Ads
కలలు అందరూ కంటారు. కానీ వాటిని నిజం మాత్రం కొందరే చేసుకుంటారు. ఆ కలలని నిజం చేసుకోవడం వెనుక ఎన్నో సంవత్సరాల కృషి ఉంటుంది. అది ఎవరికీ కనిపించదు. ఇప్పుడు మీరు చదువుబోయేది అలాంటి ఒక మహిళ గురించి. బైరి స్వరాజ్యలక్ష్మి. సికింద్రాబాద్ దగ్గర ఉన్న మచ్చ బొల్లారంలో ఉంటారు. స్వరాజ్యలక్ష్మి వయసు 40 దాటింది. ఆమె భర్త ఒక ప్రైవేటు ఉద్యోగి. ఆయన పేరు ధనరాజ్. వాళ్లకి ఒక కొడుకు ఉన్నాడు. స్వరాజ్యలక్ష్మి కండక్టర్ గా విధులు నిర్వహించేవారు. చిన్నప్పుడు తనకి పరుగు పందాలు అంటే చాలా ఇష్టం ఉండేది. స్వరాజ్యలక్ష్మి తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో స్వరాజ్యలక్ష్మి రైల్వే కాలేజ్ లో చదువుకున్నారు.
Video Advertisement
స్కూల్, ఇంటర్మీడియట్ స్థాయిలో రన్నింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొన్నారు. కానీ ఇంటర్మీడియట్ అవ్వగానే తన ఇంట్లో వాళ్ళు చదువు ఆపేయమని చెప్పారు. దాంతో పాటు పరుగు పందాల్లో పాల్గొనడం కూడా ఆపేశారు. తర్వాత తాను కొంత వరకు మాత్రమే చదువుకున్నా కూడా, ఉద్యోగం చేస్తాను అని భర్తకి స్వరాజ్యలక్ష్మి చెప్పారు. భర్త ప్రోత్సాహంతో 20 సంవత్సరాల క్రితం ఆర్టీసీ కండక్టర్ గా చేరారు. దాదాపు 12 సంవత్సరాల క్రితం ఆర్టీసీ నుండి స్పోర్ట్స్ తెలిసినవారు ఎవరైనా దేశ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలి అని చెప్పారు. అప్పుడు స్వరాజ్యలక్ష్మి ఇంట్లో కూడా మద్దతు ఇవ్వడంతో మళ్ళీ పరుగు పందాలలో పాల్గొన్నారు. తన వృత్తిని, ట్రైనింగ్ ని మేనేజ్ చేసుకున్నారు స్వరాజ్యలక్ష్మి.
అలా 2018 లో ఇండోనేషియాలో జరిగిన పరుగు పందాలలో పాల్గొని బంగారు పతకం గెలిచారు. ఆ తర్వాత ఇండోనేషియాలో ఉన్న జకార్తాలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్ పోటీల్లో బంగారు పతకాలు, మూడు కిలోమీటర్ల నడక పందెంలో కాంస్య పథకం పతకం, 2019 లో గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్రస్థాయి పరుగు పందాల్లో 100,400,800 మీటర్ల విభాగంలో బంగారు పతకాలు సాధించారు. చదువుకునే రోజుల్లో తనకి ఆటలు ఆడవద్దు అని అమ్మానాన్నలతో పాటు, బంధువులు కూడా చెప్పారు. ఇప్పుడు అమ్మానాన్నలు, బంధువులు మాత్రమే కాకుండా తన చెల్లెళ్లు కూడా తన గురించి గొప్పగా చెప్పుకుంటారు అని 2020 లో ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వరాజ్యలక్ష్మి తెలిపారు. కష్టపడితే ఏదైనా సాధించగలము అని స్వరాజ్యలక్ష్మి నిరూపించారు.
End of Article