చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని, పిల్లలను కష్టపడి పెంచి ప్రయోజకుల్ని చేస్తోనన తల్లులను మన చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం. భర్తలేని ఒంటరి మహిళలను మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించమని చెప్పేవాళ్లు చాలా అరుదు. కానీ కన్న బిడ్డలు దగ్గరుండి తమ తల్లికి పెళ్లి చేయడం ఎక్కడైనా చూశామా.. తమిళనాడులోని ఇద్దరు కుమారులు తమ తల్లిని ఒప్పించి పెళ్లి చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Video Advertisement
కల్లకురిచి జిల్లా వలయమ్పట్టు గ్రామానికి చెందిన సెల్వి అనే మహిళకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కొడుకకు భాస్కర్, చిన్న కొడుకు వివేక్. వీరు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. పిల్లల్ని కస్టపడి ప్రయోజకుల్ని చేసారు సెల్వి. భాస్కర్ డిగ్రీ మూడో ఏడాది చదువుతున్నప్పుడు అతడి టీచర్ మీ అమ్మకు ఎందుకు రెండో పెళ్లి చేయకూడదు అని ప్రశ్నించింది. ఆ సమయంలో టీచర్ అన్నమాటలు భాస్కర్ జీర్ణించుకోలేకపోయాడు.
ఆ తర్వాత తన కాలేజీ చదువు ముగించుకుని, ఉద్యోగంలో చేరిపోయాడు. దాదాపు తన టీచర్ చెప్పిన ఆ మాటలు మర్చిపోయాడు. అయితే, భాస్కర్‌కు పుస్తకాలు చదివే అలవాటు ఉండటంతో ప్రముఖ తమిళ రచయిత పెరియార్ రాసిన పుస్తకాలు చదివేవాడు. అందులో వితంతు పునర్వివాహాలు పెరియార్ సమర్ధిస్తూ గొప్పగా రాయడంతో భాస్కర్ మదిలో టీచర్ తన తల్లి గురించి చెప్పిన మాటలు గుర్తుకురాసాగాయి. భర్తను కోల్పోయిన తన తల్లి కూడా ఒంటరిగా గడుపుతోందని, ఆమె మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకోకూడదని ఆలోచించాడు.
ఇదే విషయాన్ని తన తమ్ముడు వివేక్‌తో చర్చించాడు. ఇద్దరు కలిసి తమ తల్లిని ఒప్పించారు. తల్లిని తొలుత వివాహం చేసుకోవాలని, ఆ తర్వాత తాము కూడా పెళ్లిళ్లు చేసుకుంటామని సెల్వితో అన్నారు. కొడుకులు మాటలు విని ఆమె నిర్ఘాంతపోయింది. వారిని తిట్టి పోసింది. కానీ పిల్లలిద్దరూ రోజూ ఇదే విషయమై ఆమెను బతిమిలాడటంతో చివరకు రెండో వివాహానికి సెల్వీ అంగీకరించింది.
సెల్వీ రెండో పెళ్లికి అంగీకరించినట్టు తెలిసిన వారి బంధువులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోనివారికి తన రెండో పెళ్లి గురించి మాట్లాడే అధికారం లేదని బంధువులకు గట్టిగా సమాధానం ఇచ్చింది. ఒంటరి మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఆమె పేర్కొంది. తాను వివాహం చేసుకోవడం వల్ల తనలాంటి ఎందరో మహిళలకు ప్రేరణగా నిలుస్తానని సెల్వీ బలంగా నమ్మింది.
తల్లికి తగిన వ్యక్తికోసం వెతికిన ఆమె కుమారులు.. చివరకు యేలుమలై అనే ఓ రైతు కూలీని చూసి సెల్వికి వివాహం జరిపించారు. కానీ, ఆమె పునర్వివివాహానికి బంధువులు ఎవ్వరూ హాజరుకాలేదు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పెరిగిన తన కుమారులు సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారని, వారిని చూస్తే నా కెంతో గర్వంగా ఉందని సెల్వీ సంతోషం వ్యక్తం చేశారు.