రతినిధులంతా తనని చూసి నేర్చుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు.