65 ఏళ్ళ తండ్రికి 35 ఏళ్ళ కొడుకు ఎమోషనల్ లెటర్..! “ఇప్పుడే నీ కష్టం తెలిసింది..!” అంటూ..?

65 ఏళ్ళ తండ్రికి 35 ఏళ్ళ కొడుకు ఎమోషనల్ లెటర్..! “ఇప్పుడే నీ కష్టం తెలిసింది..!” అంటూ..?

by Harika

Ads

నాన్నా,

Video Advertisement

ఎలా ఉన్నావ్? ఫోన్లు చేసే జనరేషన్ లో, ఈ ఉత్తరం రాస్తున్నాను ఏంటి అని ఆలోచిస్తున్నావా? మాట్లాడే ధైర్యం లేదు నాన్నా నాకు. ఇవన్నీ నీతో మాట్లాడాలంటే భయం. ఒకరకంగా చెప్పాలి అంటే ఇగో ఏమో. కానీ ఇవన్నీ నీకు చెప్పాలి అని ఉంది. అందుకే ఉత్తరం రాస్తున్నాను. ముందుగా థాంక్యూ. ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వు. ఈ మాట నేను నీకు ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఎన్నో సంవత్సరాల నుండి ఈ మాట నీకు చెప్పాలి అని అనిపించింది. చిన్నప్పుడు నేను ఏదైనా అడిగితే కొనివ్వడానికి ఆలోచించేవాడివి. నీకు నేనంటే ఇష్టం లేదు అని అనుకునేవాడిని. మన పరిస్థితి అలా ఉండేది అని నాకు మాత్రం ఏం తెలుసు? తర్వాత మన పరిస్థితులు ఏంటో తెలిసి వచ్చాక నువ్వు పడుతున్న కష్టం అర్థం అయ్యింది.

man story about a sad incident

ఏదో ఒకటి చేసి నీ బాధ్యతని పంచుకోవాలి అనుకున్నాను. అందుకే కష్టపడి ఉద్యోగం సంపాదించి ఇప్పుడు ఈ పొజిషన్ కి వచ్చాను. నాకు స్వాతి నచ్చింది అని ఇంటికి తీసుకు వచ్చినప్పుడు, అమ్మ కోప్పడింది. నాతో మాట్లాడలేదు. కానీ నువ్వు అలా చేయలేదు. నాకు సపోర్ట్ చేశావు. “వాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అంటే, అన్ని ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటాడు” అని అమ్మకి చెప్పావు. ఈరోజు మీ నమ్మకాన్ని నిలబెట్టినందుకు నాకు గర్వంగా అనిపిస్తుంది. పదేళ్ల తర్వాత ఉద్యోగం మానేసి సినిమాల వైపు వెళ్తాను అని చెప్పాను.

అప్పుడు కూడా అమ్మ, “డైరెక్టర్ అవడం అంటే మామూలు అనుకున్నావా?” అంటూ బాధపడింది. “మేం చదివించిన చదివంతా వృధా అయిపోయినట్టేనా?” అని నా మీద నాకే ఏదో ఒక తప్పు చేసిన భావన వచ్చేలాగా మాట్లాడింది. కానీ నువ్వు మాత్రం, “చదువు అనేది జీవితంలో ముందుకు వెళ్లడానికి ఉపయోగపడాలి కానీ కలలు వదిలేసుకోవడానికి కాదు. వాడికి ఎన్నో సంవత్సరాల నుండి సినిమాల వైపు వెళ్లాలని ఉన్నా కూడా మనం ఆర్థికంగా స్థిరపడ్డాక మాత్రమే అటువైపు వెళ్ళాలి అని ఇన్ని సంవత్సరాలు ఆగాడు. ఈరోజు మనం ఇంత సంతోషంగా బతకడానికి వాడి కష్టం కూడా ఉంది. అలాంటిది మనం వాడి కలని సపోర్ట్ చేయకపోతే ఎలా? నువ్వు వెళ్ళరా. ఓపికతో కష్టపడు” అని చెప్పావు.

అప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అసిస్టెంట్ డైరెక్టర్ గా నా పేరు సినిమాలో రావడం చూసి ఫోటో తీసి పంపావు. అసలు సినిమాలకే వెళ్లని నువ్వు నాకోసం సినిమాకి వెళ్ళావు. చాలా మంది తమ కుటుంబం అంగీకారం లేకపోవడం వల్ల ప్రేమించిన వారిని, ఇష్టమైన కెరీర్ ని వదులుకుంటారు. కానీ అలంటి ముఖ్యమైన వాటిలోనే నువ్వు నాకు అండగా నిలబడ్డావు. ఇప్పుడు నేను కూడా తండ్రయ్యాక నీ కష్టం తెలుస్తోంది నాన్న. ఏదైనా కొనాలి అంటే ఎందుకు ఆలోచించేవాడివో ఇప్పటికి అర్ధం అయ్యింది. నీ లాగా నేను కూడా నా కొడుకుని పెంచాలి అని అనుకుంటున్నా. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.

ఇట్లు
రాజేష్


End of Article

You may also like